
అనుభవం నేర్పిన పాఠం.. జనసేనాని పవన్‌పై బాగా పనిచేసినట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు, తర్వాత పవన్ వ్యవహారశైలిలో పూర్తిగా మార్పు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఎన్నికలకు ముందు.. తెలంగాణలోనూ ఏపీలోనూ పోటీ చేస్తామని చెప్పిన ఆయన తెలంగాణ ఎన్నికలు జరిగిన సమయం లో మౌనంగా ఉండిపోయారు. ఇక, కొండగట్టు అంజన్న ఆలయం నుంచి యాత్ర చేసినప్పుడు కేసీఆర్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకే మచ్చతెచ్చాయి. ఈ విషయాన్ని గ్రహించే సరికి చాలా సమయం పట్టింది.
ఇక, ప్రధానంగా ఏపీ విషయానికి వచ్చేసరికి.. ఎన్నికలకు నాలుగు మాసాల ముందు చాలా మంది కీలక నాయకులు, ఇత ర పార్టీల్లో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులు జనసేన బాట పట్టాలని అనేక రూపాల్లో ప్రయత్నించారు. నాడు .. మడి కట్టుకున్నానని చెప్పిన పవన్.. ఏ ఇతర నాయకులను కూడా చేర్చుకునే ప్రయత్నం చేయలేదు కేవలం రావెల కిశోర్ బాబు విషయంలో మాత్రమే బెట్టు సడలించిన పవన్.. మిగిలిన నాయకుల విషయంలో మాత్రం సడలించలేక పోయారు.
ఫలితంగా జూనియర్లను చాలా చోట్ల ఎన్నికల్లో పోటీకి పెట్టారు. తన ఇమేజ్ పార్టీని కాపాడుతుందని, కుదిరితే అధికారంలోకి తీసుకువస్తుందని కూడా పవన్ భావించారు. అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రం విషయం చాలా వరకు పవన్‌కు బోధపడింది. తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఘోరమైన ఓటమి నుంచి ఆయన పాఠాలు నేర్చుకునేందుకు దాదాపు 20 రోజుల సమయం పట్టింది. మరోపక్క, ఆకుల సత్యనారాయణ వంటి కాపు నాయకులు పార్టీ మారేందుకుప్రయత్నాలు చేసుకుంటున్నారు.
దీంతో పార్టీని నిలబెట్టుకోవడం అంటే.. అసలు పార్టీఅంటే తాను ఒక్కడినేకాదనే విషయాన్ని ఇన్నాళ్లకు పవన్ గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయన సీనియర్లకు ఇప్పుడు పరోక్షంగా ద్వారాలు తెరిచారు. ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని చెబుతున్నారు. కానీ, ప్రాథమికంగా చేతులు కాలిపోయిన తర్వాత, వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్న తర్వాత పవన్ సాధించేది ఏదైనా ఉంటే ఐదేళ్ల తర్వాతే అంటున్నారు పరిశీలకులు.