బాబుకు ఊహించ‌ని షాకిచ్చిన ఇద్ద‌రు స‌న్నిహితులు

March 12, 2018 at 3:14 pm

ఎన్నిక‌ల ఏడాదిలో టీడీపీకి, చంద్ర‌బాబుకు ఎదురుదెబ్బ‌లు త‌గిలాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ బీజేపీ ప‌రిస్థితి ఎలా ఉంటుందో కొంద‌రు సీనియ‌ర్లు  ముందే ఊహించి.. టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా టీడీపీ అధినేత‌కు స‌న్నిహితంగా ఉన్న నేత‌ల్లో ప్ర‌ముఖంగా మాజీ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ పేరు వినిపించింది. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత.. ఈ ప్ర‌చారం మ‌రింత ఎక్కువైంది. అయితే ఇప్పుడు ఆయ‌న‌తో పాటు టీడీపీలో చంద్ర‌బాబుకు స‌న్నిహితంగా ఉండే మ‌రో మ‌హిళా నేత.. చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాకులిచ్చారు. ఒక‌రు బీజేపీ నుంచి జ‌న‌సేన‌లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వ‌గా.. మ‌రొక‌రు టీడీపీ నుంచి బీజేపీలో చేరిపోవ‌డం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. 

 

కామినేని శ్రీ‌నివాస్‌.. బీజేపీ ఎమ్మెల్యే అయినా చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించేవారు. ఆరోగ్య శాఖ మంత్రిగా కొన‌సాగిన ఆయ‌న‌.. టీడీపీ మంత్రిగానే వ్య‌వ‌హ‌రించేవారనే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. చంద్ర‌బాబు కూడా ఆయ‌న్ను బీజేపీ ఎమ్మెల్యేగా ఏనాడు చూడ‌లేదు. అయితే రాష్ట్రంలో హోదా ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగ‌సి ప‌డటం.. కేంద్రంతో టీడీపీ పొత్తు తెగ‌దెంపులు చేసుకోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న కామినేని, పైడికొండ‌ల మాణిక్యాల‌రావు రాజీనామాలు చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ పుంజుకునే అవ‌కాశాలు లేవ‌ని నిర్ధారించుకున్న సీనియ‌ర్లు ఇత‌ర పార్టీల్లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో కామినేని కూడా ఉన్నారు. బాబుతో ఉన్న స‌న్నిహితంగా ఉండ‌టంతో ఆయ‌న సైకిలెక్కేయ‌డం ఖాయ‌మ‌నుకున్నారు.  

 

అంద‌రి అంచ‌నాలను త‌ల్ల‌కిందులు చేస్తూ ఎన్నికల స‌మయానికి బీజేపీని వీడి పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. టీడీపీ అనుకూల కాషాయ మంత్రిగా ముద్ర ఉన్న ఆయన టీడీపీలో చేర‌డం కంటే జనసేనలో చేరడానికి మొగ్గు చూపుతున్నారని సమాచారం. నిజానికి పవన్ తో కామినేనికి చాలా కాలంగా సఖ్యత ఉంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే తొలుత పవన్ ను ఆశ్రయించిన కామినేని ఆయన సూచన మేరకే చంద్రబాబుకు వద్దకెళ్లి.. అక్కడి సలహాతోనే బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారనే ప్రచారం ఉంది. ఇక చంద్ర‌బాబుపై కొంత కాలం నుంచి అస‌హ‌నంతో ర‌గిలిపోతున్న సీనియర్ సినీనటి కవిత పార్టీ మారారు. 

 

కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ఆమె.. తాజాగా బీజేపీలో చేరారు. గతంలో టీడీపీలో చురుగ్గా పాల్గొన్న కవిత.. గడిచిన కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా ఉన్నారు. పని చేసే వారికి పార్టీలో సముచిత స్థానం ఇస్తామని చంద్రబాబు పదే పదే చెబుతారని కానీ బాబు మోస‌కారి అని చెబితే న‌మ్మ‌లేద‌ని, కానీ త‌న‌కిప్పుడు అర్థ‌మైంద‌న్నారు. ఎన్టీఆర్ మీద ఉన్న నమ్మకంతో పార్టీలో చేరానని.. ఆయన ఇచ్చిన హామీని బాబు తుంగలో తొక్కారన్నారు. తనను అవమానించి పార్టీ నుంచి గెంటేశారని మండిపడ్డారు. తాను బాధతోనే టీడీపీనుంచి బయటకు వచ్చినట్లుగా చెప్పారు. 1983 నుంచి టీడీపీ కోసం తాను కష్టపడి సేవలు అందించానని చెప్పారు. చంద్రబాబు చేసిన ప్రతి పోరాటంలోనూ తాను పాల్గొన్నప్పటికి తనను అవమానించారన్నారు. ఏదేమైనా వీరిద్ద‌రు ఇలా వేర్వేరు పార్టీల‌కు వెళ్ల‌డం మాత్రం బాబుకు పెద్ద షాక్ లాంటిదే.

బాబుకు ఊహించ‌ని షాకిచ్చిన ఇద్ద‌రు స‌న్నిహితులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts