మాస్ మ‌సాలా.. క్రైం థ్రిల్ల‌ర్‌ “ఇస్మార్ట్ శంక‌ర్‌” రివ్యూ

July 18, 2019 at 10:24 am

మాస్ మ‌సాలా… క్రైం థ్రిల్ల‌ర్‌… ఇస్మార్ట్ శంక‌ర్‌…!

సినిమా పేరు ః ఇస్మార్ట్ శంక‌ర్‌

న‌టులు   ః రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌, షియాజీ షిండే, ఆశీష్ విద్యార్థి, స‌త్య‌దేశ్‌, గంగ‌వ్వ‌.

బ్యాన‌ర్ ః పూరి సినిమాస్‌

ద‌ర్శ‌కుడు ః పూరి జ‌గ‌న్నాథ్‌

నిర్మాత‌లు  ః ఛార్మీ, పూరి జ‌గ‌న్నాథ్‌

సంగీతం ః మ‌ణిశ‌ర్మ‌
 
విడుద‌ల తేది ః 18 జూలై 2019.

రామ్ పోతినేని న‌టించిన ఈ సినిమా ఇప్పుడు రామ్ కేరీర్‌కు ఎంతో కీలకం. ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌, నిర్మాత ఛార్మీ, న‌టీమ‌ణులు నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ల‌కు ఈ సినిమా ఇప్పుడు ఎంతో అవ‌స‌రం. వీరి కేరీర్‌కు ఈ సినిమా ఓమైలురాయిగా నిలిచిపోయే సినిమా అంద‌రు భావిస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంది. ఎవ‌రి పాత్ర‌లకు ఎవ‌రెంత న్యాయం చేశారు. ఇంత‌కు సినిమా జ‌నాల‌కు క‌నెక్ట్ అయిందా లేదా అని ఒక్క‌సారి తెలుగు జ‌ర్న‌లిస్టు స‌మీక్ష‌లో లుక్కేద్దాం.

క‌థ మ‌రియు క‌థ‌నం.

ఓ హీరో జైలుకు వెళ్ళ‌డం, సీబీఐ వెంట ప‌డ‌టం అనేక సినిమాలో జ‌రుగుతున్న తంతే. ఇక తెలంగాణ యాస‌, భాష‌ను ఇటీవ‌ల అనేక సినిమాల్లో వాడుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ యాస‌, భాష ఉన్న సినిమాలు ఓ ట్రెండ్‌గా మారాయి. ఫిదాతో తెలంగాణ ప్రాంతంకు ఇప్పుడు పెద్ద పీట వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో  అంతా తెలంగాణ వాతావ‌ర‌ణ‌మే. పాత‌బ‌స్తీలోని చార్మీనార్‌లో తిరిగే ఓ పోర‌గాడు ఎందుకు జైలుకు వెళ్ళాడు. త‌రువాత ఆ పోర‌డి  వెంట సీబీఐ ఎందుకు వెంట‌ప‌డింది. అస‌లు రామ్ త‌ల‌లోకి సిమ్ కార్డు ను ఎవ‌రు పెట్టారు. ఎందుకు పెట్టారు అనేది ఈ సినిమా పాయింట్‌. ఈ పాయింట్ ఆధారంగానే సినిమా ముందుకు సాగుతుంది. 

న‌ట‌నెలా ఉంది…

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో హీరోగా రామ్ పోతినేని న‌ట‌న ఊర‌మాస్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన రామ్‌కు ఇప్పుడు ఇస్మార్ట్‌లో చూసే రామ్‌కు ఎక్క‌డ పొంత‌న‌లేదు. తెలంగాణ పోర‌గాడిపాత్ర‌లో రామ్ ఒదిగిపోయాడు. పాత‌బ‌స్తీలో చిల్ల‌ర‌మ‌ల్ల‌ర‌గా తిరిగే ఓ యువ‌కుడుగా రామ్ పోషించిన పాత్ర అత్య‌ద్భుతంగా ఉంది. ఇక మాట్లాడిన యాస, భాషను వాడిన తీరు, అందులో భూతుప‌దాలు క‌లిపిన తీరు ఎబ్బెట్టుగా ఉన్న‌ప్ప‌టికి మొత్తానికి తెలంగాణ భాష‌కు, యాస‌కు జీవం పోశారు. ఇక రామ్ హీరోయిన్లు నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ల‌తో ఆడిపాడిన తీరు, రోమాన్స్ యువ‌త‌కు క‌నెక్ట్ అవుతుంది. కానీ రోమాన్స్ పేరుతో విచ్చ‌ల‌విడిగా చేసిన శృంగారం శృతిమించింద‌నే చెప్పొచ్చు. ఇక మిగ‌తా పాత్ర‌ల్లో న‌టించిన న‌టులు త‌మ పాత్ర‌కు త‌గ్గ న్యాయం చేశారు.

తెర‌వెనుక

ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథ్ చాలా కాలం త‌రువాత త‌న మార్క్‌ను చూపాడు. సినిమా మొద‌టి నుంచి చివ‌రిదాకా రోమాన్స్‌ను, క్రైంను, ఊర‌మాస్ ప‌దాల‌ను, న‌ట‌న‌ను, మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌చ్చే హ‌స్య‌పు స‌న్నివేశాల‌ను త‌న‌దైన శైలీలో తెర‌కెక్కించాడు. చాలా కాలం త‌రువాత పూరి జ‌గ‌న్నాథ్ కేరీర్ ప్ల‌స్ సినిమాను రూపొందించుకోగ‌లిగాడు. ఇక నిర్మాణ‌ రంగంలో ఛార్మీకి ఓ స‌క్సెస్ అందించాడు పూరి. ఇక సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ అందించిన స్వ‌రాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ ప్రాణం పోశాడు. బోనాల జాత‌ర సంద‌ర్భంగా అందించిన సంగీతం క‌ల‌కాలం గుర్తుండేలా రూపొందించాడు. ఇక మిగ‌తా టెక్నిషియ‌న్స్ త‌న ప‌రిధిమేర‌కు ప‌నిని పూర్తి చేశారు. మొత్తానికి పూరి జ‌గ‌న్నాథ్ టీమ్ నాయ‌కుడుగా అటు న‌టీనటుల‌ను, ఇటు టెక్నిషియ‌న్స్‌ను త‌న ప‌రిధి మేర‌కు ఉప‌యోగించుకుని సినిమా విజ‌య‌వంతానికి త‌న‌దైన ముద్ర వేసాడ‌నే చెప్పొచ్చు.

చివ‌రిగా…

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా ఇటు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణంను, బోనాల జాత‌రను బాగా ఎలివేట్ చేశారు. ఇప్పుడు బోనాల సీజ‌న్ కావ‌డంతో సినిమాకు ఇది ప్ల‌స్‌పాయింట్ అయ్యే అవ‌కాశం ఉంది. ఇక వ‌రంగ‌ల్ గురించి సినిమాలో ప్ర‌స్తావించి కొంత వ‌రంగ‌ల్‌తో సినిమాను ముడిపెట్టి అక్క‌డి జ‌నాల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. న‌టీన‌టుల రోమాన్స్ దృశ్యాల‌తో యువ‌త‌కు క‌నెక్ట్ కాగ‌లిగారు. ఇక హీరోహీరోయిన్ల రోమాన్స్ స‌న్నివేశాలు, పాట‌లు కూడా జ‌నాల‌కు ఆక‌ట్టుకునేలా రూపొందించారు. హాస్యం కూడా ప‌ర్వాలేద‌న‌పించింది. ఫైట్ల సీన్ల‌తో థియోట‌ర్ల‌లో మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమా మొత్తానికి ఓ క్రైంథ్రిల్ల‌ర్‌ను త‌ల‌పించింది. ఈ సినిమాకు మైన‌స్ అంటే అతి శృంగార దృశ్యాలు, వ‌ల్గ‌ర్ ప‌దాల‌ను ఎక్కువ మొత్తంలో వాడ‌టం, శృతిమించిన రోమాన్స్ అని చెప్పొచ్చు.

రేటింగ్ః  తెలుగు జ‌ర్న‌లిస్టు రేటింగ్ 3.0/5

 
మాస్ మ‌సాలా.. క్రైం థ్రిల్ల‌ర్‌ “ఇస్మార్ట్ శంక‌ర్‌” రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts