ఓ విజేత క‌థ‌: నాడు కూలీ.. నేడు ఎమ్మెల్యే

June 6, 2019 at 12:47 pm

అదృష్టం ఎప్పుడు ఎవ‌రిని ఎలా వ‌రిస్తుందో చెప్ప‌డం క‌ష్టం. ఎన్నో ఏళ్లుగా ప్ర‌జ‌ల్లోనే ఉంటూ కూడా విజ‌యాన్ని కైవ‌సం చేసుకోని వాళ్లు కొన్ని వంద‌ల మంది రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇక‌, ఎన్నో ఏళ్లుగా ప్ర‌జాప్ర‌తినిధులుగా ఉండి కూడా అధి కారానికి దూర‌మైన వాళ్లు అనేక మంది ఉన్నారు. కానీ, అదృష్ట ల‌క్ష్మి ఏ రూపంలో ఆయ‌న ఇంటి త‌లుపు త‌ట్టిందో తెలి య‌దు కానీ.. కూలీగా మూట‌లు ఎత్తిన చేతులు ఇప్పుడు గాలిలోకి ఎగురుతున్నాయి. ప్ర‌జ‌ల‌కు నేనున్నానంటూ.. భ‌రోసా ఇస్తున్నాయి. అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి రావ‌డ‌మే కాదు.,. అంత‌క‌న్నా అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలిచి త‌న స‌త్తా చా టుకుని త‌న అదృష్టాన్ని నిరూపించుకున్న విజేత క‌థ ఇది!!

విష‌యంలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలానికి చెందిన వెంక‌ట గౌడ విజేతగా నిలిచారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషిగా ఎదిగారు. ఆయ‌నే ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లా ప‌ల‌మ‌నేరు నుంచి సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌, మాజీ మంత్రి అమ‌ర‌నాథ్ రెడ్డిని చిత్తుగా ఓడించి.. వైసీపీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఆయ‌న జీవితాన్ని ఒక్క‌సారి ప‌రికించి చూస్తే.. అనేక ఎత్తు ప‌ల్లాలు క‌నిపిస్తాయి. ప‌ట్టుమ‌ని ప‌దో త‌ర‌గ‌తి కూడా పూర్తి చేయ‌ని ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశమే ఓ మిరాకిల్‌. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన గౌడ్‌, చిన్నతనంలో కూలీ పని చేశారు. పెద్దగా చదువుకోక పోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆయన కూలీగా మారారు.వెంకట గౌడ్ 9వ తరగతిలో ఉండగానే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు ఆయనపై పడ్డాయి.

ఈ క్ర‌మంలోనే కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆయ‌న పలమనేరులో ఒక సిమెంట్ దుకాణంలో కూడా రోజు వారీ కూలీకి పనిచేశారు. సొంతఊరిలో ఉండలేక బెంగళూరు వెళ్లి కూలీ పనులు చేసేవారు. అయితే తన సన్నిహితులతో బెంగళూరు వెళ్లిన వెంకట గౌడ్ తొలుత కూలీగా ఉన్నా ఆ తర్వాత మేస్త్రీ అయ్యారు. అనంతరం బెంగళూరులో ఇళ్లు కట్టి విక్రయించడం ప్రారంభించారు. స్నేహితులతో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించి కోట్లకు పడగలెత్తారు. అయితే కొన్నాళ్ల క్రితం వెంకట గౌడ్ కు తన స్నేహితుడి ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిచయం అయ్యారు.

పెద్దిరెడ్డి కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత ఆయనకు రాజకీయాల్లోకి రావాలని కోరిక పుట్టింది. తన మనసులోని మాటను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద బయటపెట్టడంతో ఆయన అనూహ్యంగా ఓకే చెప్పారు. జగన్ ను ఒప్పించి వెంకటగౌడ్ ను పలమనేరు వైసీపీ ఇన్ ఛార్జిగా నియమించారు. బీసీలు ఎక్కువగా ఉండటంతో జగన్ కూడా టిక్కెట్ ఇచ్చేశారు. బంపర్ మెజారిటీతో గెలిచారు. ఒకనాడు కూలీ చేసినా.. కోట్లు సంపాదించినా…. చివరకు ఎమ్మెల్యే అయినా అంతా ఆయన కష్టంతోనే అంటున్నారు వెంకట గౌడ్ స్నేహితులు. నిజంగా గౌడ ఓ విజేతే క‌దా!?

ఓ విజేత క‌థ‌: నాడు కూలీ.. నేడు ఎమ్మెల్యే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts