జ‌గ‌న్ బ‌డ్జెట్‌: సామాన్యుల‌కు పెద్ద‌పీట‌

July 12, 2019 at 4:42 pm

ఏపీలోని కొత్త ప్ర‌భుత్వం వైసీపీ ప్ర‌వేశ పెట్టిన 2019-20 వార్షిక బ‌డ్జెట్ సామాన్యుల న‌డ్డి విరిచేదిగా కాకుండా.. సామాన్యుల‌ను ఆద‌రించేదిగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు అసెంబ్లీలో త‌న బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు. మొత్తం 2,27,974 కోట్లతో రూపొందించిన ఈ బ‌డ్జెట్‌లో ఎక్కువ భాగం రైతుల‌కు పెద్ద‌పీట వేసినా.. అదేస‌మ‌యంలో సామాన్యుల జీవితాల‌కు కూడా భ‌రోసా ఇచ్చేదిగా సాగింది. రూ.400 కోట్లతో ఆటో, టాక్సీ డైవ‌ర్ల సంక్షేమానికి నిధిని ఏర్పాటు చేశారు.

వైసీపీ అధినేత జ‌గ‌న్ సుదీర్ఘ పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలో ఆయా వ‌ర్గాలకు ఇచ్చిన హామీ మేర‌కు ఈ కేటాయింపులు భారీగానే చేసిన‌ట్టు అర్ధ‌మ‌వుతోంది. ఇక‌, రాష్ట్రంలో ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉన్న అగ్రి గోల్డ్ కార‌ణంగా ఆర్థికంగా కుదేలైన బాధిత కుటుంబాల‌ను ఆదుకునేందుకు 1150 కోట్ల‌ను ఈ బ‌డ్జెట్‌లో ప్ర‌వేశ పెట్టారు. దీనిని కోర్టులో డిపాజిట్ చేయ‌డం ద్వారా ఆయా కుటుంబాల్లో ఆర్థిక భ‌రోసాను నింప‌నున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కొత్త‌గా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేయ‌డం కోసం రూ.2 వేల కోట్లు కేటాయిం చారు.

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం.. ఈ ఏడాది ఖ‌ర్చు కింద రూ.500 కోట్లు కేటాయించ‌డం ద్వారా తాను రాజ‌ధాని నిర్మాణానికి వ్య‌తిరేకం కాద‌నే విష‌యాన్ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి పంపారు. ఆరోగ్య శ్రీ కార్య‌క్ర‌మానికి 1740 కోట్ల‌ను, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో మౌలిక వ‌స‌తుల‌కు 1500 కోట్ల‌ను కేటాయించ‌డం ద్వారా సామాన్యుల ఆరోగ్యానికి కూడా జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చారు. ఇక‌, ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళంలో ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉన్న కిడ్నీ రోగ గ్ర‌స్థుల‌కు సేవ‌లు అందించేందుకు, ఈ రోగంపై ప రిశోధ‌న‌లు చేసేందుకుగాను రూ.50 కోట్ల‌ను కేటాయించారు. వాస్త‌వానికి ఇది గ‌త ప్ర‌భుత్వ కేటాయింపుతో పోల్చుకుంటే.. నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఆశావ‌ర్క‌ర్ల వేత‌నాల‌కు 436 కోట్ల‌ను, చిన్న‌త ర‌హా ప‌రిశ్ర‌మల అభివృ ద్ధికి రూ.200 కోట్ల‌ను కేటాయించారు. త‌ద్వారా ఉపాధి పెంపున‌కు జ‌గ‌న్ పెద్ద‌పీట వేశారు. వైఎస్సార్ గృహ‌వ‌స‌తి ద్వారా పేద‌ల‌కు అటు గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో ఇళ్లు నిర్మించే కార్య‌క్ర‌మానికి రూ.5 వేల కోట్ల‌ను ఈ బ‌డ్జెట్‌లో కేటాయించారు. సాధార‌ణ విద్య‌కు 3 వేల పైచిలుకు కోట్లు కేటాయించారు. త‌ద్వారా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని స్కూళ్ల‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ తీసుకున్న‌ట్టు అయింది. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ బ‌డ్జెట్ సామాన్యుల‌పై ఆదిలోనే వ‌రాలు కురిపించింది.

జ‌గ‌న్ బ‌డ్జెట్‌: సామాన్యుల‌కు పెద్ద‌పీట‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts