కాంగ్రెస్‌కు మరో ఎమ్మెల్యే షాక్‌..!

March 20, 2019 at 2:49 pm

తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రుగా టీఆర్ ఎస్‌లోకి వ‌ల‌స‌లు పోతున్నారు. ఆ పార్టీకి శాస‌న స‌భ‌లో ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కే ప‌రిస్థితి లేకుండా పోతోంది. ఈ క్ర‌మంలోనే నిన్న‌నే ఫైర్ బ్రాండ్ డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. ఆ షాక్ నుంచి పార్టీ సీనియ‌ర్లు తేరుకోక‌ముందే మ‌రో పిడుగులాంటి వార్త కాంగ్రెస్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కొల్లాపూర్ ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి టీఆర్ ఎస్‌లో చేర‌బోతున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప‌త్రిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ రాష్ర్టం అన్ని రంగంల్లో అభివ్రుద్ధిలో దూసుకుపోతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు అన్ని వ‌స‌తులు క‌ల్పిస్తూ వారి క‌ష్టాల‌ను తీర్చ‌డ‌మే కేసీఆర్ ప‌నిగా పెట్టుకున్నార‌ని చెప్పారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ, వారికి చేదోడువాదోడుగా ఉండాలంటే టీఆర్ ఎస్ పాల‌న‌లోనే సాధ్య‌మ‌య్యే విష‌యంగా త‌న‌కు అనిపిస్తోంద‌ని వివ‌రించారు. రాజ‌కీయాలు చేయ‌డానికి పార్టీ మార‌డం లేద‌ని, త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివ్రుద్ధి చేసుకోవ‌డానికే టీఆర్ ఎస్‌లోకి మారుతున్న‌ట్టు చెప్పారు. కేసీఆర్ స‌ర్కార్ మొద‌టి విడుత‌లోనే ఎన్నో ప్ర‌జోప‌యోగ కార్య‌క్ర‌మాలు చేసింద‌ని, ఇక మ‌రోవిడ‌త ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టిన బాధ్య‌త‌తో మ‌రింత అభివ్రుద్ధి ఖాయ‌మ‌న్నారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివ్రుద్ధిని కాంక్షించే పార్టీ వీడుతున్న‌ట్టు చెప్పారు. త‌న‌పై ఎవ‌రి ఒత్తిళ్లు లేవ‌ని, కాంగ్రెస్ పాల‌న‌తో ఎలాగూ ప‌నులు జ‌రిగింది లేదు కాబ‌ట్టే త‌న మ‌న‌స్సాక్షిగా పార్టీ వీడుతున్నాన్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో త‌న ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు క్రుషి చేస్తాన‌న్నారు. దేశం మొత్తంగా తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ ప‌నులు చేస్తున్నార‌న్నారు. అంత‌టి మ‌హానుభావుడి ద‌గ్గ‌ర ప‌నిచేయ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. త‌న‌ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప‌ద‌వి వ‌దులుకొని టీఆర్ఎస్ టిక్కెట్‌పై మ‌ళ్లీ పోటీ చేసి గెల‌వ‌మ‌న్నా అందుకు సిద్ధంగా ఉన్నాన్నారు. కాగా, ఇప్ప‌టికే తెలంగాణలో కాంగ్రెస్ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యే కూడా టీఆర్ ఎస్ పంచ‌న చేర‌నుండ‌డ‌డంతో ఆ పార్టీలో తీవ్ర అనిశ్చితి నెల‌కొంది.

కాంగ్రెస్‌కు మరో ఎమ్మెల్యే షాక్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts