“కాపు” కాయ‌లేదు.. డైల‌మాలో చంద్ర‌బాబు…!

July 11, 2019 at 3:22 pm

రాష్ట్రంలో కీల‌క‌మైన సామాజిక వ‌ర్గం కాపులు. రాజ‌కీయంగా నాలుగు జిల్లాల‌ను ప్ర‌భావితం చేయ‌డంలో ముందున్నారు. దీంతో గ‌త అధికార పార్టీ నాయ‌కుడు, టీడీపీఅదినేత చంద్ర‌బాబు వీరికి ఎన్నో విధాల మేలు చేశారు. ఆ సామాజిక వ‌ర్గం ఊహించ‌ని రీతిలో కార్పొరేష‌న్ ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో వారికి సాయం చేశారు. ప‌లు కీల‌క ప‌ద‌వులు కూడా ఇచ్చారు. దీంతో కాపులు త‌న‌కు, పార్టీకి మేలు చేస్తార‌ని చంద్ర‌బాబు భావించారు. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో వారు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి.. పార్టీని అధికారంలోకి వ‌చ్చేలా చేస్తార‌ని బాబు అనుకున్నారు. అయితే, బాబు ఊహించిన దానికి కాపులు అనుకుంటున్న దానికీ ఎక్క‌డా పొంత‌న కుద‌ర‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కాపుల‌కు మనం ఎంతో చేశాం. అయినా ఆ వ‌ర్గం మ‌న‌కు ఎందుకు దూర‌మైంది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నా యుడు ఇటీవ‌ల నిర్వహించిన స‌మీక్షలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో అస‌లు కాపులు పార్టీని ఎందుకు ఒంట‌రిని చేశార‌నే చ‌ర్చ కూడా న‌డిచింది. తాజాగా జ‌గ‌న్‌కు కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం రాసిన లేఖతో గ‌త ఎన్నిక‌ల్లో కాపులు టీడీపీకి బ‌లంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌ని విష‌యం అర్ధ‌మైంది. అదేస‌మ‌యంలో కాపు సామాజిక వ‌ర్గానికే చెందిన పార్టీ జ‌న‌సేన‌కు కూడా కాపులు మ‌ద్ద‌తివ్వ‌లేదని తెలిసింది. మ‌రి ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో కాపులు టీడీపీతోనే ఉంటారా? లేక పార్టీలు మార్చుకుంటారా? వ‌్యూహాలు మార్చుకుంటారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఇక‌, టీడీపీ వాద‌న ఎలా ఉన్నా.. కాపుల్లో మాత్రం చంద్ర‌బాబుపై పెద్ద‌గా ఇంప్ర‌ష‌న్ లేకుండా పోయింది. బాబు త‌మ‌కు అన్యాయం చేశార‌ని, త‌మకు స్వాతంత్య్రం లేకుండా వ్యవ‌హ‌రించార‌ని, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ త‌మ వాయిస్‌ను వినిపించే అవ‌కాశం లేకుండా చేశార‌ని భావిస్తోంది. ఈ ప‌రిణామాల‌కు తోడు తాను 2014లో ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ హామీని చంద్ర‌బాబు ప‌క్క‌దారి ప‌ట్టించార‌నే వ్యాఖ్య‌లు కూడా కాపు ల నుంచి వినిపిస్తున్నాయి. పార్టీ త‌ర‌ఫు గ‌ట్టి వాయిస్ వినిపించిన బొండా ఉమాకు మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌క‌పోవ‌డంపైనా ఆ వర్గం ఒకింత ఆగ్ర‌హంతోనే ఉంది ఇక‌, ఈ నేప‌థ్యంలో కాపుల్లో ఏర్ప‌డిన అసంతృప్తిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది.

ఇప్ప‌టికే ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు కూడా ప్రారంభించింది. టీడీపీలో అసంతృప్తితో ర‌గిలి పోతున్న కాపుల‌ను త‌న పార్టీలో చేర్చుకునేందుకు ప‌క్కాగా పావులు క‌దుపుతోంది.దీంతో ఇక‌, కాపులు టీడీపీకి బై చెబుతార‌నే వ్యాఖ్య‌లు రాష్ట్రంలో బ‌లంగానే వినిపిస్తున్నాయి. బాబు మా పై అనుస‌రించే వైఖ‌రిని బ‌ట్టి మేం మా దారి ఏమిట‌నేది స్ప‌ష్టం చేస్తామంటూ.. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన వ్యాఖ్య‌లు ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావ‌నార్హం. మొత్తానికి ఇప్పుడు టీడీపీలో త‌మ‌కు క‌మ్మ‌ల క‌న్నా ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరుకోవ‌డం కాపు నేత‌ల వ్యాఖ్య‌ల్లో బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి. ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు అధికారంలోకి వ‌స్తార‌నే బ‌ల‌మైన న‌మ్మ‌కం కుదిరితే త‌ప్ప‌.. కాపులు ఇక‌, టీడీపీలో ఎంత‌మాత్రం ఉండ‌ర‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.

“కాపు” కాయ‌లేదు.. డైల‌మాలో చంద్ర‌బాబు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts