స్పీడు పెంచిన ప‌వ‌న్‌.. బ్యాక్ బోన్ ఎవ‌రు..!

February 15, 2018 at 10:59 am

అవును! జ‌న‌సేనాని ప‌వ‌న్ వేగం పెంచారు. ఏపీ విభ‌జ‌న హామీల‌పై ఆయ‌న మేధావుల‌ను ఏకం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి వారుగా ఉన్న మేధావులు.. ఇప్పుడు ఒకే స్టేజ్‌పైకి వ‌చ్చేందుకు ప‌వ‌న్ ఛాన్స్ ఇచ్చారు. జేఎఫ్‌సీ పేరుతో ఓ వేదిక‌ను ఏర్పాటు చేశారు. విభ‌జ‌న హామీల అమ‌లు స‌హా ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి వ‌చ్చిన నిధులు, వాటిని ఖ‌ర్చు చేసిన విధానం వంటి కీల‌క అంశాల‌పై ఈ జేఎఫ్‌సీ దృష్టి పెడుతుంది. నిజానికి ఇప్పుడున్న ఏపీ ప‌రిస్థితిలో ఈ త‌ర‌హా సాహ‌సం చేయ‌డం అంటే మాట‌లు కాదు. అయినా కూడా ప‌వ‌న్ త‌నంత‌తానుగా నిర్ణ‌యం తీసుకుని ఇలా జేఎఫ్‌సీ ఏర్పాటు చేయ‌డం, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం వంటివి అంద‌రినీ ఆలోచింప జేస్తున్నాయి. 

 

నిజానికి జ‌న‌సేన పార్టీని ప్ర‌క‌టించినా.. ఆయ‌న అంత యాక్టివ్‌గా పాలిటిక్స్‌లోకి రాలేదు. కేవ‌లం ఎవ‌రైనా స్వ‌యంగా వెళ్లి ఆయ‌న‌ను క‌లిస్తేనే స్పందించారు. ఆయా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. రాజధాని నిర్మాణం కోసం ఏపీ సర్కార్ బలవంతపు భూసేకరణ చేపట్టినపుడు తుళ్లూరు రైతులకు బాసటగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్ని బాధితుల సమస్యలపై గ‌ళ‌మెత్తారు..ఆత‌రువాత మంగ‌ళ‌గిరి చేనేత కార్మికుల స‌మ‌స్యలపై స‌భను పెట్టి వారి సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేశారు. 

 

ఇక‌, పెద్ద ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చింది కూడా లేదు. గ‌త ఏడాది వ‌రుస‌గా మూడు రోజుల క్యాంపు ప‌ర్య‌ట‌న నిర్వ‌హించి ఏపీ నుంచి నిష్క్ర‌మించిన ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో అడుగు పెట్ట‌లేదు. అటు నుంచి తెలంగాణ‌లో ఉద్య‌మం అంటూ కొండ‌గ‌ట్టు నుంచి యాత్ర నిర్వ‌హించాడు. మ‌ళ్లీ సైలెంట్ అయిపోతాడు.. అనుకున్న స‌మ‌యంలో అనూహ్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఏపీ విభ‌జ‌న స‌మ‌స్య‌ల వివాదంపై త‌నంట‌త తాను స్పందించారు. విభ‌జ‌న చ‌ట్టం అమలు కోసం చేయాల్సిన పోరు చాలానే ఉంద‌ని చెబుతూనే అది త‌న ఒక్క‌డి వ‌ల్ల కాద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. 

 

అందుకే జేఎఫ్‌సీ పేరుతో ఓ క‌మిటీని ఏర్పాటు చేస్తున్నానంటూ.. జేపీ, ఉండ‌వ‌ల్ల అరుణ్‌కుమార్‌ను క‌లుపుకొని.. ఓ వేదిక సిద్ధం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీనికిగాను ఆయ‌న స్ప‌ష్ట‌మైన దిశ‌నే ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, ఇన్నాళ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడు ఉన్న‌ట్టుండి ప‌వ‌న్ ఎందుకు ఓ రేంజ్‌లో పోరాటానికి రెడీ అయ్యారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా తెర‌మీద‌కి వ‌చ్చింది.  పవన్ తీరుపై రాజకీయ విశ్లేషకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

పవన్ జేఏసీ ఏర్పాటు వెనుక ఓ కీలక వ్యక్తి ఉన్నారని భావిస్తున్నారు. భవిష్యత్‌ రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకుని ఇటు రాష్ట్రంతో పాటు.. అటు కేంద్రాన్ని విభజన హామీల చిట్టాతో పవన్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే, మ‌రో వ‌ర్గం మాత్రం.. ప‌వ‌న్ నిజంగానే ఏపీ కోసం కృషి చేస్తు్న్నార‌ని అంటున్నారు. 

 

స్పీడు పెంచిన ప‌వ‌న్‌.. బ్యాక్ బోన్ ఎవ‌రు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts