జగన్ బోనులో నారాయణే ఫస్ట్ !

June 4, 2019 at 1:12 pm

ఆయ‌న చంద్ర‌బాబు హ‌యాంలో కీల‌క మంత్రి. ప్ర‌జాక్షేత్రంలో త‌న స‌త్తా చూప‌క‌పోయినా.. పాల‌నా ప‌రంగా త‌న స‌త్తా చాటుతానంటూ.. మంత్రిగా ప్ర‌మాణం చేసిన ఆయ‌నే నారాయ‌ణ విద్యాసంస్థ‌ల అధినేత పొంగూరు నారాయ‌ణ‌. చంద్ర బాబు కేబినెట్‌లో అత్యంత కీల‌కంగా భావించే సీఆర్‌డీఏకు వైఎస్ చైర్మ‌న్‌గా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. అయితే, ఓడ‌లు బ‌ళ్ల‌యిన చందంగా ఇప్పుడు ఆయ‌న జ‌గ‌న్ ముందు చేతులు క‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు రాజ‌ధాని నిర్మాణ క్ర‌తువునుబాబు ప‌రిశీలిస్తూనే.. మెజారిటీ ప‌నుల‌ను మంత్రిగా ఉన్న నారాయ‌ణ‌కు అప్ప‌గించారు. రైతుల నుంచి భూ స‌మీక‌ర‌ణ నుంచి సింగ‌పూర్ కంపెనీల‌తో ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఓకే చేయ‌డం వ‌ర‌కు, రాజ‌ధాని నిర్మాణాల డిజైన్ నుంచి వాటి పునాదుల వ‌ర‌కు కూడా అంతా తానై వ్య‌వ‌హ‌రించారు మంత్రి నారాయ‌ణ‌. అయితే, నారాయ‌ణ ఏం చేసినా కూడా అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే సాగించారు. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వం మారింది. ముఖ్యంగా సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆది నుంచి చెబుతున్న‌ట్టుగానే రాజ‌ధానిపై త‌న వైఖ‌రిని సీఎంగా ఎన్నికైన నాటి నుంచి కూడా వినిపిస్తూనే ఉన్నారు.

రాజ‌ధాని భూముల్లో కుంభ‌కోణం జ‌రిగింద‌ని, పెద్ద పెద్ద నాయకులు బినామీ పేర్ల‌తో రైతుల‌ను బురిడీ కొట్టించి భూములు కొనుగోలు చేశార‌ని ఆయ‌న అంటున్నారు. అంతేకాదు, త‌న పాల‌న‌లోనే ఈ భూముల అక్ర‌మాల భాగోతాన్ని త‌వ్వి తీస్తాన‌ని సీఎంగా ప్ర‌మాణం చేసిన వెంట‌నే ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామం.. అటు తిరిగి ఇటు తిరిగి మంత్రి నారాయ‌ణ మెడ‌కు చుట్టుకుంటుంద‌ని, ఇది ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సీఆర్డీఏ పేరుతో జరిగిన అక్రమాలన్నీ అప్పటి మున్సిపల్ శాఖా మంత్రిగా వ్యవహరించిన నారాయణ పేరుమీదుగానే జరిగాయి. చంద్రబాబు తనచేతికి మట్టి అంటకుండా అన్నీ నారాయణని అడ్డుపెట్టుకునే చేశారు.

సీఆర్డీఏకి సంబంధించి అధికారుల నియామకాలు, బదిలీలు అన్నీ మున్సిపల్ శాఖే చూసుకునేది. విదేశీ పర్యటనలకైనా, అధికారులతో సమీక్షలకైనా చంద్రబాబుతోపాటు నారాయణ కచ్చితంగా హాజరయ్యేవారు. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ ఎలాంటి విచార‌ణ‌కు ఆదేశించినా.. ఫ‌స్ట్ అధికారులు ప్ర‌శ్నించేది… నేరాలు తేలితే.. బోనులో నిల‌బెట్టేదీ నారాయ‌ణ‌నే అనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

జగన్ బోనులో నారాయణే ఫస్ట్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts