తాజా సెన్సేష‌న్‌:జ‌న‌సేన తుడిచిపెట్టుకు పోతుందా?

June 12, 2019 at 6:33 pm

రాష్ట్రంలో మార్పు దిశ‌గా అడుగులు వేస్తామ‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో నామ‌రూపాలు లేకుండా పోయింది. పార్టీ పెట్టి ఆరేళ్లు అవుతున్నా.. గ్రామ‌స్థాయి, మండ‌ల స్థాయిల్లో ఇంకా పుంజుకోని ఈ పార్టీకి కేవ‌లం ఒకే ఒక్క‌రు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. రాజోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాపాక వ‌ర‌ప్ర‌సాద్ గెలుపొందారు. పార్టీ అధినేత ప‌వ‌న్ రెండు చోట్ల నుంచి పోటీ చేసినా.. ఒక్క చోట కూడా గెలుపు గుర్రం ఎక్క‌లేదు. దీంతో పార్టీ అస్తిత్వంపైనే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి.

గెలిచిన ఒక్క అభ్య‌ర్థి రాపాక కూడా పార్టీలో ఉంటారా? వ‌ల‌స వెళ్తారా? అనే సందేహాలు ప్ర‌శ్న‌లుగానే ఉన్నాయి. రాజ‌కీ యాల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచిన నాయ‌కులు త‌ర్వాత కాలంలో పార్టీలు మారిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఇదే సూత్రాన్ని అనుస‌రించి రాపాక కూడా జెండా పీకేస్తార‌నే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. కానీ, వీటికి బ్రేక్ వేస్తూ.. స్వ‌యంగా రాపాక గ‌తంలో ఒక ప్ర‌క‌ట‌న చేశారు. తాను వైసీపీలో వెళ్తాన‌ని వ‌స్తున్న వార్త‌లు, విశ్లేష‌ణ‌ల‌ను ఆయ‌న కొట్టి పారేశారు. అంతేకాదు, తాను వైసీపీలోకి వెళ్తే.. త‌న సంఖ్య 152 అవుతుంద‌ని, కానీ, జ‌న‌సేన‌లో ఉంటే 1గానే గుర్తింపు ఉంటుంద‌ని లాజిక్ చెప్పారు.

అయితే, తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రాపాక గోడ‌దూకడం ఎంతో కాలం ప‌ట్ట‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల జ‌న‌సేనాని నిర్వ‌హించిన ఓట‌మిపై స‌మీక్ష కార్య‌క్ర‌మానికి రాపాక హాజ‌రుకాకూడ‌ద‌ని అనుకున్నారు. కానీ, కొంద‌రి సూచ‌న‌ల‌తో ఆయ‌న ఆ స‌మీక్ష‌కు వెళ్లారు. అయితే, ప‌వ‌న్‌ను అభినందించిన ఆయ‌న ప‌ట్టుమ‌ని ప‌ది నిమిషాలు కూడా కూర్చోకుండానే బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, తాజాగా తొలి అసెంబ్లీ భేటీ స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్‌తో రాపాక దాదాపు 10 నిమిషాల సేపు ప‌ర్స‌న‌ల్‌గా భేటీ అయ్యారు. వివిధ అంశాల‌ను చ‌ర్చించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ మారేందుకు త‌న సంసిద్ధ‌త‌ను జ‌గ‌న్ ముందు పెట్టార‌ని తెలుస్తోంది. అయితే, జ‌న‌సేన స‌భ్య‌త్వానికి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి వ‌స్తే.. త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని జ‌గ‌న్ అన్న‌ట్టు స‌మాచారం. మ‌రి దీనిపై రాపాక ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. రాపాక క‌నుక వైసీపీ తీర్థం పుచ్చుకుంటే.. ఇక జ‌న‌సేన ప‌ని జీరో అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజా సెన్సేష‌న్‌:జ‌న‌సేన తుడిచిపెట్టుకు పోతుందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts