గంట గెలుపు వెనుక రహస్యం ఇదే !

May 25, 2019 at 2:21 pm

గంటా శ్రీనివాస‌రావు. ప‌రాజ‌యం అనేది తెలియ‌ని నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందారు. అదే ఇప్పుడు ఏపీలో వ‌చ్చిన జ‌గ‌న్ సునామీలోనూ క‌నిపించింది. టీడీపీకి చెందిన అతిర‌థ మ‌హార‌థులు సైతం మ‌ట్టిక‌రిచినా.. గంటా మాత్రం దిగ్విజ యంగా గెలుపు గుర్రం ఎక్కారు. రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ‌ను రేపిన ఏపీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ సృష్టించారు. కార‌ణాలు ఏవైనా టీడీపీ అనూహ్యంగా ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఎక్క‌డిక‌క్కడ నాయ‌కుల‌ను కోల్పోయింది. మొత్తంగా వైసీపీ తుడిచి పెట్టేసింది. ఈ రేంజ్‌లో మొత్తంగా 150 పైగా స్థానాల్లో గెలుస్తుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు కూడా ఊహించ‌లేదు.

ఇంత‌టి అనూహ్య రికార్డును సొంతం చేసుకున్నారు జ‌గ‌న్‌. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. కుటుంబాల‌కు కుటుంబాలే నేల మ‌ట్ట‌మ‌య్యాయి. జ‌గ‌న్ ధాటికి జేసీ బ్ర‌ద‌ర్స్ వంటి వారు కూడా కూలిపోయారు. ఈ ప‌రంప‌రలో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాస‌రావు కూడా ఓడిపోతార‌ని అంద‌రూ అనుకున్నారు. చివ‌రి వ‌ర‌కూ కూడా విజ‌యం దోబూచులాడిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గంటా గెలుపు గుర్రం ఎక్కారు. ఇక్క‌డ త్రిముఖ పోటీ నెల‌కొంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ ఇచ్చారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో భీమిలి నుంచి విజ‌యం సాధించిన గంటా ఈ ఎన్నిక‌ల్లో ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని స‌బ్బం హ‌రికి వ‌దులుకుని తాను నార్త్ నుంచి పోటీ చేశారు.

జ‌గ‌న్ సునామీలో గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్ట‌మే అయినా గంటా మాత్రం విజ‌యం సాధించారు. ఇక‌, గంటా రాజ‌కీయ అనుభ‌వాన్ని చూస్తే.. ఆయ‌న పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ పోటీ చేయ‌లేదు. అదేవిధంగా అప‌జ‌యం లేకుండా ఎప్ప‌టిక‌ప్పుడు గెలుపు గుర్రం ఎక్కుతూనే ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలిసారి 1999లో అనకాపల్లి ఎంపీ(టీడీపీ)గా గంటా విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో నియోజకవర్గం మారిన గంటా చోడవరాన్ని ఎంపిక చేసుకున్నారు. 1999లో ఎంపీగా పోటీ చేస్తే… ఈ దఫా మాత్రం టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడినా… గంటా మాత్రం విజయం సాధించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మళ్లీ నియోజకవర్గం మారారు. ఈ సారి అనకాపల్లి అసెంబ్లీని ఎంచుకున్నారు.

పార్టీ కూడా మారారు. తన సామాజిక వర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం నుంచి బరిలోకి దిగారు. ప్రజారాజ్యం చాలా చోట్ల ఓటమిపాలైనా గంటా మాత్రం తన గెలుపు మంత్రంతో గెలిచేశారు. ఆ తర్వాత చిరు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారిపోయిన గంటా… ఏకంగా మంత్రి పదవి కూడా చేపట్టారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి భీమిలిలో విజ‌యం సాధించి మ‌రోసారి మంత్రిగా చ‌క్రం తిప్పారు. ఇక‌, ఇప్పుడు కూడా నియోజ‌క‌వ‌ర్గం మార్చుకున్నారు. విశాఖ ఉత్త‌రం నుంచి పోటీ చేశారు. ఇదే ఆయ‌న‌ను గెలిపించింద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై ఉన్న ఆగ్ర‌హాన్ని ఆయ‌న త‌ప్పించుకుని విజ‌యం దిశ‌గా దూసుకుపోయారు. సో.. మొత్తానికి టీడీపీ నుంచి గెలిచిన మంత్రుల జాబితాలో గంటా చోటు ద‌క్కించుకున్నారు.

గంట గెలుపు వెనుక రహస్యం ఇదే !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts