“ఓ బేబీ” రివ్యూ&రేటింగ్

July 5, 2019 at 10:59 am

రోటీన్‌కు భిన్నంగా వచ్చే సినిమాల‌కు ఎప్పుడూ ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. అందులో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతారు. ఈక్ర‌మంలోనే సౌత్ కొరియ‌న్‌సినిమా ఆధారంగా ద‌ర్శ‌కురాలు నందినిరెడ్డి ఓ.. బేబీ పేరుతో ప్ర‌యోగం చేశారు. ఇందులో టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత న‌టించారు. ఓ 70ఏళ్ల భామ‌.. 25ఏళ్ల అమ్మాయిగా మారితే.. ఎలా ఉంటుంది..? ఏం జ‌రిగింద‌న్నదే.. ఈ సినిమా క‌థ‌. అయితే.. ఈ చిత్రం షూగింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచే అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఓ.. బేబీ ఏమేర‌కు ప్రేక్ష‌కుల‌కు మెప్పించిందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..

క‌థేమిటంటే…
ఈ సినిమాలో క‌థ‌.. దాని గ‌మ‌నం.. ఈ రెండు అంశాలే అత్యంత కీల‌కం. బేబీ(లక్ష్మి) తన యుక్త వయసులోనే భర్తను కోల్పోయి తన పిల్లలు, మనవళ్లతో జీవనం సాగిస్తుంది. ఆమెలో ఎన‌క‌టి చాద‌స్తం, అతిప్రేమ‌తో అనుకోని ప‌రిణామాలు ఎదుర‌వుతాయి. దీంతో ఆమెకు పిల్ల‌ల‌కు మ‌ధ్య పొర‌పొచ్చాలు వ‌స్తాయి. దీంతో ఆమెను ఓ వృద్ధాశ్ర‌మంలో చేర్పిస్తారు. ఇక్క‌డే క‌థ‌లో కీల‌క మ‌లుపు ఉంటుంది. బేబీ.. తాను యుక్త వ‌య‌స్సులో కోల్పోయిన జీవితాన్ని పొందాల‌ని క‌ల‌లు కంటుంది. ఆ క‌ల‌ల్ని నిజం చేసుకునేందుకు బేబీగా మారుతుంది. ఇక ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది..? ఆమె త‌న క‌ల‌ల్ని నిజం చేసుకుందా..? లేదా..? అనేది తెలుసుకోవాలంటే మాత్రం తెర‌పైనే చూడాలి మ‌రి.

ఎలా ఉందంటే..
కామెడీ, ఎమోష‌న్ క‌ల‌బోత‌గా వ‌చ్చే సినిమాల‌కు ఎప్పుడు కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్పుడు నందినిరెడ్డి కూడా ఓ..బేబీతో మ‌రోసారి ఈ విష‌యాన్ని రుజువు చేశారు. నిజానికి.. ఈ సినిమాలో స‌మంత‌ను ఎంపిక చేసుకోవ‌డ‌మే ద‌ర్శ‌కురాలి మొద‌టి విజ‌యంగా చెప్పుకోవ‌చ్చు. క‌థా గ‌మ‌నంలో ఎక్క‌డ కూడా త‌డ‌బాటు క‌నిపించ‌దు. సాగ‌దీత‌.. బోరింగ్‌.. ఎక్క‌డా అనిపించ‌దు. అటు హాస్య స‌న్నివేశాలు.. ఇటు భావోద్వేగ బంధాలు.. ఇలా అన్నింటి క‌ల‌బోత‌గా చ‌క్క‌గా నడిపించారు నందినిరెడ్డి.

ఎవ‌రెలా చేశారంటే..
ఈ సినిమాను స‌మంత లేకుండా ఊహించుకోవ‌డం క‌ష్ట‌మే. అంత‌లా ఒదిగిపోయారు ఆమె. బేబీ పాత్ర‌లో స‌మంత న‌ట‌న‌కు అంద‌రూ హ్యాట్స‌ప్ చెప్పాల్సిందే మ‌రి. ఎమోష‌న‌ల్ సీన్స్‌, కామెడీ సీన్స్‌ను ఆమె అల‌వోక‌గా చేసేశారు. అలాగే.. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, రావు రమేష్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక‌ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అడవి శేష్ పాత్ర ఆక‌ట్టుకుంటుంది. మరో ప్రధాన పాత్రలో నటించిన నాగశౌర్య కూడా తన పాత్రకు న్యాయం చేశారు. మిక్కీజే మేయ‌ర్ అందించిన సంగీతం సినిమాకు అద‌న‌పు బ‌లం. సురేష్ ప్రొడక్షన్స్ వారికి గుర్తుండిపోయే సినిమా ఇది. ఇక‌ రిచర్డ్ ప్రసాద్ కెమెరా పనితనం సూప‌ర్బ్ అని చెప్పొచ్చు.

చివ‌రికి.. అల‌రించిన‌ ఓ.. బేబీ

TJ ఓ బేబీ రేటింగ్‌: 3 / 5

“ఓ బేబీ” రివ్యూ&రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts