ద‌టీజ్ జ‌గ‌న్‌.. అగ్రిగోల్డ్ బాధితుల్లో ఆనందం

July 13, 2019 at 10:57 am

అగ్రిగోల్డ్‌.. ఈ పేరు విన‌గానే.. లక్ష‌లాది మంది క‌న్నీటిగాధ వినిపిస్తుంది. రోడ్డున ప‌డ్డ కుటుంబాల ద‌య‌నీయ స్థితి క‌నిపిస్తోంది. ల‌క్ష‌లాది మంది నుంచి పెద్ద‌మొత్తంలో డ‌బ్బులు సేక‌రించిన అగ్రిగోల్డ్ సంస్థ‌.. ఆ త‌ర్వాత బోర్డు తిప్పేయ‌డంతో ఎన్నో కుటుంబాలు వీధిన‌ప‌డ్డాయి. పైసాపైసా కూడ‌బెట్టిన సొమ్ము మందిపాలు కావ‌డంతో గుండెల‌విసేలా రోదించినా ప‌ట్టించుకున్న‌వారు లేదు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో బాధితులు ఎన్నో ఆందోళ‌నలు చేసినా క‌నిక‌రించిన పాపాన పోలేదు.

ఎన్న‌డు కూడా చంద్ర‌బాబు ఆ బాధితుల బాధ‌ల‌ను విన‌డానికి కూడా స‌మ‌యం కేటాయించ‌లేదు. కానీ.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి.. తొలి మంత్రివ‌ర్గ భేటీలోనే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల‌కు అండ‌గా నిలిచారు. ఆ బాధిత కుటుంబాల‌కు భ‌విష్య‌త్‌పై భ‌రోసా క‌ల్పించే నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా.. శుక్ర‌వారం నాడు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్లో పెద్ద‌మొత్తంలో అగ్రిగోల్డ్ బాధితుల‌కు కేటాయించి.. ద‌టీజ్ జ‌గ‌న్‌..! అని అనిపించుకున్నారు.

తొలి కేబినెట్‌లో రూ.1150కోట్లు కేటాయిస్తూ.. తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు.. ఆర్థిక శాఖ మంత్రి ప్ర‌వేశ‌పెట్టిన 2019-2020 బ‌డ్జెట్‌లో ఆ మొత్తాన్ని పొందుప‌రిచి.. అగ్రిగోల్డ్ బాధితుల క‌ళ్ల‌లో ఆనందం నింపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభ‌కోణంగా పేర్కొన్న అగ్రిగోల్డ్ బాధితుల‌ను ఆదుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది.

నిజానికి.. ఈ అగ్రిగోల్డ్ సంస్థలో వివిధ రాష్ట్రాల‌కు చెందిన సుమారు 32ల‌క్ష‌ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఇక సంస్థ బోర్డు తిప్పేసిన త‌ర్వాత ఖాతాదారులు ఆందోళ‌న‌కు దిగారు. అనేక చోట్ల ఫిర్యాదులు చేశారు. ఈ మేర‌కు కేసులు కూడా న‌మోదు అయ్యాయి. కానీ.. ఎక్క‌డ కూడా బాధితుల‌కు న్యాయం జ‌ర‌గ‌లేదు. వారిది క‌న్నీటిగాధ‌గానే మిగిలిపోయింది.

జ‌గ‌న్ అధికారంలోకి రాగానే.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన వారు 9ల‌క్ష‌ల మంది వ‌ర‌కు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు చెబుతున్నాయి. మొద‌ట వీరిని ఆదుకునేందుకు జ‌గ‌న్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని బ‌డ్జెట్‌లో కేటాయించింది.

ద‌టీజ్ జ‌గ‌న్‌.. అగ్రిగోల్డ్ బాధితుల్లో ఆనందం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts