Mr మజ్ను రివ్యూ..మంచి ల‌వ్ అండ్ రోమాటింక్ ఎంట‌ర్‌టైన‌ర్‌..

January 25, 2019 at 2:43 pm

టైటిల్ : Mr మజ్ను
జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
న‌టీన‌టులు : అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్‌, నాగబాబు, సుబ్బరాజు, ప్రియదర్శి
సంగీతం : ఎస్‌ తమన్‌
దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాత : బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌

అక్కినేని న‌ట‌వార‌స‌త్వం నుంచి తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌న్మ‌ధుడికి స‌రైన వార‌సుడు అఖిలేన‌ని అంతా అనుకున్నారు.మంచి ఫిజిక్‌..అందం విష‌యంలో ఏమాత్రం వంక పెట్ట‌లేన్నంత‌గా తెర‌పై హ్యాడ్స‌మ్‌గా క‌నిపిస్తాడు. అయితే న‌ట‌న‌లో మాత్రం కొద్దిగా వెన‌క‌బ‌డే ఉన్నాడ‌ని తొలి రెండు చిత్రాల‌తో తెలిసిపోయింది. మ‌రి అఖిల్ నుంచి వ‌చ్చిన మూడో చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మూడో సినిమాగా తన వయసుకు తగ్గ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిప్రేమ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి, అఖిల్‌ను ప్లేబాయ్‌గా చూపించాడు. మ‌రి ఈసినిమాలో అఖిల్‌ ఎలా చేశాడో ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
విక్రమ్‌ కృష్ణ అలియాస్‌ విక్కీ (అఖిల్ అక్కినేని) లండన్‌లో ప్లేబాయ్‌లా అమ్మాయిలతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అమ్మాయిల విషయంలో ఎలా ఉన్నా విక్కీ వ్యక్తిత్వం నచ్చి నిఖిత అలియాస్ నిక్కీ (నిధి అగర్వాల్‌) అతడిని ఇష్టపడుతుంది. ఎంతో మెచ్యూరిటీలో విక్కీతో వ్య‌వ‌హ‌రిస్తుంది. కానీ నిక్కీ ప్రేమను అర్థం చేసుకోలేని విక్కీ ఆమెను దూరం చేసుకుంటాడు. నిక్కీ దూరమైన తరువాత ఆమె జ్ఞాప‌కాలు విక్కీని వెంటాడుతుంటాయి. చివ‌రికి తాను నిక్కీతో ప్రేమ‌లో ప‌డ్డాను అన్న విష‌యాన్ని గుర్తిస్తాడు. దూరమైన ప్రేమ కోసం విక్కీ ఏంచేశాడు..? తిరిగి ఇద్దరు ఎలా కలుసుకున్నారు..? అన్నదే మిగతా కథ.

ఎవ‌రెవ‌రు ఎలా న‌టించారంటే..:
రోమాంటిక్ అండ్ ఎమోష‌న‌ల్ ప్రేమ‌క‌థ‌లో అఖిల్ చాలా బాగా కుద‌రుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ప్లేబాయ్‌ తరహా పాత్రలో పర్ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడు. ల‌వ‌ర్ బాయ్‌లా ఇట్టే ఆక‌ట్టుకున్నాడు. గ‌త చిత్రాల‌తో పోల్చితే అఖిల్ న‌ట‌న ప‌రంగా కూడా చాలా మెరుగ‌య్యాడు. డైలాగ్ డెలివ‌రీ నుంచి డ్యాన్స్‌..యాక్ష‌న్ సీన్స్ ఇలా అన్నీ విభాగాల్లో మంచి మార్కులే సాధించాడు. అయితే ఎమోషనల్‌ సీన్స్‌లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. నిఖిత పాత్రలో నిధి అగర్వాల్ ఒదిగిపోయింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. తెర మీద చాలా పాత్రలు కనిపించినా ఎవరికి పెద్దగా స్కోప్‌ లేదు. సితార, పవిత్ర లోకేష్, నాగబాబు, జయప్రకాష్, రావూ రమేష్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకోగా సుబ్బారాజు, ప్రియదర్శి, హైపర్‌ ఆది కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశారు.

ఎలా ఉందంటే…:
తొలిప్రేమ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. అఖిల్‌ కోసం రొటీన్‌ లవ్‌ స్టోరినే తీసుకున్నాడు. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఫ‌స్ట‌ఫ్‌లో ఆక‌ట్టుకున్న సెకండాఫ్‌లో నిరాశ‌ప‌రిచాడు. సెకండ్‌ హాఫ్ లో వ‌చ్చే కొన్ని సాగ‌తీత సీన్లు ప్రేక్ష‌కుడికి కొద్దిగా అస‌హ‌నం తెప్పిస్తాయి. క‌థ కూడా ముందే అంచ‌నా వేస‌ట్లుగా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. రచయితగా మాత్రం వెంకీ తన మార్క్‌ చూపించాడు. చాలా డైలాగ్స్‌ గుర్తుండిపోయేలా ఉన్నాయి. జార్జ్‌ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్. హీరో హీరోయిన్లతో పాటు లండన్‌ అందాలను కూడా చాలా బాగా చూపించాడు. తమన్‌ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఒక్క మాట‌లో చెప్పాలంటే…ప్రేమ క‌థ‌నంతో న‌డిచే సినిమాలను ఇష్ట‌ప‌డేవారికి మంచి చాయిస్‌. అఖిల్ గ‌త సినిమాల‌క‌న్నా మాత్రం చాలా బెట‌ర్ సినిమా..మంచి ల‌వ్ అండ్ రోమాటింక్ ఎంట‌ర్‌టైన‌ర్‌..

రేటింగ్ : 2.75/5

Mr మజ్ను రివ్యూ..మంచి ల‌వ్ అండ్ రోమాటింక్ ఎంట‌ర్‌టైన‌ర్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts