డిటెక్టివ్‌ TJ రివ్యూ

November 10, 2017 at 8:12 am

టైటిల్‌: డిటెక్టివ్‌

బ్యాన‌ర్‌: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ

న‌టీన‌టులు: విశాల్‌, ప్ర‌స‌న్న‌, అను ఇమ్మాన్యుయేల్‌, ఆండ్రియా, సిమ్ర‌న్‌, విన‌య్ త‌దిత‌రులు

మ్యూజిక్‌: అరుళ్ కొరోలి

సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ వెంక‌ట్రామ‌న్‌

ఎడిటింగ్‌: అరుణ్‌కుమార్‌

నిర్మాత‌: జి. హ‌రి

ద‌ర్శ‌క‌త్వం: మిష్కిన్‌

రిలీజ్ డేట్‌: 10 న‌వంబ‌ర్‌, 2011

విశాల్ ఇప్పుడు ఈ పేరు సౌత్ ఇండియాలో మార్మోగిపోతోంది. ఓ వైపు నడిగ‌ర్ సంఘంలో కీల‌క వ్య‌క్తి. ఓ వైపు సినిమాలు, మ‌రో వైపు ప్ర‌జాసేవ‌, ఎదుట ఉన్న వారు ఎలాంటి వ్య‌క్తులు అయినా ధైర్యంగా పోరాడే గుండె నిబ్బ‌రం ఉన్న వ్య‌క్తి. ఇవ‌న్నీ విశాల్‌ను కేవ‌లం త‌మిళ సినిమా రంగంలోనే కాకుండా టోట‌ల్‌గా సౌత్ ఇండియాలో అన్ని భాష‌ల్లోను అత‌డిని హీరోను చేసేశాయి. విశాల్ లేటెస్ట్ సినిమా `తుప్ప‌రివాల‌న్‌` త‌మిళంలో మంచి విజయాన్ని సాధించింది. తెలుగులో `డిటెక్టివ్‌`గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా ఇక్క‌డ మ‌న‌కు ఎంతవ‌ర‌కు క‌నెక్ట్ అవుతుందో ? మ‌న ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు మెప్పిస్తుందో ? చూద్దాం.

క‌థ :

అద్వైత భూష‌ణ్ అలియాస్ ఆది (విశాల్‌) ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌. ఆది డ‌బ్బుకు ఏ మాత్రం లొంగ‌డు. మ‌నోడికి కుటుంబం, స్నేహితుడు మ‌ను (ప్ర‌స‌న్న‌) లోకంగా జీవిస్తుంటాడు. త‌న డిటెక్టివ్ ప్ర‌య‌త్నంలో ఎవ్వ‌రికి ఎలాంటి ఇబ్బంది క‌లుగుతుంద‌ని తెల‌సినా అత‌డు మాత్రం ఆ ప్రాజెక్టుల‌ను టేక‌ప్ చేయ‌డు. అలాంటి మ‌న‌స్తత్వం ఉన్న ఆది ఓ చిన్న‌పిల్లాడు త‌న కుక్క‌పిల్ల చ‌నిపోయింద‌ని, దాని గురించి క‌నిపెట్ట‌మ‌ని వ‌చ్చి అడ‌గ్గానే ఒప్పుకుంటాడు. ఆ కుక్క‌పిల్ల చావుగురించి అత‌డు ఇన్వెస్ట్‌గేష‌న్ చేస్తోన్న టైంలో అత‌డికి చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుంటోన్న ఆదికి దిమ్మ‌తిరిగి పోతుంటుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌మాదాలుగా చిత్రీక‌రించ‌బ‌డ్డ ప‌లు హ‌త్య‌లు వెలుగులోకి వ‌స్తాయి. ఈ క్ర‌మంలోనే ఆదికి మ‌ల్లిక (అను ఇమ్మాన్యుయేల్‌) ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆమెతో పాటు విల‌న్ గ్యాంగ్ మ‌నుషులు కూడా ఒక్కొక్క‌రుగా ప‌రిచ‌య‌మ‌వుతుంటారు. తీవ్ర ఉత్కంఠ మ‌ధ్య ఈ డిటెక్టివ్ క‌థ ఎటు మ‌లుపులు తిరిగి ? ఎలా ముగిసింది ? అన్న‌దే ఈ సినిమా.

TJ విశ్లేష‌ణ‌:

ఇది ఖ‌చ్చితంగా ద‌ర్శ‌కుడి సినిమా. మిష్కిన్‌తో సినిమా చేసేందుకు విశాల్ 8 సంవ‌త్స‌రాలుగా ఎందుకు వెయిట్ చేస్తున్నాడో ? ఈ సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. ప్రేక్ష‌కుడు ఆద్యంత తెర‌మీద ఏం జ‌రుగుతుందా ? అని ఊపిరి బిగ‌బ‌ట్టి మ‌రీ సినిమా చూస్తాడు. ప్రతి సీన్ చూడాల్సిందే… రెప్పాటులో ఒక్క సీన్ మిస్ అయితే ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుందో అర్థం కాదేమో ? అన్నంత గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో మిష్కిన్ ఈ సినిమా తెర‌కెక్కించాడు. రాజేశ్‌.ఎ.మూర్తి డైలాగులు సినిమాను నిల‌బెడుతాయి. ఒక కుక్క పిల్ల చావు వెన‌క ఇన్ని ఆస‌క్తిక‌ర అంశాలు ఉంటాయా ? అని సినిమా చూస్తే మ‌నం మెస్మ‌రైజ్ అవుతాం.

తెలివైన డిటెక్టివ్‌గా విశాల్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. విశాల్‌, అను ఇమ్మాన్యుయేల్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సిచ్యువేష‌న్ కామెడీ బాగుంది. ఫ్రెండ్ పాత్ర‌లో ప్ర‌స‌న్న చాలా బాగా ఒదిగిపోయాడు. నెగ‌టివ్ షేడ్స్ లో ఆండ్రియా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఫైట్ చేసే స‌న్నివేశాలు, బైక్ రైడింగ్ స‌న్నివేశాల్లో ఆండ్రియా చ‌క్క‌గా న‌టించింది. క్రూరుడైన విల‌న్‌గా విన‌య్ పాత్ర ఆక‌ట్టుకుంటుంది. త‌ను చ‌నిపోతున్న క్ర‌మంలో, ఇల్లాలి బాగోగులు చూసుకునేవారు లేర‌ని భాగ్య‌రాజ్ త‌న భార్య‌ను చంపే స‌న్నివేశాలు ఎవ‌రికైనా క‌న్నీళ్లు తెప్పిస్తాయి. క‌ళ్ల‌ముందే భ‌ర్త‌ను, కొడుకును పోగొట్టుకున్న సిమ్ర‌న్ బాధ ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను తాకుతుంది. చైనీస్ రెస్టారంట్‌లో జ‌రిగే ఫైట్‌, పిచ్చావ‌రం నీళ్ల‌ల్లో జ‌రిగే ఫైట్లు హైలైట్‌.

ద‌ర్శ‌కుడు క‌థ‌ను అల్లుకున్న విధానం, క‌థ‌నాన్ని మ‌ల‌చుకున్న తీరు అల్టిమేట్‌గా ఉన్నా హీరోయిన్ పాత్ర‌కు ప్రాధాన్యం లేక‌పోవ‌డం, హీరో, హీరోయిన్ల మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్ లేక‌పోవ‌డం మైన‌స్‌. కొన్ని సైంటిఫిక్ అంశాలు కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను క‌న్‌ఫ్యూజ్‌కు గురి చేయొచ్చు. ఫ‌స్టాఫ్ స్టార్టింగ్‌లో సినిమా కాస్త స్లోగా ఎత్తుకుంటుంది.

TJ ఫైన‌ల్ పంచ్‌: ఊపిరి బిగ‌ప‌ట్టి చూసే థ్రిల్ల‌ర్‌

TJ సూచ‌న‌: డిటెక్టివ్ & డిఫ‌రెంట్ & థ్రిల్ల‌ర్ సినీ ప్రియుల‌కు మాంచి విందు భోజ‌నం

TJ రేటింగ్‌: 3 / 5

 

డిటెక్టివ్‌ TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)