ముక్కుసూటి కేశినేని… తెర‌వెన‌క దేవినేని

June 11, 2019 at 5:16 pm

ఏపీ టీడీపీలో ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు మ‌ధ్య జ‌రుగుతోన్న అంత‌ర్గ‌త యుద్ధం వెన‌క చాలా స్టోరీనే ఉంద‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయినా విజ‌య‌వాడ ఎంపీగా మాత్రం కేశినేని విజ‌యం సాధించారు. ఈ గెలుపులో కేవ‌లం ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇమేజే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఐదేళ్ల‌లో విజ‌య‌వాడ లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో నాని పార్టీల‌కు అతీతంగా సేవ‌లు చేశారు. అందుకే లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలోని ఆరు చోట్ల టిడిపి ఎమ్మెల్యేలు ఓడిపోయినా నానికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆయన విజయం సాధించారు వాస్తవానికి గత మూడు సంవత్సరాల నుంచే దేవినేని – కేశినేని మధ్య కోల్డ్వార్ నడుస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా చేసిన అభివృద్ధి పనులు కేశినేని నానికి వ్యక్తిగత ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి.

కేశినేని నాని ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరు ఉంది. ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట కోసం ఆయన ఎంతకైనా వెళ‌తారన్న అభిప్రాయం ఉంది. స్వతహాగా ఎవరితోనూ కావాలని వివాదం పెట్టుకునే మనస్తత్వం నానీది కాదు. త‌న కేశినేని ట్రావెల్స్ బస్సులో విషయంలో చెలరేగిన వివాదంతో తన బస్సులను చేస్తానని చెప్పి అలాగే చేశారు.. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. వాస్తవంగా చూస్తే కేసినేని నానికి విజయవాడ పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించడం వెనక దేవినేని ఉమా కీలకపాత్ర పోషించారు. అయితే కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఎవరైనా తనను మించి పెరిగితే దేవినేని ఉమా సహించలేరు అన్న నానుడి ఉంది. ఎంతో మంది టిడిపి సీనియర్లు ఆయన తీరుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అయితే చంద్రబాబు, లోకేష్ కు అత్యంత కావడంతో ప్రతిసారి అధిష్టానం దగ్గర ఒక మాట నెగ్గుతూ వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ ఎన్నిక‌ల‌కు ముందు కూడా కేశినేనిని ఓడించేందుకు ఉమా తెర‌వెన‌క చాలా కుట్ర‌లే ప‌న్నార‌న్న‌ది కేశినేని వ‌ర్గీయుల ఆరోప‌ణ‌. ప్ర‌తిసారి నానికి పేరు వ‌చ్చే టైంలో తెర‌మీద‌కు వ‌చ్చే దేవినేని ఆయ‌న‌ను టార్గెట్ చేసేలా ఏదో ఒక డైలాగ్ కొడుతుండేవార‌న్న చ‌ర్చ నాలుగేళ్లుగా న‌డిచింది. ఇక పదేళ్ల కిందట జిల్లాలో దేవినేని ఉమా, కొడాలి నానిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేది. అప్పట్లో దేవినేని ఉమా ఒంటెద్దు పోకడలు పోతున్నారని పలువురు నాయకులు బాధపడేవారు. ఆ త‌ర్వాత ఉమాకు వంశీకి ప‌డేది కాదు. ఇక గ‌ద్దె రామ్మెహ‌న్ సౌమ్యుడు అయినా ఆయ‌న‌కు ఉమాకు గొడ‌వ‌లే ఉండేవి. ఇక మాజీ డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌తోనూ ఉమాకు పొసిగేది కాదు. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన దాస‌రి సోద‌రుల‌తోనూ ఉమాకు గ్యాపే ఉంది.

ఇక నాని టీడీపీలో ఉన్న‌ప్పుడు ఉమా ఆయ‌న్ను అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నం చేసినందువ‌ల్లే ఆయ‌న పార్టీ నుంచి వెళ్లిపోవటానికి కారణమని పార్టీలో అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ త‌ర్వాత వంశీతో ఉమాకు పొస‌గ‌క‌పోవ‌డంతో విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ పార్టీ బాధ్య‌త‌లు చూస్తోన్న వంశీని త‌ప్పించి నానీని తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు. ఇక తాను తీసుకువ‌చ్చిన నాని ఎదుగుద‌లే ఉమాకు న‌చ్చ‌డం లేద‌న్న గుస‌గుస‌లు ఉన్నాయి. ఇక ప్ర‌తి విష‌యంలోనూ ముక్కుసూటిగా ముందుకు వెళ్లే నాని ఈ ఎన్నిక‌ల్లో గెలిచాక కూడా త‌న‌కు కాద‌ని.. ఓడిన ఉమాకు ప్ర‌యార్టీ ఇవ్వ‌డాన్ని స‌హించ‌లేక‌పోయారు.

అందుకే ఆయ‌న వ‌రుస‌గా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూ సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తున్నారు. చంద్ర‌బాబు వారించినా కూడా నాని మాత్రం ప‌దే ప‌దే పోస్టులు పెడుతున్నారు. తాజా పోస్టులో ‘తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకు జీవితాంతం కొడాలి నాని కృతజ్ఞుడిగా ఉండాలి ’ వ్యాఖ్యలు దేవినేని ఉమాను టార్గెట్‌గా చేసుకునే చేసిన‌ట్లు ఉన్నాయి. ఆ రోజు ఉమా నానిని పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంప‌క‌పోతే కొడాలి నాని వైసీపీలో చేరేవారు కాదు.. ఇప్పుడు మంత్రి కూడా అయ్యేవారు కాదన్న తీరున అర్థం వచ్చేలా ఉందని పార్టీలోని కొందరు నాయకులు అంటున్నారు.

ముక్కుసూటి కేశినేని… తెర‌వెన‌క దేవినేని
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts