గోదావ‌రిలో మునిగిపోయిన సైకిల్‌

May 23, 2019 at 4:27 pm

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలంటే అందరి చూపు కొన్ని ద‌శాబ్దాలుగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల వైపే ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వ‌స్తే ఆ పార్టీయే ఏపీలో అధికారంలోకి వ‌స్తూ వ‌స్తోంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు… ఆ త‌ర్వాత కూడా ఈ రెండు జిల్లాల్లో ఎటు వైపు గాలి వీస్తే స‌హ‌జంగా ఆ పార్టీయే అధికారంలోకి వ‌స్తోంది. 1994లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో టీడీపీ ఒక్క అత్తిలిలో మాత్ర‌మే ఓడి.. ఆ త‌ర్వాత ఉప ఎన్నిక‌ల్లో ఆ సీటు కూడా గెలుచుకుంది. ఆ ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్ ప్ర‌భంజ‌న‌మే క్రియేట్ చేశారు.

ఇక 1999లో టీడీపీ ఒక్క కొవ్వూరులో మాత్ర‌మే ఓడిపోయింది. ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఏపీలో వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చారు. ఇక 2004లో కాంగ్రెస్ 12, టీడీపీ 4 సీట్ల‌లో గెల‌వ‌గా ఈ ఎన్నిక‌ల్లో వైఎస్ గాలిలో ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ఓట‌రు కాంగ్రెస్‌కే జై కొట్టారు. ఇక 2009లోనూ ప‌శ్చిమ‌లో కాంగ్రెస్ 9 సీట్లు సాధిస్తే… టీడీపీ 5, ప్ర‌జారాజ్యం ఒక్క సీటుతో స‌రిపెట్టుకున్నాయి.

ఇక అటు తూర్పుగోదావ‌రిలోనూ సేమ్ టు సేమ్ రిజ‌ల్ట్ వ‌స్తోంది. 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు ఈ జిల్లాలో ప్ర‌జారాజ్యం 10కు త‌గ్గ‌కుండా సీట్లు గెలుస్తుంద‌ని అంద‌రూ లెక్క‌లు వేశారు. అయితే ఈ లెక్క‌ల‌ను జిల్లా ప్ర‌జ‌లు చిత్తుచేశారు. అక్క‌డ కాంగ్రెస్‌కు భారీ మెజార్టీ క‌ట్ట‌బెట్టారు. ఆ ఎన్నిక‌ల్లో జిల్లాలో ఉన్న మూడు ఎంపీ సీట్ల‌తో పాటు మెజార్టీ సీట్ల‌లో కాంగ్రెస్ గెల‌వ‌గా… మ‌రోసారి వైఎస్ గెలిచి రెండోసారి ముఖ్య‌మంత్రి అయ్యారు.

ఇక ఇప్పుడు తాజా ఎన్నిక‌ల్లోనూ గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు సైకిల్‌ను గోదారిలో ముంచేశారు. ఈ రెండు జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని 19 స్థానాల్లో టీడీపీ 5 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. మిగతా 14 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. పెద్దాపురంలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచారు. ఇక రామ‌చంద్రాపురంలో తోట త్రిమూర్తులు ఆధిక్యంలో ఉండ‌గా… రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ, రూర‌ల్ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి భ‌వానీ, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచారు. మండపేటలో వైసీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ఆధిక్యత కనబరుస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 స్థానాల్లో టీడీపీ కేవ‌లం పాలకొల్లు, ఉండిలో మాత్ర‌మే ఆధిక్యంలో ఉంది. పాల‌కొల్లులో వైసీపీ అభ్యర్థి డాక్టర్ బాబ్జీపై టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు, ఉండిలో వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుపై టీడీపీ అభ్యర్థి రామరాజు ఆధిక్యంలో ఉన్నారు. అయితే, భీమవరంలో జనసేన, వైసీపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.

గోదావ‌రిలో మునిగిపోయిన సైకిల్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts