బాబు ఒప్పేంటి? జ‌గ‌న్ త‌ప్పేంటి?

July 24, 2019 at 10:44 am

ఏపీలో ఏర్ప‌డిన వైసీపీ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో గ‌డిచిన 50 రోజుల్లో రెండో సారి నిర్వ‌హిస్తున్న అసెంబ్లీ స‌మావేశాలు చాలా వాడి వేడిగా సాగుతున్న విష‌యం తెలిసిందే. సంఖ్యా బ‌లం త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ. ప్ర‌తిప‌క్షం టీడీపీకి మాట్లాడే ఛాన్స్ త‌ప్ప‌కుండా ఇస్తామ‌ని తొలిరోజే స్ప‌ష్టం చేసిన వైసీపీ అధినేత, స‌భానాయ‌కుడు జ‌గ‌న్‌.. అనుకున్న విధంగానే టీడీపీ గ‌ళం వినిపించేందుకు ఆ పార్టీ నాయ‌కుల‌కు బాగానే ఛాన్స్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు త‌మ గ‌ళాన్ని బాగానే వినిపిస్తున్నాయి.

అయితే, రోజుకో వివాదంతో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని భావిస్తున్న టీడీపీకి వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వుతోంది. ప్ర‌తి విష‌యాన్ని రాజకీయం చేస్తున్నార‌ని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయా విష‌యాల‌కు సంబంధించి విజువ‌ల్‌గా కూడా అసెంబ్లీలో ప్ర‌ద‌ర్శించి క్లారిటీ ఇస్తున్నారు. ఇక‌, తాజాగా మంగ‌ళ‌వారం నాటి స‌భ‌లో జ‌రిగిన దుమారం.. ఈ క్ర‌మంలో అధికార పార్టీ స‌భ్యుల సూచ‌న‌ల మేర‌కు డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల‌పై వేటు వేశారు. ఇది రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపింది. రెండో స‌భ‌లోనే ఇలా ఏకంగా ఒకేసారి ముగ్గురిపై వేటు వేయ‌డం స‌రికాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌ధానంగా టీడీపీ ప‌క్ష నాయ‌కుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు క‌థ‌నం మేర‌కు ఎలాంటి గ‌లాటా చేయ‌ని మాజీ మంత్రి, టీడీపీ ప‌క్ష‌ ఉప‌నాయ‌కుడు కింజ‌రాపు అచ్చ‌న్నాయుడును కూడా స‌స్పెండ్ చేయ‌డంపై టీడీపీ శ్రేణులు ఒకింత విస్తుపోయాయి. అయితే, ఆది నుంచి ఈ రోజు జ‌రిగిన కార్య‌క్ర‌మాల‌ను గ‌మ‌నించిన వారు చెబుతున్న దాని ప్ర‌కారం.. ప్ర‌తిప‌క్షం వైపునే త‌ప్పు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. 2017లో అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్ ఓ కార్య‌క్ర‌మంలో.. మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లోని మ‌హిళ‌ల‌కు 45 ఏళ్లు నిండితే.. పింఛ‌న్లు ఇస్తామ‌న్నారు.

అప్ప‌ట్లో ఆ వార్త జ‌గ‌న్ మీడియాలో ప్ర‌ముఖంగానే వ‌చ్చింది. వాస్త‌వానికి ఆయ‌న ఒక్క మీడియాలోనే కాకుండా అప్ప‌ట్లో ప్ర‌భుత్వ అనుకూల మీడియాలో కూడా జ‌గ‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌ముఖంగానే వ‌చ్చాయి. క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే వార్త‌ల క్లిప్పింగుల‌ను స‌భ‌లోకి తెచ్చిన టీడీపీ స‌భ్యుడు నిమ్మ‌ల రామానాయుడు ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో దీనిని లేవ‌నెత్తారు. అయితే, ఇది అప్ప‌ట్లో కేవ‌లం ప్ర‌క‌ట‌న మాత్ర‌మేన‌ని, కానీ, ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌చ్చే స‌రికి త‌మ పంథామార్చుకున్నామ‌ని దీనిపై వైసీపీ త‌ర‌ఫున స‌మాధానం వ‌చ్చింది.

తాము 45 ఏళ్ల‌కే మ‌హిళ‌ల‌కు పింఛ‌ను ఇస్తామంటే.. అప్ప‌టి అధికార ప‌క్షం టీడీపీ నుంచి వ్యంగ్యాస్త్రాలు వ‌చ్చాయ‌ని, దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాత 2017 చివ‌రిలో పాద‌యాత్ర ప్రారంభించిన త‌ర్వాత ఓ క్లారిటీ తెచ్చుకున్నామ‌ని, త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌.. రెండేళ్ల లోనే వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కం కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కులాల్లోని మ‌హిళ‌ల‌కు మొత్తం 75 వేల రూపాయ‌ల‌ను నాలుగు విడ‌త‌ల్లో అందిస్తామ‌ని చెప్పామ‌ని, దీనినే మేనిఫెస్టోల‌నూ పెట్టామ‌ని ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చింది.

అయితే, దీనిపై ఎంత‌కీ టీడీపీ నేత‌లు వినిపించుకోక‌పోవ‌డంతో సాక్షాత్తూ సీఎం జ‌గ‌న్ రంగంలోకిదిగి .. తాను పాద‌యాత్ర స‌మ‌యంలో ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో చేసిన ప్రసంగం వీడియోను స‌భ‌లో డిప్యూటీ స్పీక‌ర్ అనుమ‌తి తీసుకుని రెండు సార్లు ప్ర‌సారం చేశారు. దీనిలోనూ స్ప‌ష్ట‌త ఉంది. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ నాయ‌కులు మీరు ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు పింఛ‌న్లు ఇస్తామ‌న్నారు ఇస్తారా? ఇవ్వ‌రా? చెప్పాల‌నే డిమాండ్‌తో స‌భ‌ను స్తంభింప జేసేందుకు చేసిన ప్ర‌య‌త్నంలోనే ముగ్గురిపై వేటు వేశారు. ఇదిలావుంటే, త‌ర్వాత జోక్యం చేసుకున్న చంద్ర‌బాబు కూడా నాటి పేప‌ర్ క్లిప్పుంగునే ఆయ‌నా ప‌ట్టుకుని జ‌గ‌న్ మాట త‌ప్పారంటూ యాగీ చేశారు.

ఇప్పుడు అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. నిత్యం రాజ‌కీయాల్లో అనేక మంది నాయ‌కులు అనేక వ్యాఖ్య‌లు చేస్తుంటారు. ఇవ‌న్నీ పేప‌ర్ల‌లో వ‌స్తుంటాయి. వాటినే ప‌ట్టుకుని యాగీ చేయ‌డం సీనియ‌ర్ నాయకుడైన చంద్ర‌బాబుకు త‌గునా? అనేది ప్ర‌శ్న‌. మేనిఫెస్టోలో ఏదైనా చెప్పి.. చేయ‌క‌పోతే.. ఖ‌చ్చితంగా ప్ర‌శ్నించే హ‌క్కు ప్ర‌తిప‌క్షానికి ఉంది. కానీ,దీనిని వ‌దిలేసిన చంద్ర‌బాబు పేప‌ర్ క్లిప్పింగుల‌నే ప‌ట్టుకుని వేలాడ‌డంతో అభాసు పాల‌య్యార‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

బాబు ఒప్పేంటి? జ‌గ‌న్ త‌ప్పేంటి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts