
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన ఆధ్వర్యంలో జనసేన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. ఈమేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పేరున ప్రకటన విడుదల చేశారు. జనసేన నేతృత్వంలోనే ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయడం ఓ విశేషం అనే చొప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ జనసేన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటన, దర్శకత్వం, ఇతర విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారని అందులో పేర్కోన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పనున్నారు. పవన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండనున్న నేపధ్యంలో ఏపీలోనే ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తే నిత్యం అక్కడే ఉండి రాజకీయాలు చేయవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.
చిత్రసీమకు పద్మశ్రీ అల్లు రామలింగయ్య, దర్శకరత్న డా.దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ వంటి మహామహులైన దర్శక నిర్మాతలు, నటులను అందించిన ఘన చరిత్ర ఉన్న ప్రాంతం పాలకొల్లు. పవన్ స్థాపించే ఇనిస్టిట్యూట్‌కు చైర్మన్‌గా హరిరామజోగయ్య, రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించనుండగా, బన్ని వాసు కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. ఇక ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కు తెలుగు చిత్రసీమకే తలమానికమైన స్వర్గీయ ఎస్వీ రంగారావు పేరును నిర్ధారించారు. త్వరలో శిక్షణ ఇచ్చెందుకు సిద్ధం చేస్తుండగా, ఫ్యాకల్టీ నియామకం చేపట్టనున్నారు. పవన్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానున్నది.