టీడీపీలో ఆ ఒక్క‌డు త‌ప్ప అంద‌రూ జంపేనా… !

June 19, 2019 at 10:18 am

ఏపీలో విపక్ష టిడిపి కనీవినీ ఎరుగని రీతిలో ఘోరంగా ఓడిపోయాక టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు తట్టా బుట్టా సర్దుకునే పనిలో బిజీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. టిడిపిలో అందరూ ఓడిపోగా మిగిలిన ఎమ్మెల్యేలు…. పార్టీ సీనియర్ నేతలు కొందరు వైసీపీ వైపు చూస్తుంటే… వైసీపీలోకి వెళ్ల‌లేని వారు… అక్కడ ఇమ‌డ‌లేమ‌ని భావిస్తున్న వారు బిజెపి వైపు చూస్తున్నారు. ఏపీలో టీడీపీ ప్లేస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు పక్కాగా పావులు కదుపుతున్న బిజెపి, టిడిపిలోని పెద్ద తలకాయల‌పై గురి పెట్టింది. ఇదిలా ఉంటే టిడిపిలో మెజార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు చూస్తుంటే… ఆ పార్టీ లోక్‌స‌భ, రాజ్యసభ సభ్యులు మాత్రం బిజెపి వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.

తాము త్వరలోనే టీడీపీకి చెందిన పలువురు నేతలు తమ పార్టీలో చేరేందుకు గ్రీన్‌సిగ్న్‌ల్ ఇస్తామ‌ని… ఒకసారి తాము గేట్లు ఎత్తితే టిడిపి పరిస్థితి ఏంటో ? మీరే చూస్తారని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజ్యసభలో బీజేపీకి తక్కువ బలం ఉంది. ప్రస్తుతం టిడిపికి అక్కడ ఆరుగురు ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో ఒక ఎంపీ మినహా మిగిలిన వారందరూ బీజేపీలోకి జంప్ అయిపోతున్నారంటూ బీజేపీ నుంచి సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ వర్గాల్లో టిడిపి పార్లమెంటులో ఖాళీ అయిపోతుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక రాజ్యసభలో టిడిపికి ఉన్న ఆరుగురు ఎంపీల‌లో ఇటీవల ఎంపికైన కనకమేడల రవీంద్రకుమార్ మినహా మిగిలిన వారంతా ఎప్పుడైనా గోడ దూకేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

గత ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సుజనా చౌదరితో పాటు సీఎం రమేష్ తోట సీతారామలక్ష్మి, టీజి వెంకటేష్ తదితర నాయకులు బిజెపికి ఎప్పుడంటే అప్పుడు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారట ఇక తెలంగాణలో టిడిపి తరపున ఎంపీగా ఉన్న గరికపాటి మోహన్ రావు కూడా బీజేపీలో చేరబోతున్నట్టు ఏదేమైనా టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన వారిలో కనకమేడల రవీంద్రకుమార్ మినహా మిగిలిన వారందరి పార్టీ మార్పుపై వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా తెలుసని ఆయన కూడా ఈ విషయంలో మౌనంగా ఉండటం మినహా చేసేది ఉండదని అంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు పార్టీలోనే చాలా మంది నేతలు సైతం ఆయ‌న మాట వినేందుకు సిద్ధంగా లేరు. ఐదేళ్లపాటు పార్టీలో ఉన్న తప్పులను తాము చెప్పిన మీరు వినిపించుకోలేదు…. ఇప్పుడు మీరు చెప్తే మేం ఎందుకు ? వింటాం అని ఎదురు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇక టీడీపీకి చెందిన ముగ్గురు లోక్‌స‌భ సభ్యుల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మార్పుపై ఊగిసలాటలోనే ఉన్నారు. ప్రస్తుతానికి గల్లా జయదేవ్ న్యూట్రల్ గా ఉన్నా… ఆయన వ్యాపార అవసరాల దృష్ట్యా ఆయన కూడా కేంద్రం నుంచి ఒత్తిళ్లు వస్తే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా ఒక ఘోర పరాజయం టిడిపి మూలాలను కదిలించి వేస్తోంది.

టీడీపీలో ఆ ఒక్క‌డు త‌ప్ప అంద‌రూ జంపేనా… !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts