న్యూజిలాండ్ ఓటమితో ప్ర‌పంచ క్రికెట్లో కొత్త రూల్

July 17, 2019 at 6:51 pm

ప్రపంచ కప్ క్రికెట్ ఎప్పటికప్పుడు సరి కొత్త నిబంధనలతో ముందుకు దూసుకువెళుతోంది. అయితే కొన్ని నిబంధనలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. తాజా ప్రపంచ కప్ టోర్నమెంట్ ఫైనల్లో బౌండరీల‌ ఆధారంగా ఇంగ్లాండ్‌ను ప్రపంచ విజేతగా నిర్ణయించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రపంచ కప్ క్రికెట్‌లో సరి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఈ నెల చివరి వారంలో లండన్‌లో జరిగే ఏఐసిసి సమావేశంలో ఈ నిబంధనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

గత రెండేళ్లుగా పెండింగ్‌లో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. 2014లో ఫిలిప్ హ్యూస్ మరణాంతరం ఐసీసీ ముందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇప్ప‌టికే కొన్ని చోట్ల దేశ‌వాళీ టోర్న‌మెంటుల‌లో దీనికి ఐసీసీ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘టెస్టు చాంపియన్‌ షిప్‌’లో ఈ విధానానికి అనుమతినివ్వాలని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే ప్ర‌తిష్టాత్మ‌క యాషెన్ సీరిస్‌లో దీనిని ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేయాల‌ని భావిస్తోంది.

కాంక‌ష‌న్ స‌బ్‌స్టిట్యూట్ అంటే…
మైదానంలో ఏ ఆట‌గాడు అయినా తీవ్రంగా గాయ‌ప‌డితే ప్రస్తుత నిబంధనల ప్రకారం సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడికి కేవలం ఫీల్డింగ్‌ చేసేందుకు అనుమతి ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసేందుకు అంగీకరించరు.  అయితే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్రకారం మరొక ఆటగాడిని జట్టులోకి అనుమతినిస్తారు. అత‌డు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. తాజా ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ వేసిన బంతి దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా తలకు బలంగా తగిలిన సంగతి తెలిసిందే. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

న్యూజిలాండ్ ఓటమితో ప్ర‌పంచ క్రికెట్లో కొత్త రూల్
0 votes, 0.00 avg. rating (0% score)