వైసీపీ నుంచి ఆమె గెలిస్తే కేబినెట్ మంత్రే!

June 28, 2018 at 10:13 am

గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రితపై వైసీపీలో అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయురాలైన ఈమె.. జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస‌పాత్రురాలిగా పార్టీలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికి రెండు సార్లు.. ఆమెకు టీడీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చినా.. ఆమె వైసీపీని విడిచి పెట్ట‌లేదు. ఎస్సీ వ‌ర్గానికి చెందిన సుచ‌రిత‌.. గ‌తంలో 2009 ఎన్నిక‌ల్లోవైఎస్ ఆశీస్సుల‌తో కాంగ్రెస్ నుంచి ప్ర‌త్తిపాడు టికెట్‌ను పొందిన ఆమె.. ఘ‌న విజ‌యం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి కందుకూరి వీర‌య్య‌, పీఆర్ పీ అభ్య‌ర్థి విన‌య్ కుమార్‌లు బరిలో నిలిచారు. చివ‌రి వ‌ర‌కు ఈ ఇద్ద‌రు కూడా సుచ‌రిత‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. అదిరిపోయే రేంజ్‌లో సాగిన త్రిముఖ పోటీలో సుచ‌రిత విజ‌యం సాధించారు. 

 

ఆమెకు రెండు కీల‌క పార్టీల నేత‌ల నుంచి పోటీ ఎదురైనా.. రెండు వేల‌కు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఇక‌, ఆత‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె జ‌గ‌న్ చెంత‌కు చేరిపోయారు. 2012లో కాంగ్రెస్ నుంచి వ‌చ్చి త‌న‌కు మ‌ద్ద‌తిచ్చిన వారితో రాజీనామాలు చేయించిన జ‌గ‌న్ ఉప ఎన్నిక‌లు వెళ్లిన విష‌యం తెలిసిందే. దీంతో సుచ‌రిత కూడా ఉప ఎన్నిక‌ల్లో పాల్గొని ఘ‌న విజ‌యం కైవ‌సం చేసుకున్నారు. అయితే, 2014లో విభ‌జ‌న వేడి నేప‌థ్యంలో ఆమె ఇక్క‌డ నుంచి పోటీ చేసినా.. టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన రావెల కిశోర్ బాబు విజ‌యం సాధించారు. అప్ప‌టి నుంచి సుచ‌రిత పార్టీ కార్య‌క్ర‌మాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. 

 

ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఈమెకు ప్ర‌జ‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పార్టీ ప‌ట్ల ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణతో వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా జ‌గ‌న్ ప‌ట్ల వీరాభిమానం ప్ర‌ద‌ర్శించే సుచ‌రిత‌.. ఎక్క‌డిక‌క్క‌డ అధికార పార్టీ ఆగ‌డాల‌ను ప్ర‌శ్నించ‌డంతో పాటు.. వైసీపీ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలోనూ ఆమె విజ‌యం సాధించారు. అంతేకాదు, పార్టీ నేత‌ల ప‌ట్ల కూడా ఎంతో విన‌యంగా ఉండే ఆమెకు అధినేత నుంచి అన్ని స్థాయిల్లోనూ మంచి మార్కులు ఉన్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకే ఈ టికెట్ రిజ‌ర్వ్ చేశార‌ని స‌మాచారం. ఇక‌, పార్టీ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకితీసుకు వెళ్ల‌డం, జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో జ‌న‌స‌మీక‌ర‌ణకు  ఎంతో కృషి చేయ‌డం వంటివి ఆమె ప్ల‌స్‌గా మారాయి. 

 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున ఆమె పోటీ చేసి గెలుపొంద‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర సూప‌ర్ హిట్ అయ్యింది. దీనికి తోడు అధికార‌ప‌క్షంలోని మైన‌స్‌లు సుచ‌రిత‌కు బాగా ప్ల‌స్ కానున్నాయి. ఇదిలావుంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం సాధించి అధికారంలోకి వ‌స్తే.. సుచ‌రిత చేసిన త్యాగాలు, పార్టీ కోసం ఆమె చూపిన అంకిత భావం, వైఎస్ కుటుంబం ప‌ట్ల ఆమె చూపించే విధేయ‌త‌లే ప్ర‌మాణాలుగా జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో టికెట్ ద‌క్క‌డం ఖాయ‌మ‌ని పార్టీలో చ‌ర్చ న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి బ‌ల‌మైన నేత లేక‌పోవ‌డం సుచ‌రిత‌కు క‌లిసి వ‌చ్చే మ‌రో ప్ర‌ధాన ప‌రిణామం. 

వైసీపీ నుంచి ఆమె గెలిస్తే కేబినెట్ మంత్రే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts