కొత్త అసెంబ్లీలో ఆ ఇద్ద‌రే హాట్ టాపిక్‌

June 12, 2019 at 1:33 pm

ఏపీలో కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. 151 మంది స‌భ్యుల‌తో వైసీపీ, 23 మందితో టీడీపీ, ఒకే ఒక స‌భ్యుడితో జ‌న‌సేన లు అసెంబ్లీలోకి అడుగు పెట్టాయి. తొలి శాస‌న స‌భ స‌మావేశాలు మొత్తంగా ఐదు రోజులు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, తొలి రోజు మాత్రం ఆయా స‌బ్య‌లతో ప్ర‌మాణ స్వీకారానికి ప్లాన్ చేశారు. ఆర్టిక‌ల్ 188 ప్ర‌కారం ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు అసెంబ్లీ కార్య‌ద‌ర్శి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, స‌భలోకి అడుగు పెట్టిన ఇరు పార్టీల్లోని స‌భ్యుల్లోనూ కేవ‌లం ఇద్ద‌రే ఇద్ద‌రు హాట్ టాపిక్‌గా మారారు. వీరిలో ఒకరు టీడీపీ అభ్య‌ర్థి, హిందూపురం నుంచి విజ‌యం సాధించిన బాలకృష్ణ‌, రెండో వారు వైసీపీ అబ్య‌ర్థి, చిత్తూరు జిల్లా న‌గ‌రి నుంచి విజ‌యం సాధించిన రోజా.

ఈ ఇద్ద‌రిపైనే ఎక్కువ‌గా ప్ర‌జ‌లు ఫోక‌స్ చేశారు. వీరు స‌భ‌లోకి అడుగు పెట్టినప్ప‌టి నుంచి ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కు కూడా ప్ర‌తి ఒక్క‌రి దృష్టినీ ఆక‌ర్షించారు. బాల‌య్య విష‌యానికి వ‌స్తే.. స‌భ‌లో ఇంకా వారి వారి స్థానాలు కేటాయించ‌నందున ఎక్క‌డైనా కూర్చునే అవ‌కాశం క‌ల్పించారు. తొలుత సీఎంగా ఉన్న జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న పేరును అసెంబ్లీ కార్య‌ద‌ర్శి పిలిచిన వెంట‌నే వైసీపీ స‌భ్యులు అమితానందంతో బ‌ల్లల‌పై చ‌రుస్తూ.. సంతోషం వ్య‌క్తం చేశారు. ఇక‌, త‌ర్వాత వ‌రుస క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడుగా ఉన్న టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌మాణం చేశారు. అనంత‌రం మంత్రులు, పేర్ల అక్ష‌రాల్లోని వ‌రుస క్ర‌మాన్ని అనుస‌రించి మిగిలిన స‌భ్యులు ప్ర‌మాణం పూర్తి చేశారు.

ఇక, బాల‌య్య పార్టీ తీర్మానం ప్ర‌కారం పూర్తిగా ప‌సుపు దుస్తుల్లోనే స‌భ‌కు వ‌చ్చారు. త‌న పేరును పిలిచిన‌ప్పుడు అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి ఎదురుగా ఏర్పాటు చేసిన మైకు వ‌ద్ద‌కు వ‌చ్చి దైవ సాక్షిగా ప్ర‌మాణం చేయ‌డం విశేషం. ఆయ‌న ప్ర‌మాణం చేస్తున్న‌ప్పుడు పూర్తిగా తెలుగులోనే చేయ‌డం ఆన‌వాయితీగా పెట్టుకున్నారు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఇదే విధంగా ఆయ‌న పూర్తిగా తెలుగులోనే ప్ర‌మాణం చేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఇక‌, వైసీపీ నాయ‌కురాలు, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా సాధార‌ణ దుస్తుల్లోనే వ‌చ్చారు. మిగిలిన స‌భ్యులు పార్టీల కండువాల‌ను ధ‌రిస్తే.. ఈమె దానిని కూడా ధ‌రించ‌కుండా రావ‌డం విశేషం ఈమెకూడా తెలుగులోనే ప్ర‌మాణం చేయ‌డం విశేషం. మొత్తంగా స‌భ‌లో ఈ ఇద్ద‌రు స‌భ్యులు కూడా ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

కొత్త అసెంబ్లీలో ఆ ఇద్ద‌రే హాట్ టాపిక్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts