మంగ‌ళ‌గిరిలో బీజేపీ సీక్రెట్ మీటింగ్‌!

July 1, 2019 at 3:35 pm

వచ్చే మూడేళ్ల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోను తిరుగులేని శక్తిగా బలపడాలని భావిస్తున్న బిజెపి తెలంగాణలో ఇప్పటికే తన ఆపరేషన్ ప్రారంభించేసింది. 2023 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ జాతీయ‌ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఇప్పుడు బీజేపీ కన్ను ఆంధ్రప్రదేశ్ పై పడింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కేడర్‌ను పూర్తిగా తమవైపునకు తిప్పుకుని వచ్చే రెండు మూడేళ్లలో ఏపీలో క్షేత్ర‌ స్థాయిలో బలపడాలని ఆపరేషన్ ప్రారంభించేసింది.

ఈ క్రమంలోనే టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. తాజాగా రెండు రోజుల పాటు గుంటూరు జిల్లా మంగళగిరి హాయిలాండ్ లో బీజేపీ కీలక నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. ఆదివారం ప్రారంభ‌మైన ఈ స‌మావేశం సోమ‌వారం కూడా జ‌ర‌గ‌నుంది. ఈ సమావేశంలో టీడీపీ నుంచి 75 మంది కీలక నేతలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంకేతాలు ఇస్తున్నారు.

ఎలాంటి వివాదాలు, క్రిమినల్ కేసులు లేని రాజకీయ నేతలను పార్టీలో చేర్చుకోవాలని కమలదళం యోచిస్తోంది. ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సంఘ‌ట‌న ప‌ర్వ్‌ పేరుతో బీజేపీ స‌భ్య‌త్వ న‌మోదుకు శ్రీ‌కారం చుట్టింది. టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులే కాకుండా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని కాషాయ వర్గం టిడిపి గుండెల్లో రైళ్లు పరిగెత్తే ప్రకటనలు చేస్తోంది.

బిజెపికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి త్వరలోనే ఏపీ అసెంబ్లీ లో బీజేపీ శాసనసభాపక్ష నేత‌ను చూస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక టీడీపీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతల్లో సుమారు 20 మందికిపైగా బిజెపి వైపు చూస్తున్నార‌ట‌. అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి ఇప్ప‌టికే బీజేపీలో చేరిపోయారు. ఈ క్ర‌మంలోనే గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రితో పాటు మ‌రో మాజీ ఎమ్మెల్యే, తూర్పుగోదావ‌రికి చెందిన ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు, ప్ర‌కాశం జిల్లాకు చెందిన మ‌రో నేత సైతం ఇప్పుడు బీజేపీ బాట‌లోనే ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అలాగే చంద్ర‌బాబు అత్యంత స‌న్నిహితుడుగా ఉంటే నెల్లూరు జిల్లాకు చెందిన మ‌రో మాజీ మంత్రి పాటు సీమ జిల్లాల‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ ఫ్యామిలీలు కూడా బీజేపీలో చేరే ఆలోచ‌న‌లో ఉన్నాయ‌ట‌. ఏదేమైన ఏపీలో పార్టీ బ‌ల‌ప‌డాలంటే ఇప్పుడున్న ప‌రిస్థితులే స‌రైన‌వ‌ని భావిస్తున్న బీజేపీ అధిష్టానం చాప కింద నీరులా గ్రౌండ్ వ‌ర్క్ స్టాట్ చేసింది. ఈ ప‌రిణామాలు వ‌చ్చే రెండు మూడు సంవ‌త్స‌రాల్లో ఎటు వైపు దారి తీస్తాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంది.

మంగ‌ళ‌గిరిలో బీజేపీ సీక్రెట్ మీటింగ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts