భారీ బ‌డ్జెట్‌తో విక్ర‌మ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా..

May 21, 2019 at 12:28 pm

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో..క‌థ‌లతో ప్రేక్షకుల‌కు ఎప్పుడూ కొత్త‌ద‌నంగా తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడే క‌థానాయ‌కుడు చియాన్ విక్ర‌మ్‌. ప్రతి పాత్రలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఎంతో అంకిత భావంతో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్ లేక ఇబ్బందిప‌డుతున్నాడు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన “ఐ” అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. న‌ట‌న ప‌రంగా విక్ర‌మ్‌కు మంచి గుర్తింపు తీసుకువ‌చ్చింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాలు కూడా ఇలా వ‌చ్చి అలా వెళ్లాయి. అయినా ఓట‌ముల‌కు వెర‌వ‌కుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.

విజ‌య దాహం తీర్చుకోవ‌డానికి ఎదురుచూస్తున్న విక్ర‌మ్ కెరీర్‌లో త‌న 58వ చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ చిత్రానికి ‘డిమాంటి కాలనీ’, ‘ఇమైకా నొడిగల్‌’ వంటి బ్లాక్‌బస్టర్లను ఇచ్చిన అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదో బ్రహ్మాడమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కించనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. 7 స్క్రీన్‌ స్టూడియో బ్యానరుపై లలిత్‌కుమార్‌ భారీ బడ్జెట్‌తో దీనిని తెరకెక్కించనున్నారు. వయాకమ్‌ 18 స్టూడియోస్‌ సహ నిర్మాత. ఎంతో ఆసక్తికరమైన వీరిద్దరి కాంబినేషన్‌లోని కొత్త చిత్రం షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభం కానుంది.

2020లో వేసవిలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది.
అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా భార‌తీయ చ‌ల‌న‌చిత్రంలోనే మైలురాయిగా మిగిలిపోతుంద‌ని చిత్ర‌వ‌ర్గాలు చెబుతున్నాయి. బ‌ల‌మైన క‌థ ఉండ‌టంతో పాటు దానికి విక్ర‌మ్ న్యాయం చేకూర్చ‌గ‌ల‌డు అనే న‌మ్మ‌కంతోనే నిర్మాత‌లు ఈ సాహ‌సం చేస్తున్న‌ట్లు స‌మాచారం. క‌థాప‌ర‌మైన ప్రాధాన్యంతో చాలా వ‌ర‌కు విదేశాల్లోనే చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

భారీ బ‌డ్జెట్‌తో విక్ర‌మ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts