టీడీపీలో ఓట‌మి అంచున పెద్ద నేత‌లు.. వీరేనా?!

April 15, 2019 at 12:20 pm

ఇటీవ‌ల దేశంలో ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌ని ఉత్కంఠ భ‌రిత వాతావ‌ర‌ణం మ‌ధ్య జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు ఒక్క రా ష్ట్రంలోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా ఆస‌క్తిని పీక్ స్టేజ్‌కి చేర్చాయి. హోరా హోరీ పోరులో వైసీపీ, టీడీపీలు ఒక‌దానిని మించి ఒక‌టి పోటీ ప‌డ్డాయి. హామీల వ‌ర‌ద పారించాయి. రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై సంక్షేమ జ‌ల్లులు కురిపించాయి. మొత్తానికి రాష్ట్ర ంలో ఓ సంచ‌ల‌నానికి, ఓట్ల పెను తుఫానుకి కార‌ణ‌మైన ఈ ఎన్నిక‌లు ముగిసినా.. ఫ‌లితం వ‌చ్చేందుకు నెల రోజుల‌కు పైగానే స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మ‌వుతుంది? అనే సందేహాలు అనేకం నెల‌కొన్నాయి. అదేస‌మ‌యంలో అధికార పార్టీలో గెలుపు ఓట‌ముల‌పై ఇప్ప‌టికే పందేలు క‌డుతున్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది.

ప్ర‌ధానంగా మంత్రులు, కీల‌క‌మైన నాయ‌కులు, ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు సాధించిన నాయ‌కుల గెలుపు ఓట‌ముల‌పై రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప‌క్క రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున పందేలు క‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఏయే నాయ‌కుల ప‌రిస్థితి ఎలా ఉందో చూద్దాం. మంత్రుల విష‌యానికి వ‌స్తే.. క‌ర్నూలు ఫైర్ బ్రాండ్ భూమా అఖిల ప్రియ ఓట‌మి అంచున వేలాడుతున్నార‌ని ఎన్నిక‌ల‌కు ముందుగానే తెలిసిపోయింది. తీవ్ర వివాదాలు, ప్ర‌జ‌ల్లో ఉండ‌క‌పోవ‌డం, పెళ్లి పేరుతో ఆరు మాసాలు సొంత వ్య‌వ‌హారాల‌కే ప‌రిమితం కావ‌డం, మంత్రిగా ఆమె విఫ‌లం కావ‌డం, సొంత పార్టీలోనే ఎగ‌స్పార్టీ వంటివి ఆమెకు ప‌రాజ‌యాన్ని మూట‌గట్టాయి. ఇక‌, మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు. ఆయ‌న కోరుకోక‌పోయినా.. ప‌రాజ‌యం ఆయ‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చింది!

ద‌ర్శి నుంచి ఆయ‌న అసెంబ్లీకి పోటీ చేసి ఉంటే గెలిచేవారు. కానీ, ఒంగోలు పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేయ‌డం బెడిసి కొట్టింది. ఇక‌, కాల్వ శ్రీనివాసులు కూడా ఓట‌మి అంచునే ఉన్నార‌ని స‌మాచారం. రాయ‌దుర్గంలో నెల‌కొన్న అస‌మ్మ‌తి, గ‌త ఎన్నిక‌ల్లోనే పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేని ప‌రిస్థితి ఆయ‌న‌ను వేధించింది. దీంతో ఆయ‌న కూడా ఓట‌మి అంచుకు చేరిపోయారు. మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ప‌రిస్థితి కుడితో ప‌డ్డ ఎలుక‌మాదిరిగా ఉంది. గెలుస్తానా? ఓడుతానా? అనేది ఆయ‌న‌కు సందేహంగానే ఉంది. బ‌ల‌మైన బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ర‌జ‌నీ ఇక్క‌డ గ‌ట్టి పోటీ ఇచ్చారు. దీంతో గెలిచినా.. త‌క్కువ మెజారిటీతోనే బ‌య‌ట‌ప‌డాలి. ఇక‌, మంత్రి అచ్చ‌న్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్క‌లి నుంచి గెలిచ‌న ఈయ‌న‌కు ఇప్పుడు వ్య‌తిరేక ప‌వ‌నాలు జోరుగా వీస్తున్నాయి.

ప్ర‌జ‌ల్లో ఉన్నా.. కొంద‌రినే ప‌ట్టించుకుంటార‌ని, అభివృద్ధిపై విజ‌న్ లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మంత్రి లోకేష్‌.. ఈయన మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేశారు. మొద‌ట్లో ఆశ‌లు వ‌దిలేసుకున్నా.. పోలింగ్ శాతం పెర‌గ‌డం, చివ‌రిలో నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేయ‌డం వంటివి క‌లిసి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. దీంతో గెలుపు గుర్రం ఎక్కే ఛాన్స్ ఉంద‌ని చెబుతున్నారు. ఇక‌, స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ విష‌యానికి వ‌స్తే.. స‌త్తెన‌ప‌ల్లిలో ఏక‌మైన కొన్ని సామాజిక వ‌ర్గాలు ఆయ‌న‌ను ఓడించేందుకు కృషి చేశాయి. దీంతో చాప‌కింద నీరు మాదిరిగా వ్య‌తిరేక ప‌డిపోయింది. దీంతో గెలుపుపై అంచ‌నాలు తారుమార‌య్యాయి. ఇక‌, పెద్దాపురంలో మంత్రి చిన‌రాజ‌ప్ప దూకుడు ఉంటుంద‌ని అనుకున్నా.. పెద్దగా ప్ర‌భావం చూప‌లేదు. దీంతో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కేవ‌ర‌కు కూడా న‌మ్మ‌కం లేద‌ని సొంత శిబిర‌మే చెబుతోంది.

మంత్రి దేవినేని ఉమా ప‌రిస్థితి కూడా డోలాయ‌మానంలోనే ఉంది. ఆయ‌న గెలుపుపై అంచ‌నాలు అంద‌డం లేదు. సానుభూతి లేక పోగా.. వ్య‌తిరేకత ఉంద‌ని తెలిసింది. అదేవిధంగా సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి గెలుపుపై మ‌ళ్లీ పాత‌సీనే రిపీట్ అవుతోంది. ఆయన గెలుపు సాధ్యం కాద‌ని అంటున్నారు. మంత్రి అయ్య‌న్న పాత్రుడు ఇప్ప‌టికే గెలుపు ఆశ‌లు వ‌దిలేసుకున్నారు. ఓడితే వ్య‌వ‌సాయం చేసుకుంటాన‌ని ఎన్నిక‌ల రోజే ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, సంప్ర‌దాయానికి భిన్నంగా క‌డ‌ప ఎంపీ టికెట్ పై పోటీ చేసిన మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి గెలుపు పై కూడా అంచ‌నాలు అంద‌డం లేదు. బ‌ల‌మైన అవినాష్ రెడ్డిని ఓడించ‌డం, పైగా వివేకా మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆదికి డిపాజిట్లు కూడా ద‌క్కే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు.

ఇక‌, ఎమ్మెల్యేల విష‌యానికి వ‌స్తే.. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ బొండా ఉమా ఓట‌మి అంచున వేలాడు తున్నారు. నోటి దురుసు, ఎవ‌రినీ లెక్క‌చేయ‌ని విధానం వంటివి ఆయ‌న మైన‌స్‌గా మారాయి. అదేవిధంగా కొవ్వూరులో వంగ‌ల‌పూడి అనిత కూడా క‌ష్టాలు ఎదుర్కొంటున్నారు. కొత్త ప్లేస్ కావ‌డం, అంద‌రినీ క‌లుపుకొని పోలేక‌పోవ‌డం, ప్ర‌ధానంగా అవినీతి ఆరోప‌ణ‌లు వంటివి ఆమెను ఒంట‌రిని చేస్తున్నాయి. ఇలా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీలోని కీల‌క నాయ‌కులు ఓట‌మికి చేరువ‌గా ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

టీడీపీలో ఓట‌మి అంచున పెద్ద నేత‌లు.. వీరేనా?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts