బీజేపీ లెక్క తేలింది .. ఏపీ నుండి కేంద్ర మంత్రులు వీళ్ళే!

April 3, 2018 at 5:37 pm

కేంద్రంలో రెండు మంత్రి ప‌ద‌వులు ఖాళీ అయ్యాయి. కేంద్రంలోని బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న చంద్ర‌బాబు.. ఏపీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంతో తెగ‌తెంపులు చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతోపాటు కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఇద్ద‌రు సుజ‌నా చౌద‌రి, అశోక్ గ‌జ‌ప‌తిరాజుల‌తో రాజీనామాలు కూడా చేయించారు. దీంతో ఈ రెండు ప‌ద‌వులు ఖాళీ అయ్యాయి. ఈ రెండు ప‌ద‌వుల‌ను ఏపీ నుంచి భ‌ర్తీ చేశారు కాబ‌ట్టి తిరిగి వీటిని ఏపీకే కేటాయిస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. 

 

ఈ క్ర‌మంలోనే ఏపీకి చెందిన కొంద‌రు బీజేపీ నేతలు వీటిపై ఆశ‌లు పెంచుకున్నారు. ప్ర‌ధానంగా గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కేంద్ర మంత్రిగా చ‌క్రం తిప్పిన పురందేశ్వ‌రి.. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఈమె ఈ ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెంచుకున్నారు. అదేవిధంగా కొన్నాళ్ల కింద‌ట కేంద్ర మంత్రి వ‌ర్గం పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగిన నేప‌థ్యంలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కు తుందని ఆశ‌లు పెట్టుకున్న విశాఖ ఎంపీ కంభంపాటి హ‌రిబాబుకు అప్ప‌ట్లో కొన్ని కార‌ణాల వ‌ల్ల మిస్స‌యింది. దీంతో ఈయ‌న కూడా ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెంచుకున్నారు. 

 

దీనికితోడు ప్ర‌స్తుతం ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న ఆయ‌న స్థానంలో త్వ‌ర‌లోనే కొత్త‌వారికి చోటు ద‌క్కుతుంద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న కేంద్ర మంత్రి ఆశ‌లు మ‌రింత పెరిగాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రు నేత‌ల పేర్లు బాహాటంగానే వినిపిస్తున్నాయి. వీరికితోడు.. మ‌రికొంద‌రు నేత‌ల పేర్లు కూడా బ‌లంగానే వినిపిస్తున్నాయి.  తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన వారణాశి రాంమాధవ్ పేరు కూడా పరిశీలనలో ఉందని అంటున్నారు. 

 

ఈశాన్య రాష్ట్రాల నుంచి జూన్, జూలైలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయనను ఎంపీగా తీసుకోవాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తద్వారా హరిబాబు, రాంమాధవ్ ఏపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించే అవకాశం రానుంది. బ్రాహ్మణ వర్గానికి చెందిన రాం మాధవ్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిబాబు కేంద్ర మంత్రులుగా.. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తే.. అప్పుడు రాష్ట్రంలో సామాజిక వర్గాల సమతుల్యత సరిగ్గా సరిపోతుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 

 

అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలకైమెన రెడ్డి సామాజికవర్గాన్ని సంతృప్తి పరిచేందుకు.. ఆ వర్గానికి చెందిన రాజకీయ ప్రముఖుడ్ని బీజేపీలోకి చేర్చుకుని ఆయనకు కేంద్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేలా కూడా చ‌ర్య‌లు ఊపందుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందొ చూడాలి. 

బీజేపీ లెక్క తేలింది .. ఏపీ నుండి కేంద్ర మంత్రులు వీళ్ళే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts