మోదీ, జైట్లీ బ‌లుపున‌కు కార‌ణం ఆ ఒక్క‌టేనా

March 8, 2018 at 3:17 pm

ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనంటూ ఎంపీలు రోడ్డెక్కారు!! ఢిల్లీ వీధుల్లో పోరాటాలు చేస్తున్నారు. పవిత్ర పార్ల‌మెంటు ముందు త‌మ రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని వివ‌రిస్తూ నిర‌స‌న‌లు తేలియ‌జేస్తున్నారు!! హోదా ఇస్తామ‌ని న‌మ్మించి.. చివ‌ర‌కు మోసం చేశార‌ని మొత్తుకుంటున్నా.. కేంద్రం క‌నీసం స్పందిచ‌డం లేదు! నాడు ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌బ్ధి కోసం.. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని, త‌ల్లీబిడ్డ‌కు న్యాయం చేస్తామ‌ని చెప్పిన మోదీ, అరుణ్ జైట్లీ ఇప్పుడు ముఖం చాటేస్తు న్నారు. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ తెగేసి చెబుతున్నారు. క‌నీసం ఆంధ్రుల ఆవేద‌న‌, ఆక్రంద‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు. ఇంత నిర్ల‌క్ష్యంగా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నారు, ఆంధ్రుల పోరాటాన్ని ఎందుకు ఇంత చుల‌క‌న చేసి మాట్లాడుతున్నారు?  పెద్ద‌న్న‌లా ఉంటాన‌న్న‌ మోదీ, ఆదుకుంటామ‌న్న అరుణ్ జైట్లీ ఎందుకు ఇంత బ‌లుపుతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ప్ర‌శ్న‌లు ఆంధ్రుల గుండె మంట‌ను పెంచేస్తున్నాయి!!

 

అవిశ్వాసం పెడ‌తామంటే.. పెట్టుకోండి అంటున్నారు! న్యాయం చేయాలని ఆందోళ‌న‌లు చేస్తుంటే.. ప‌ట్టించుకోన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు!! నిధులు విడుద‌లే లేదు.. అంటే రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు ఇచ్చేశాం అంటున్నారు!! ఏపీకి హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తుంటే.. హోదా కంటే ఎక్కువే చేశాం.. చేస్తున్నాం అంటూ ఏమారుస్తున్నారు! ఏరు దాటాక తెప్ప తగ‌లేసిన చందంగా ఉంది కేంద్ర వ్య‌వ‌హారం. ఏపీకి హోదా ఇవ్వాల‌ని ఉద్య‌మం తార‌స్థాయికి చేరిన నేప‌థ్యంలో.. మ‌రోసారి కేంద్రం పాత పాటే పాడుతోంది. క‌నీసం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని కూడా చెప్ప‌కుండా.. ఇవ్వ‌డం కుద‌ర‌దు అని తేల్చిచెప్పేస్తోంది. 

 

నాడు హోదా ఇవ్వాల్సిందే అంటూ రాజ్య‌స‌భ‌లో పోరాడిన అదే వ్య‌క్తి.. ఇప్పుడు ఇవ్వ‌డం కుద‌ర‌దు అని క‌రాఖండీగా చెప్పేస్తుంటే.. తెలుగువాడి గుండె త‌రుక్కుపోతోంది! త‌ల్లీబిడ్డ‌కు న్యాయం చేస్తామ‌ని..తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా చెప్పిన పెద్ద‌న్న మోదీ.. ఇప్పుడు కనీసం ఆ మాటే ఎత్త‌డం లేదు. ఎంపీల పోరాటంపై క‌నీసం స్పందించ‌డం లేదు. 

ఎందుకు ఇంత పొగ‌రు? ఎందుకు ఇంత బ‌లుపు? ఎందుకు ఇంత చుల‌కన భావం? అనే భావ‌న తెలుగోళ్లలో వ్యక్తమవుతోంది. హోదా విషయంలో ఇప్పటికే హ్యాండిచ్చిన మోడీ సర్కారు.. తాజాగా ఈ విషయాన్ని తేల్చేసిన వైనం కొందరికి ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొందరికి షాకింగ్ గా మారింది. విభజన నాడు కాంగ్రెస్ మీద ఎంత ఆగ్రహం వ్యక్తమైందో.. అంతకు రెట్టింపు ఆగ్రహం నేడు మోడీ అండ్ కో మీద వ్యక్తమవుతోంది. 

 

కేంద్రం ఏపీని మరోసారి దారుణంగా మోసం చేసిందన్న మండిపాటు ఆంధ్రుల్లో వ్యక్తమవుతోంది. హోదా మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ప్ర‌జ‌ల్లో తాజాగా జైట్లీ ప్ర‌క‌ట‌న‌తో ఆగ్ర‌హం పెల్లుబుకుతోంది. ఈ విష‌యంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలిచినా.. తమకే మద్దతు ఇవ్వాల్సి ఉంటుందన్న ధైర్యమే వారి చేత ఇలా చేస్తుందన్నారు. బీజేపీ మాత్రమే దిక్కు అన్నట్లుగా కేంద్ర వైఖరి ఉందని.. అదే వారి చేత ఇలాంటి ప్రకటనలు చేసేలా చేస్తుందన్నారు. హోదా విషయంలో కేంద్రం ఏపీ వినతుల్ని పక్కన పెట్టేయటమే కాదు.. అవహేళనగా.. వెటకారంగా లెక్కలు చెప్పటం మోదీ, అరుణ్ జైట్లీ బ‌లుపును తెలియ‌జేస్తోంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మవుతోంది!! 

మోదీ, జైట్లీ బ‌లుపున‌కు కార‌ణం ఆ ఒక్క‌టేనా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts