ఏపీలో కమలం..త‌న మ‌ర‌ణ‌శాస‌నం తానే రాసుకుంది

June 14, 2018 at 11:37 am

క‌డ‌ప‌లో ఉక్కుక‌ర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్రం స్ప‌ష్టం చేయడంతో ఏపీ క‌మ‌లంలో క‌ల‌క‌లం రేగుతోంది. క‌నీసం విశాఖప‌ట్నానికి రైల్వే డివిజ‌న్ హోదా, క‌డ‌ప‌లో ఉక్కు క‌ర్మాగారం ఏర్పాటుపై కేంద్రాన్ని ఒప్పించి త‌లెత్తుకుందామ‌ని చూసిన రాష్ట్ర నేత‌ల‌కు ఢిల్లీ పెద్ద‌లు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చారు. కేంద్రం సుప్రీం కోర్టులో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌తో రాష్ట్ర బీజేపీ నేత‌లు తీవ్ర అసంతృప్తికి లోనైన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి క‌`షి చేయాల‌ని చెబుతున్న పార్టీ పెద్ద‌లు.. ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుంటే ఎలా ముందుకు వెళ్తామ‌ని ఎవ‌రికివారు లోలోప‌ల మ‌ద‌న‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

ఏపీకి కేంద్రం అన్నీ చేస్తోంద‌నే ప‌దేప‌దే అదే ప‌నిగా చెప్పే నేత‌లు ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియ‌క అయోమ‌యంలో ప‌డిపోయార‌ని పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ మొద‌లైంది. పార్ల‌మెంటు చివ‌రి బ‌డ్జెట్ స‌మావేశాల్లోనూ ఏపీకి నిధుల కేటాయింపులో కేంద్రం మొండిచేయి చూపించింది. దీంతో అటు వైసీపీ, ఇటు టీడీపీలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించాయి. ఏకంగా టీడీపీ కేంద్రం నుంచి, ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు వెళ్తున్నారు. నిజానికి అప్ప‌టి నుంచి బీజేపీ ప‌రిస్థితి మ‌రింత‌గా దిగ‌జారింది. చంద్ర‌బాబు దాడితో రాష్ట్ర బీజేపీ నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

క‌నీసం వాళ్ల‌కు చెప్పుకోవ‌డానికి మాట‌.. చేయ‌డానికి కార్యాచ‌ర‌ణ లేకుండా పోయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌డ‌ప‌లో ఉక్కుక‌ర్మాగారం సాధ్యం కాదంటూ తేల్చి చెప్ప‌డంతో ఇక తాము చేతులెత్తేయ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేమ‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ఇలాంటి నిర్ణ‌యాలు పార్టీకి తీర‌ని న‌ష్టాన్ని క‌లిగిస్తాయ‌నీ, క‌మ‌లం త‌న మ‌ర‌ణ‌శాస‌నం తానే రాసుకుంటోంద‌ని ప‌లువుర రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మే 15త‌ర్వాత ఏపీలో అనూహ్య ప‌రిణామాలు ఉంటాయ‌ని, వాటికి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు కోత‌లు కోసి.. ఆ త‌ర్వా తోక‌ముడిచారు. ఇక సోము వీర్రాజు, నూత‌న అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ త‌దిత‌ర నేత‌లు ఇప్పుడు ఆంధ్రుల‌కు ఏం చెబుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక ఇదే స‌మ‌యంలో టీడీపీ మ‌రింత దూకుడు పెంచే అవ‌కాశాలు ఉన్నాయి.

ఏపీలో కమలం..త‌న మ‌ర‌ణ‌శాస‌నం తానే రాసుకుంది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts