ఆక‌ట్టుకోని అంత‌రిక్షం…రివ్యూ రేటింగ్

December 21, 2018 at 3:09 pm

సినిమా సినిమాకు త‌న న‌ట‌న‌ను మెరుగు ప‌ర్చుకుంటూ విభిన్న క‌థ‌ల్లో న‌టిస్తూ మెగా ఫ్యామిలీలో హీ ఈజ్ డిఫ‌రెంట్ అనే ముద్ర‌ను ద‌క్కించుకున్న హీరో వ‌రుణ్ తేజ్‌.. అత‌డి మొద‌టి సినిమా ముకుంద నుంచి ఈరోజు విడుద‌లైన అంత‌రిక్షం వ‌రకు వ‌రుణ్ న‌టించిన సినిమాలు ఆ కోవ‌కే చెందుతాయి. కథా బ‌ల‌మున్న పాత్ర‌ల‌నే ఎంపిక చేసుకోవ‌డం క‌నిపిస్తుంది. ఇప్పుడు అదే త‌ర‌హాలో తెలుగులో ఇంత వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడు తెరకెక్కించ‌ని అంత‌రిక్షం క‌థ‌ను ఎంపిక చేశారు. ఇక ఘ‌జీ సినిమాతో అద్భుత విజ‌యాన్ని అందుకోవ‌డంతో విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు పొందిన ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్‌రెడ్డి ఈచిత్రానికి డైరెక్ట‌ర్ కావ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. వ‌రుణ్‌కు లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించింది. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల మెప్పు పొందిందా..లేదా..? అన్న‌ది ఇప్పుడు రివ్యూలో చుద్దాం.

క‌థేంటంటే…
కథలోకి వెళ్లినట్టయితే వరుణ్ తేజ్(దేవ్) భూమి యొక్క ఉపగ్రహం చంద్రుని పై ఒక మిషన్ ను పూర్తి చెయ్యడానికి అనుకోని పరిస్థితుల్లో వెళ్లాల్సొస్తుంది.అయితే ఆ మిషన్ ను పూర్తి చెయ్యడానికి కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి. అయినా సరే ఆ సమస్యలను ఎదుర్కొని ఎలా అయినా పరిష్కరించాలి అనుకుంటాడు.అలాగే తాను అప్పటికే ఒక మిషన్ ను పూర్తి చేసే పనిలో ఉంటాడు.మరి ఏక కాలంలో ఈ రెండు మెషిన్లను వరుణ్ తన బృందంతో విజయవంతంగా పూర్తి చెయ్యగలిగాడా లేదా అన్న‌ది.. అదే సమయంలో తనకి అంతరిక్షంలో ఎదురైన సమస్యలు ఏమిటి వాటిని వరుణ్ ఏవిధంగా ప‌రిష్క‌రించ‌గ‌లిగాడు… అన్నది వెండి తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే…

సినిమా ప్రారంభమే అంతరిక్షంలోని సన్నివేశాలతో మొదలవడం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. అప్పుడు కనిపించే విజువల్స్ మాత్రం ఔరా అనిపిస్తాయి. మొదట్లో కథ కాస్త మెల్లగానే సాగినా ఆసక్తికరంగా ఉంటుంది. హీరో వరుణ్ తేజ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించి గతానికి మరియు ప్రస్తుతానికి సంబంధించి వచ్చిన సీన్లు కాస్త ఆసక్తికరంగా ఉంటాయి.ఇక హీరోయిన్ అదితి రావ్ వ్యోమగామిగా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ గర్ల్ ఫ్రెండ్ గా,ఆమె తండ్రి రెహమాన్ తదితరులు పాత్రలు కూడా ఓకే అనిపిస్తాయి. ఇక దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు ఎవరు ముట్టుకోని సబ్జెక్టు తీసుకొని సాహసం చేశారనే చెప్పాలి .అయితే ఫస్టాఫ్ లో కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాల నుంచి పర్వాలేదనిపించే స్థాయిలో ఉండి సెకండాఫ్ లో ఏం జరగబోతుంది అనే విధంగా ఇంటర్వెల్ వరకు బాగానే తీసుకెళ్తుంది.
ఇక సెకండాఫ్ కి వచ్చినట్టయితే సెకండాఫ్ కూడా ప్రారంభమే కాస్త ఆసక్తిగా ఫస్టాఫ్ లో చూపిన విధంగా అంతరిక్షంలో మొదలవుతుంది.అంతరిక్షయానం చేసినటువంటి వరుణ్ టీమ్ లో వారిలో వారికే కొన్ని ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం వలన కథ ఇంకాస్త ఆసక్తికరంగా మారుతుంది. సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఛాలెంజింగ్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఇంకా కుతూహలాన్ని పెంచుతాయి.దర్శకుడు ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ను ఎంచుకున్నా సరే దాన్ని అంత ఆసక్తికరంగా మలచడంలో కాస్త ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. అక్కడక్కడా కథ కాస్త మెల్లగా తీసుకెళ్లడం వలన ప్రేక్షకుడికి ఆసక్తి కాస్త లోపిస్తుంది,ఈ విషయంలో దర్శకుడు కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుణ్ణు.

మొత్తానికి “ఘాజీ” వంటి అద్భుత చిత్రాన్ని అందించిన సంకల్ప్ నుంచి వరుణ్ తేజ్ తో ఇప్పటి వరకు తెలుగులో ఏ దర్శకుడు ఎంచుకొని సబ్జెక్టు ను వీరు ఎంచుకొని ముందడుగు వేశార‌నే చెప్పాలి. అయితే దర్శకుడు అనుకున్న రీతిలో తెరకెక్కించడంలో మాత్రం ఈ సారి కాస్త తడబడ్డారనే చెప్పాలి.మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో వేచి చూడాలి.

రేటింగ్ :- 2.75/5

ఆక‌ట్టుకోని అంత‌రిక్షం…రివ్యూ రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts