జేడీ పొలిటిక‌ల్ ఎంట్రీ వెన‌క క‌థ పెద్ద‌దే…

March 23, 2018 at 2:51 pm

ఐపీఎస్ అధికారి వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌.. ఉర‌ఫ్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ త్వ‌లోనే రాజ‌కీయ రంగం ప్ర‌వేశం చేయ‌నున్నార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ వార్త‌లు దేశ‌వ్యాప్తంగా కూడా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారాయి. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌హారాష్ట్ర లో సేవ‌లు అందిస్తున్నారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న త‌న ఉన్న‌తోద్యోగానికి స్వ‌చ్ఛంద విర‌మ‌ణ‌(వీఆర్ ఎస్‌) తీసు కుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఆయ‌న రాజీనామా కూడా స‌మ‌ర్పించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

 

అయితే, జేడీ ఉన్న‌ట్టుండి ఈ నిర్ణ‌యం తీసుకున్నారా?  రాజ‌కీయాల్లోకి రావాల‌నేది ఆయ‌న ఇప్ప‌టికిప్పుడు నిర్ణ‌యించారా?  మ‌రో ఏడాదిలోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉన్న స‌మ‌యంలో ఆయ‌న నిర్ణ‌యం స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. ఒక‌వేళ రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. ఆయ‌న ఏపీ నుంచే ప్రాతినిధ్యం వ‌హించ‌నుండ‌డంతో మ‌రింత ఆస‌క్తిగా మార‌డం గ‌మ‌నార్హం. ఆది నుంచి కూడా జేడీకి సేవా భావం ఎక్కువ‌. ఆయ‌న ఎక్కడ ఉన్నా.. అక్క‌డి ప‌రిస్థితులు ప్ర‌జాస్వామ్య యుతంగా ఉండాల‌ని కోరుకుంటారు. ప్ర‌జ‌లంతా సుఖంగా ఉండాల‌ని, అవినీతి లేకుండా ప‌నులు జ‌రిగిపోవాల‌ని అభిల‌షిస్తారు. అంతేకాదు, సామాజిక ఉద్య‌మాల దిశ‌గా కూడా ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో దృష్టి సారించారు. 

 

ఓ ఐపీఎస్ అధికారిగా ఆయ‌న ఎప్పుడూ మాట‌ల‌కే ప‌రిమితం కాలేదు. త‌న‌వంతుగా స‌మాజానికి ఏదైనా చేయాల‌ని త‌పించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు  54 సార్లు ర‌క్త దానం చేశారు. ఇన్నిసార్లు ర‌క్త దానం చేసిన ఐపీఎస్ అదికారిగా ఆయ‌న మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి అవార్డు కూడా అందుకున్నారు. త‌న‌కు ఎన్ని అవార్డులు వ‌స్తే.. అంత‌గా త‌న బాధ్య‌తలు పెరుగుతున్న‌ట్టేన‌ని జేడీ చెప్పుకొచ్చేవారు. 

 

ఇక‌, తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని ఓ గ్రామాన్ని జేడీ ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. పాఠ‌శాల నిర్మాణం, ఇంటింటికీ మ‌రుగు దొడ్డి, తాగు నీటి సౌక‌ర్యం, మ‌ద్య నిషేధం, అంద‌రికీ ప‌ని వంటి కీల‌క చ‌ర్య‌ల ద్వారా గ్రామాన్ని ఆద‌ర్శంగా తీర్చిదిద్దే ప‌నిని ఆయ‌న ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు మ‌హారాష్ట్ర మైనార్టీ క‌మిష‌న్ మ‌హాత్మా గాంధీ శాంతి పుర‌స్కారాన్ని అందించి స‌త్క‌రించింది.  కేంద్ర ప్ర‌భుత్వం కూడా 2017లో అత్యున్నత స్థాయి రాష్ట్ర‌ప‌తి పోలీస్ మెడ‌ల్‌తో జేడీని గౌర‌వించింది.  

 

నెల‌లో  క‌నీసం రెండు మూడు సార్లు ఏపీ ప‌ర్య‌ట‌న‌లోనే గ‌డిపే జేడీ.. ఇక్క‌డి పాఠ‌శాల‌, కాలేజీ విద్యార్థుల‌తో మ‌మేకం అయ్యేందుకు, వారికి దేశ ప‌రిస్థితులు, ఎలా మెల‌గాలి?  దేశాభ్యున్న‌తికి ఎలా కృషి చేయాలి వంటి విష‌యాల‌ను స‌మున్న‌తంగా వివ‌రించేవారు. ఈ సేవా దృక్ఫ‌థ‌మే.. జేడీని రాజ‌కీయాల వైపు మ‌ళ్లించి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, సామాజికంగా సేవా దృక్ఫ‌థం ఉన్న వారు రాజ‌కీయంగా విజ‌యం సాధిస్తారా?  రాజ‌కీయాల్లోని కుళ్లును క‌డిగేస్తారా?  అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు సాధ్యం కాలేదు. మ‌రి జేడీ ఎంత మేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి. 

జేడీ పొలిటిక‌ల్ ఎంట్రీ వెన‌క క‌థ పెద్ద‌దే…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts