ప్రతిపక్షాల దెబ్బకు…కమలం బెంబేలు

June 1, 2018 at 2:10 pm

వివిధ రాష్ట్రాల్లో నాలుగు లోక్‌స‌భ స్థానాల‌కు, ప‌ది అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో బీజేపీయేత‌ర ప‌క్షాలు స‌మ‌రోత్సాహంతో క‌నిపిస్తున్నాయి. క‌లిసిక‌ట్టుగా బ‌రిలోకి దిగి క‌మ‌లం పార్టీని మ‌ట్టిక‌రిపించి, 2019ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌శంఖం పూరించాయి. 14స్థానాల‌కుగాను 11చోట్ల బీజేపీ, దాని మిత్రప‌క్షాలు ఓడిపోయాయి. ఇక అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించిన కైరానాలోనూ క‌మ‌లం కుదేలైంది. ప‌ది అసెంబ్లీ స్థానాల‌కు గాను తొమ్మిదిచోట్ల బీజేపీయేత‌ర పార్టీల అభ్య‌ర్థులు విజ‌య‌వం సాధించారు. ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీయేత‌ర ప‌క్షాల ఐక్య‌త‌కు ద‌క్కిన ఫ‌లితంగా ఆయా పార్టీల నేత‌లు చెబుతున్నారు.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని మారుస్తున్నాయి. ప్ర‌ధాని మోడీ వ్య‌తిరేక శ‌క్తుల‌న్నింటినీ ఏకం చేస్తున్నాయి. కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి ముఖ్య‌మంత్రిగా కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారానికి కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతోపాలు ప‌లు ప్రాంతీయ పార్టీల నేత‌లు మ‌మ‌తా బెన‌ర్జీ, కేజ్రీవాల్‌, అఖిలేశ్‌యాద‌వ్‌, చంద్ర‌బాబు త‌దిత‌రులంద‌రూ హాజ‌రుకావ‌డం తెలిసిందే. అయితే మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు 27 లోక్‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇందులో బీజేపీ త‌న 13 సిట్టింగ్ స్థానాల‌కు గాను కేవ‌లం ఐదుస్థానాలనే నిల‌బెట్టుకోగ‌ల‌గ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల‌తో జ‌త‌క‌ట్టి కాంగ్రెస్ పార్టీ కూట‌మిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక కొద్దిరోజులుగా ఫెడ‌ర‌ల్ ఏర్పాటుపై చురుగ్గా క‌దులుతున్న త‌`ణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై త‌న‌దైన శైలిలో స్పందించారు. తాను ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఫార్ములా ఉప ఎన్నికల్లో స‌క్సెస్ అయింద‌ని ఆమె అన్నారు. బీజేపీపై ప్రజలకు ఉన్న‌ భ్రమలు పోతున్నాయ‌ని ఆమె పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఫ్రంట్‌ బలంగా ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీకి ఇది చెడు సంకేతమన్నారు.

ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కాంగ్రెస్ నేత‌లు కూడా ఆనందం వ్య‌క్తం చేశారు. మోడీ పాల‌న‌ అంతానికి ఇది ఆరంభమని అభివ‌ర్ణించారు. మోడీ నాలుగేళ్ల పాలనకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు అని, బీజేపీ పతనానికి ఆరంభమని అన్నారు. అంతేగాకుండా… కాంగ్రెస్‌, మిత్రపక్షాల విజయానికి నాంది అని ఆ పార్టీ నేత ప్రమోద్‌ తివారీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ అద్య‌క్షుడు రాహుల్‌గాంధీ మాత్రం గెలుపోటముల నుంచి అన్ని పార్టీలూ గుణపాఠాలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎలా పాల్గొనాలనే విషయంలో బీజేపీ నుంచే పాఠాలు నేర్చుకున్నామ‌నీ, ఇప్పుడు వాటినే ఉపయోగించామ‌ని ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్ అన్నారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ మాత్రం ఒక‌డుగు ముందుకువేశారు. మోడీని తొల‌గించాల‌ని డిమాండ్‌ చేశారు.

టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌ధాని మోడీపై ఘాటుగానే స్పందించారు. మోడీ ప్ర‌భ మసకబారుతోందనడానికి ఈ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనని ఆయ‌న వ్యాఖానించారు. 2019లోనూ బీజేపీకి ఇదే తరహా ఫలితాలు ఎదురుకావ‌డం ఖాయ‌మ‌ని, బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో మొద‌ట‌ మాట్లాడింది టీడీపీయేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే ఇప్పుడు త‌న‌కు జేడీయూ నేత‌, బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ కూడా తోడ‌య్యార‌ని చంద్ర‌బాబు అన్నారు. ఇక ఆర్జేడీ నేత తేజ‌స్వియాద‌వ్ మాత్రం ఈ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తెగె ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇది ఉమ్మడి విపక్షం సాధించిన‌ విజయమని సీపీఐ నేత డి.రాజా అన్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నిల్లో బీజేపీ ఓడిపోవటం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షాల దెబ్బకు…కమలం బెంబేలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts