గుంటూరు టీడీపీలో కీలక వికెట్లు ప‌డుతున్నాయ్‌…!

July 20, 2019 at 4:35 pm

ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీకి వరుసపెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు కూడా కాకుండానే పలువురు కీలక నేతలు బీజేపీ లోకి జంప్ చేసేస్తున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు…. తాజా ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు బిజెపి గూటికి చేరిపోయారు. విశేషం ఏంటంటే బిజెపికి అసలేమాత్రం నాయకులు లేని రాయలసీమ జిల్లాల నుంచి కూడా టిడిపికి చెందిన కీలక నేతలు బిజెపిలోకి వెళ్ళిపోతారు. ఇక ఇప్పుడు బిజెపి టార్గెట్ రాజధాని జిల్లాలు అయిన కృష్ణ, గుంటూరుపై ఉంది.

ఈ రెండు జిల్లాల్లో బలోపేతం అయ్యేందుకు టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలను టార్గెట్ చేస్తోంది.ఈ క్రమంలోనే టిడిపికి చెందిన సీనియర్ నేత… సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధ‌వ్‌ ఇప్పటికే రాయ‌పాటి ఇంటికి వెళ్లి మంతనాలు కూడా జరిపారు. రాయపాటి సైతం తనకున్న ఇబ్బందుల దృష్ట్యా బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఐదు దశాబ్దాల రాజకీయ అనుబంధం ఉన్న ఆయ‌న‌కు జిల్లాలో ఎంతో మంది శిష్యులు ఉన్నారు. ఈ క్రమంలోనే రాయపాటి తనతో పాటు తన శిష్యుల్లో చాలా మందిని కూడా బిజెపిలోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా టిడిపిలో రాయపాటి మాత్రమే కాకుండా పలువురు కీలక నేతలు సైతం బిజెపి రూట్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు మరో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్… పల్నాడులో వరుస విజయాలు సాధిస్తున్న ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు సైతం బిజెపిలోకి వెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది.

వీరిలో చాలా మందికి లోకేష్ నాయ‌క‌త్వం మీద న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మే పార్టీ మారాల‌న్న ఆలోచ‌న‌కు ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. ఒక‌రిద్ద‌రు మాత్రం త‌మ వ్యాపారాల‌ను కాపాడుకునే క్ర‌మంలో పార్టీ మారాల‌ని చూస్తుంటే… మ‌రో మాజీ ఎమ్మెల్యే మాత్రం త‌న‌పై ఉన్న అవినీతి, ఆరోప‌ణ‌ల నుంచి కాపాడుకునేందుకే క‌మ‌లం వైపు చూస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే బాప‌ట్ల తాజా మాజీ ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్‌తో పాటు చందు సాంబ‌శివ‌రావు త‌దిత‌ర నేత‌లంతా పార్టీ మారిపోయిన సంగ‌తి విదిత‌మే. వ‌చ్చే ఒక‌టి రెండు నెల‌ల్లో జిల్లాలో చాలా మంది కీల‌క నేత‌లు టీడీపీకి బైబై చెప్పేయ‌నున్నారు.

గుంటూరు టీడీపీలో కీలక వికెట్లు ప‌డుతున్నాయ్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts