మ‌రోసారి తానేంటో నిరూపించిన రామోజీ..!

November 23, 2017 at 1:06 pm

గోడ‌కు కొట్టిన బంతిని ఎంత వేగంతో కొడ‌తామో.. అంతే వేగంతో మ‌ళ్లీ దూసుకొస్తుంది! పైకి విసిరిన రాయి కూడా రెట్టింపు వేగంతో కిందకు ప‌డుతుంది. ఇక కింద‌కు ప‌డిన అల కూడా ఉవ్వెత్తున ఎగ‌సిప‌డుతుంది. ఇక ఆయ‌న‌ ప‌ని అయిపోయింది అనుకునేలోగానే తిరిగి ఊహించ‌ని స్థాయికి, ఎవరికీ అంద‌నంత ఎత్తుకు ఎదిగిన వ్య‌క్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వ్య‌క్తుల్లో మీడియా మొఘ‌ల్, ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు మొద‌టి వ‌రుస‌లో నిలుచుంటారు. ఎంతోమందికి రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చి.. తిరుగులేని శక్తిగా చేసిన విష‌యం ఎవ‌రూ మ‌రిచిపోలేదు. త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను కూడా దారికి తెచ్చుకుని వారి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి త‌నకు తాను సాటి అని నిరూపించుకున్నారు. రామోజీనా మ‌జాకానా అని అనిపించుకున్నారు.  

మీడియా మొఘల్, స్వతహాగా సమైక్యవాది అయిన రామోజీరావు మాత్రం విభజన తర్వాత కూడా తన హవా కొనసాగిస్తున్నారు. ఎంత‌టి వారైనా త‌న దాసులు కావాల్సిందేన‌ని నిరూపిస్తూనే ఉన్నారు. వైఎస్ హ‌యాంలోనూ, సాక్షి వ‌చ్చిన తొలినాళ్లలోనూ ఈనాడుకి కొంత గ‌డ్డు ప‌రిస్థితి ఎదురైనా దానిని స‌మ‌ర్థంగా ఎదుర్కొని.. ఈనాడుని నిల‌బెట్టారు. ఇక అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. తెలంగాణ‌లోని ఫిల్మింసిటీని వెయ్యి నాగ‌ళ్ల‌తో దున్నిస్తాన‌ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే.. ఫిల్మ్‌సిటీకి వెళ్లి.. రామోజీ ఆశీస్సులు తీసుకున్నారు. అస్సలు ఫిల్మ్‌సిటీలో అంతా స‌క్ర‌మంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు. 

మళ్ళీ తన పూర్వ వైభవాన్ని స్వంతం చేసుకున్నారు. దీంతో శత్రువు కావాల్సిన కేసీఆర్ ఆప్త మిత్రుడు అయిపోయారు. ఇక ఏపీ లో మరోసారి తను సీఎం కావడానికి కారణమైన రామోజీకి చంద్రబాబు ఎప్పుడూ విధేయులే. మరో వైపు విపక్ష నేత జగన్ సైతం రామోజీని ఇప్పటికే రెండు సార్లు కలిశారు. ఉన్నత రాజకీయ లక్ష్యాలు ఉన్న ఎవరైనా సరే రామోజీ దర్శనం చేసుకోకుండా ఉండడం లేదు. ఆయ‌న స‌ల‌హాలు తీసుకోవ‌డం మాన‌డం లేదు. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా రామోజీరావుతో భేటీ అయ్యారు. ఇక‌ తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత, సీఎం కుర్చీ ఎక్కాలనే ఆకాంక్ష మెండుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం రామోజీని కలిసి గంటకు పైగా చర్చించారట‌.

కొత్త పార్టీ ఆలోచనను ఆయన తో పంచుకున్నారని సమాచారం. రాజ‌కీయ నాయ‌కుల‌కు త‌న విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ వారికి మార్గ‌ద‌ర్శిలా మారిపోయారు. మ‌రి ఇంత‌లా రామోజీ తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించు కున్నారంటే అందుకు ఆయన శక్తి యుక్తులే. ప్రత్యర్థి కన్నా ఒక అడుగు ముందు ఆలోచించడం, అనూహ్య మైన వ్యూహాలతో పని చేయడం రామోజీ బలం. తన మీడియాను అగ్రగామిగా ఉంచడం, అలాగే ప్ర‌ధాని మోదీ దగ్గర ఆయనకు ఉన్న ప్రాధాన్యత కూడా రాష్ట్రంలో రాజకీయ నేతలకు ఆయన్ని తిరిగి రాజ గురువుగా మార్చింది. ఇక ఆయ‌న హ‌వాకు మ‌రికొన్నేళ్లు తిరుగులేద‌ని మ‌రోసారి అంద‌రికీ తెలిసేలా చేశారు! ఎంతైనా ద‌టీజ్ రామోజీ క‌దా!! 

మ‌రోసారి తానేంటో నిరూపించిన రామోజీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts