ఏపీలో పేర్లు, రంగులు మారిపోతున్నాయ్‌…!

June 1, 2019 at 1:10 pm

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిందో లేదో పలు ప్రభుత్వ పథకాల పేర్లు చకచక మారిపోతున్నాయి. చాలా చోట్ల గత ప్రభుత్వంలో ఉన్న బోర్డులు మార్చేసి కొత్త బోర్డులు పెట్టేస్తున్నారు. ఈ తంతు కొత్త కాకపోయినా గత తెలుగుదేశం ప్రభుత్వం మితిమీరి తమ పార్టీ నేతల పేర్లు ప్రభుత్వానికి పెట్టుకోవడంలో ఆరితేరిపోయింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వైఎస్ జగన్ సీఎం అయ్యాడో లేదో వెంటనే గత ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాల పేర్లు మార్చేస్తూ జీవోలు వచ్చేస్తున్నాయి. గతంలో వైఎస్ 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాల పేర్లకు దివంగత మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల పేర్లు పెట్టారు. వైయస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు రాజీవ్ గాంధీ పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

అప్పట్లో ఓ సంచలనం అయిన ఇళ్ల‌ పథకానికి ఇందిరమ్మ ఇళ్లు అని పేరు పెట్టారు. చివరకు హైదరాబాదులో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు సైతం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక వైఎస్ అనంతరం కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత పేరును పథకాలకు పెట్టే ప్రయత్నం చేశారు. యువకిరణాలు పేరుతో తన పేరు కూడా సరిపోయేలా ఆయన పథకాలు ప్లాన్ చేశారు. ఇక 2014 ఎన్నికల్లో గెలిచి నవ్యాంధ్రకు తొలి సీఎం అయిన చంద్రబాబు మొత్తం ప్ర‌భుత్వ ప‌థ‌కాల పేర్లు మార్చారు. వైయస్ హయాంలో ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు. ఇక అనేక సంక్షేమ పథకాలకు చంద్రన్న అనే ట్యాగ్ లైన్‌ ఉండేలా చేశారు. ఇప్పుడు చంద్రబాబు పదవి కోల్పోయారు.

ఏపీ కొత్త సీఎంగా వైఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో సహజంగానే గత ముఖ్యమంత్రుల రూటు ఫాలో అవుతూ జగన్ ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ పథకాల పేర్లు మార్చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి వైఎస్ఆర్ పెన్ష‌న్ అన్న పేరు పెట్టేశారు. ఇక మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్ఆర్ అక్షయ పాత్ర పేరు ఖరారు చేశారు. ఇప్పటికే చాలా చోట్ల ఎన్టీఆర్ అన్న క్యాంటిన్లు పేరు ప్రభుత్వం మార్చ‌క‌పోయినా స్థానిక వైసీపీ నేతలు రాజన్న అన్న క్యాంటిన్లుగా మార్చేస్తున్నారు. ఎన్టీఆర్ గతంలో ఉన్న పసుపు రంగును కూడా మార్చేసి వైసిపి రంగులు వేస్తారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ఆర్ పేరు పెట్టాలని వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్ర ప్రభుత్వ నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా వైఎస్ జగన్ పాలనలో ఏపీలో మరికొన్ని పథకాల పేర్లు మారిపోనున్నాయి.

ఏపీలో పేర్లు, రంగులు మారిపోతున్నాయ్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts