రాహుల్ వ్యూహం.. బెడిసి కొట్టిందా..!

April 23, 2019 at 9:48 am

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో ఓ జోక‌ర్‌గా మారారా? ఆయ‌న చేస్తున్న పాలిటిక్స్‌పై సొంత పార్టీలోనే చ‌మ‌క్కులు కురుస్తున్నాయా? రాహుల్‌ను పెద్ద‌గా ఎవ‌రూ ఖాత‌రు చేయ‌డం లేదా? అంటే.. తాజా ఎన్నిక‌ల ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు మేధావులు. దేశంలో మార్పు కోరుతున్న వారు మొద‌ట్లో రాహుల్‌పై అనేక ఆశ‌లు పెట్టుకున్నారు. దేశంలో అతి పురాత‌న‌, పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి కూడా రాహుల్ వేసిన అడుగులు త‌ప్ప‌ట‌డుగుల‌నే త‌ల‌పిస్తున్నాయ‌ని అనే వారు లేక పోలేదు.

ద‌క్షిణాదిలో ఉన్న బ‌లం కోల్పోయిన నేప‌థ్యంలో దీనిని పుంజుకునేలా చేయ‌డంలో రాహుల్ వేసిన త‌ప్ప‌ట‌డుగులు కొన్ని ద‌శాబ్దాల పాటు కాంగ్రెస్‌కు నిలువ నీడ లేకుండా చేశాయి. ముఖ్యంగా తెలంగాణ విభ‌జ‌న‌తో బ‌ల‌ప‌డుతుంద‌ని, రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించిన కాంగ్రెస్ ప‌రిస్థితి కుక్క‌లు చింపిన విస్త‌రి టైపులో మారిపోయింది. ఎవ‌రితో పొత్తు పెట్టుకోకూడ‌దో వారితో పెట్టుకుని అభాసుపాల‌య్యారు రాహుల్‌. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న దెబ్బ‌తో ఏపీలో జ‌రిగిన 2014 ఎన్ని క‌ల్లో నామ‌రూపాలు కూడా లేకుండా పోయిన కాంగ్రెస్ ఈ ద‌ఫా ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో పుంజుకుంటుంద‌ని భావించారు. అయితే, ఎవ‌రితో పొత్తు పెట్టుకోవాలో.. వారితో పెట్టుకోకుండా ఒంట‌రి పోరుకు వెళ్ల‌డం పార్టీని మ‌రోసారి అతఃపాతాళానికి నెట్టేసింది.

నిజానికి కాంగ్రెస్ వ్యూహంలో ప‌డిమిగిలిన పార్టీలు అల్లాడిన సంద‌ర్భాలు ఇందిర‌, రాజీవ్ గాంధీల హ‌యాం నుంచి సోనియా హ‌యాం వ‌ర‌కు కూడా క‌నిపించాయి. కానీ, నేడు రాహుల్ హ‌యాం వ‌చ్చే స‌రికి ప్రాంతీయ పార్టీలవ్యూహంలో చిక్కుకుని పార్టీ నాశ‌నం అవుతోంద‌నే వాద‌న ప్ర‌బ‌లంగా వినిపిస్తోంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రం యూపీలోనూ ప్రాంతీయ పార్టీల ఎత్తుగ‌డ‌ల‌తో ఉన్న ఓటు బ్యాంకును రాహుల్ పాడుచేసుకున్నార‌ని అక్క‌డి నాయ‌కులు బ‌హిరంగంగానే వ్యాఖ్యానించి పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, ఈశాన్యంలో ఒక‌ప్పుడు ప‌ట్టున్న కాంగ్రెస్ నేడు చేతులు ఎత్తేసే ప‌రిస్థితికి దిగ‌జారిపోయింది.

ఇక‌, ఇప్పుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు కోల్పోయాన‌ని అనుకున్నారో.. ఏమో రాహుల్ తాజా ఎన్నిక‌ల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని ఏకంగా కేర‌ళ‌కు మార్చుకున్నారు. వ‌య‌నాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తుండ‌డం సంచ‌ల‌న‌మే అయినా దీని వెనుక ఆయ‌న యూపీలో ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఎలా చూసుకున్నా.. తాత‌, నాన‌మ్మ‌, తండ్రిల వార‌సత్వాన్ని పుణికి పుచ్చుకుని, పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో రాహుల్ త‌డ‌బాట్లు ప‌డుతున్నార‌నేదివాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.

రాహుల్ వ్యూహం.. బెడిసి కొట్టిందా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts