తెలంగాణ‌లో ఇంజినీరింగ్ విద్య ఢ‌మాల్‌..!

July 11, 2019 at 12:17 pm

రోజురోజుకూ ఇంజినీరింగ్ విద్య‌కు ఆద‌ర‌ణ త‌గ్గుతోందా..? ఈ కోర్సుల్లో జాయిన్ అయ్యేందుకు విద్యార్థులు ఆస‌క్తిచూప‌డం లేదా..? ఇంజినీరింగ్ విద్య‌ను పూర్తి చేసిన త‌ర్వాత ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మా..? క‌న్వీన‌ర్ కోటా సీట్లు కూడా భ‌ర్తీ కాక‌పోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మా..? అంటే తాజా ప‌రిస్థితులు మాత్రం ఔన‌నే అంటున్నాయి. ఇటీవ‌లే తెలంగాణ‌లో నిర్వ‌హించిన ఎంసెట్‌లో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎంసెట్లో సీట్ల కేటాయింపున‌కు వెబ్ ఆప్ష‌న్లు ప్రారంభ‌మ‌య్యాయి.

కానీ.. ఈసారి ఎంసెట్‌లో అర్హ‌త సాధించిన విద్యార్థుల్లో కొన్నివేల మంది వెబ్ ఆప్ష‌న్లు ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో కన్వీనర్ కోటాలో కూడా పెద్ద ఎత్తున సీట్లు మిగిలిపోయే పరిస్థితి క‌నిపిస్తోంది. నిజానికి గత మూడేళ్లుగా ఇంజినీరింగ్ విద్యలో ఇదే ద‌య‌నీయ ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ సారి లక్షా ఎనిమిదివేల మంది విద్యార్దులు ఇంజీనిరింగ్ కాలేజీలలో చేరడానికి ఎంసెట్లో క్వాలిఫై అయ్యారు. కానీ సుమారు 54వేల మంది మాత్రమే వెబ్‌ ఆప్షన్లకు తమ పేర్లను నమోదు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి.. కన్వీనర్ కోటా కింద 64709 సీట్లు ఉన్నాయి. ఈ లెక్క‌న క‌న్వీన‌ర్ కూడా భ‌ర్తీ అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అంటే.. సుమారు పదివేల సీట్లు ఈ కోటాలోనే మిగిలిపోయే ప‌రిస్థితి ఉంది. ఇక మేనేజ్‌మెంట్ కోటాకు వెళ్లే అవ‌కాశ‌మే ఉండ‌ద‌న‌న‌మాట‌. ఇక ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రాష్ట్రంలో చాలా వ‌ర‌కు ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు మూత‌ప‌డే ప‌రిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మ‌రుతుంద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

నిజానికి.. ఇటీవ‌ల ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌లు నియామ‌కాల్లో ఎక్కువ‌గా ఇంజినీరింగ్ విద్యార్థులే క‌నిపిస్తున్నారు. పంచాయ‌తీ, పోలీస్ కానిస్టేబుల్‌.. ఇలా చిన్న‌చిన్న ఉద్యోగాల‌కు ఎక్కువ‌గా ఇంజినీరింగ్ విద్యార్థులే ద‌ర‌ఖాస్తు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొద‌ట్లో ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఏర్ప‌డిన ఇంజినీరింగ్ క‌ళాశాలు తాజా ప‌రిస్థితుల‌తో మూత‌ప‌డే దిశ‌గా వెళ్తున్నాయి.

తెలంగాణ‌లో ఇంజినీరింగ్ విద్య ఢ‌మాల్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts