వైసీపీలో మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే..!

July 18, 2019 at 12:56 pm

ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామంటూ పార్టీ స‌భ్య‌త్వం స్వీక‌రించే స‌మ‌యంలో ప్ర‌మాణం చేసే నాయ‌కులు.. త‌ర్వాత కాలంలో త‌మ అవ‌స‌రాలు-అవ‌కాశాలు ఎటు మ‌ళ్లితే.. అటే రాజ‌కీయాలు చేయ‌డం కామ‌న్‌గా మారిపోయింది. ఈ నేప‌థ్యంలోనే పార్టీలో ఆధిప‌త్య ధోర‌ణులు, పైచేయి కోసం పాకులాట‌లు పెరిగిపోయాయి. మ‌రీ ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీలో కీల‌క నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు పెరుగుతోంది. ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం దుందుభి మోగించింది. 

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఓట్ల‌ను గంప‌గుత్తగా కొల్ల‌గొట్టి.. ప్ర‌త్య‌ర్థి పార్టీ టీడీపీకి ఛాన్సే లేకుండా చేసింది. ఇలా విజ‌య‌న‌గ‌రంలోనూ వైసీపీ త‌న స‌త్తా చాటుకుంది. ఈ జిల్లాలోని మొత్తం అన్ని స్థానాల్లోనూ వైసీపీ జ‌య‌కేత‌నం ఎగుర వేసింది. దీంతో టీడీపీ ప‌త్తా లేకుండా పోయింది. ఇక‌, ఈ జిల్లా నుంచి విజ‌యం సాధించిన మాజీ మంత్రి సీనియ‌ర్ నాయ‌కుడు, చీపురుప‌ల్లి ఎమ్మెల్యే బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏకంగా విజ‌యంన‌గ‌రం జిల్లాపైనే ఆధిప‌త్యం సాధించాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో జిల్లాలో రాజ‌కీయ దుమారం దిశ‌గా వైసీపీ అడుగులు వేస్తున్న‌ట్టు అయింది. 

జిల్లా మొత్తం త‌న‌దే పైచేయి కావాల‌ని బొత్స భావిస్తున్నారు. నిజానికి ఇక్క‌డ మ‌రో బ‌ల‌మైన వైసీపీ నాయ‌కుడు కూడా ఉన్నారు. ఆయ‌నే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి. వైసీపీ కోసం ఆయ‌న బాగానే పోరాడారు. పార్టీ అధినేత జ‌గ‌న్ వ‌ద్ద కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవ‌ల ఏర్ప‌డిన వైసీపీ ప్ర‌భుత్వంలో కోల‌గ‌ట్ల‌కు వైశ్య సామాజిక వ‌ర్గం కోటాలో మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావించారు. అయితే, ఈయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే.. త‌న‌కు ఇబ్బందేన‌ని భావించిన బొత్స.. కోల‌గ‌ట్ల‌కు మంత్రి ప‌ద‌వి రాకుండా అడ్డుప‌డ్డార‌న్న టాక్ కూడా ఉంది.

క‌ట్ చేస్తే.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి ప‌లుకుబ‌డి ఉన్న కోల‌గ‌ట్ల జిల్లాలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అదే స‌మ‌యంలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌కుండా అడ్డుపడ్డార‌నే ఉద్దేశంతో మంత్రి బొత్స‌పై కూడా ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇక‌, తానే మంత్రిని కాబ‌ట్టి జిల్లాలో ఏం జ‌రిగినా, ముఖ్యంగా జిల్లా కేంద్ర‌మైన విజ‌య‌న‌గ‌రంలో ఏం జ‌రిగినా కూడా త‌న‌కు తెలియాల‌ని బొత్స దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో రాజ‌కీయంగా ఇప్పుడు విజ‌య‌న‌గ‌రంలో వైసీపీ తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు వేలు పెట్టినా స‌హించేది లేద‌ని కోట‌గ‌ట్ల నేరుగానే హెచ్చ‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో తాను మున్సిప‌ల్ శాఖా మంత్రిని క‌నుక ఏం జ‌రిగినా త‌న‌కు తెలిసే జ‌ర‌గాల‌ని బొత్స అన‌ధికార అదేశాలు జారీ చేశారు.  దీంతో ఇప్పుడు ఇరువురు నాయ‌కుల మ‌ధ్య జిల్లాలో ఆధిప‌త్య పోరు తార‌స్థాయికి చేరుకుంది. మ‌రికొన్ని నెలల్లోనే స్థానికి ఎన్నిక‌లు ఉన్న  నేప‌థ్యంలో బొత్స వ‌ర్గం కీల‌కంగా చ‌క్రం తిప్పాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో బొత్స వ‌ర్సెస్ కోల‌గ‌ట్ల రాజ‌కీయాలు చాలా ఆసక్తిగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వీటికి ఇప్ప‌టికే చెక్ పెట్టి ఉండాల్సింద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

వైసీపీలో మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts