టీడీపీలో ఆ ముగ్గురు క‌మ్మ ఎమ్మెల్యేల‌పై వైసీపీ వార్ స్టార్ట్‌..!

June 16, 2019 at 3:32 pm

రాష్ట్రంలో అధికార పార్టీ మారింది. స‌హ‌జంగానే రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాల్లో ఆధిప‌త్య ధోర‌ణి మొద‌ల‌వ‌డం మామూలే. అయితే, ఇలాంటి వాతావ‌ర‌ణం ప్రారంభ‌మయ్యేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఎంత లేద‌న్నా ప్ర‌భుత్వం ఏర్పడిన త‌ర్వాత క‌నీసం మూడు నాలుగు నెల‌లు ప‌డుతుంది. కానీ, తాజాగా మాత్రం వైసీపీ నేత‌లు కాస్త దూకుడుగానే ముందుకు వెళుతున్నారు. ఒక‌ప‌క్క.. జ‌గ‌న్ ఎంత వారిస్తున్నా.. పార్టీ నాయ‌కులు మాత్రం అధినేత మాట‌ల‌ను పెడ‌చెవిన పెడుతున్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఒక‌పక్క జ‌గ‌న్ సూచిస్తున్నా.. వారు వినిపించుకోవ‌డం లేదు.

ముఖ్యంగా ప్ర‌కాశంలో వైసీపీ నేత‌ల దూకుడు ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ బారీగానే ఉన్నా.. ప్ర‌కాశం జిల్లాలో మాత్రం టీడీపీ నాలుగు కీల‌క స్థానాల్లో విజ‌యం సాధించింది. కొండ‌పి, ప‌రుచూరు, అద్దంకి, చీరాల నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నాయ‌కులు ఓడిపోయి.. టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నాయ‌కులు అప్పుడే టీడీపీని టార్గెట్ చేసే ప్ర‌య‌త్నాలు ప్రారంభించేశారు. ఇది ఏ ప్ర‌భుత్వం ఉన్నా జ‌రిగేదే అయినా వైసీపీ దూకుడు ఎలాంటి ప‌రిణామాలల‌కు దారి తీస్తుందా ? అన్న సందేహాలు ఉన్నాయి. దీనిలో భాగంగా ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీ హ‌యాంలో ఏర్పాటు చేసిన శిలా ఫ‌ల‌కాల‌ను, పార్టీ దిమ్మ‌ల‌ను కూడా కూల‌గొడుతున్నారు.

వాస్త‌వానికి నాలుగు చోట్ల టీడీపీ గెలిచినా.. ఒక ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం మిన‌హాయిస్తే.. మిగిలిన మూడు చోట్ల కూడా చంద‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులే విజ‌యం సాధించారు. ఇది కూడా ఉద్రిక్త‌త‌ల‌కు దారితీస్తోంది. అద్దంకి విష‌యాన్ని తీసుకుంటే.. ఇక్క‌డ నుంచి గొట్టిపాటి ర‌వి విజ‌యం సాధించారు. అయితే, ఈయ‌న 2014లో వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధించి.. అనంత‌రం టీడీపీలోకి జంప్ చేశారు. దీంతో ఆయ‌న పార్టీ మార‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ నాయ‌కులు ఇప్పుడు ఆయ‌న‌పై ప‌రోక్ష యుద్ధం ప్రారంభించారు. ఇక‌, ప‌రుచూరులో ఏలూరి సాంబ‌శివ‌రావు విజ‌యం సాధించారు. ఇక్క‌డ కూడా వైసీపీ అభ్య‌ర్థిగా చంద్ర‌బాబు తోడ‌ళ్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌రావు పోటీ చేశారు. అయితే, ఆయ‌న ఓడిపోయారు.

ఈ నేప‌థ్యంలో ఏలూరి వ‌ర్సెస్ ద‌గ్గుబాటి ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీసిన‌ట్టు అయింది. ఈ క్ర‌మంలో ఇక్క‌డ కూడా ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఇక‌, వీట‌న్నింటికీ చాలా భిన్న‌మైన వాతావ‌ర‌ణం చీరాల‌లో నెల‌కొంది. రాజ‌కీయ సీనియ‌ర్ అయిన క‌ర‌ణం బ‌ల‌రాం ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించారు. ఆయ‌నపై పోటీ చేసి, విజ‌యం ఖాయ‌మ‌ని అనుకున్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఓట‌మిపాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. త‌న‌దే పైచేయిగా ఉండాల‌ని ఆమంచి భావిస్తున్నారు. దీంతో ఇక్క‌డ మ‌రింత ఉద్రిక్త‌త నెల‌కొంది. మ‌రి వీటిని అదుపు చేయాల్సిన బాధ్య‌త‌, వైసీపీ నేత‌ల‌ను అదుపులో ఉంచాల్సిన బాధ్య‌త సీఎం జ‌గ‌న్‌పై ఉంది. మ‌రి ఎలా వీటిని అదుపు చేస్తారో చూడాలి.

టీడీపీలో ఆ ముగ్గురు క‌మ్మ ఎమ్మెల్యేల‌పై వైసీపీ వార్ స్టార్ట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts