హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌ర‌గా… కోడంగ‌ల్‌కు దూరంగా..!

August 21, 2019 at 4:00 pm

‘ నేను ఓడినా.. గెలిచినా.. కోడంగ‌ల్ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటా. నా తుదిశ్వాస వ‌ర‌కూ ఇక్క‌డే ఉంటా. కోడంగ‌ల్ ప్ర‌జ‌ల వ‌ల్లే నేను ఈ స్థాయిలో నిల‌బ‌డినా.. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను ‘ అంటూ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ త‌ర్వాత భావోద్వేగంతో కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇవి. అయితే.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా రేవంత్‌రెడ్డి ఓడిపోయారు. అయితే.. అంతే అనూహ్యంగా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని మ‌ల్కాజ్‌గిరి స్థానం నుంచి విజ‌యం సాధించి, సంచ‌ల‌నం సృష్టించారు. అయితే.. ఇదంతా అంద‌రికీ తెలిసిన విష‌యమేగానీ.. తాజా ప‌రిణామం ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి వ్య‌వ‌హార శైలిలో ఎక్క‌డో తేడా కనిపిస్తోంది. త‌న స‌హ‌జ‌త్వానికి భిన్నంగా ఉంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

త‌న‌ను ఓడించిన కోడంగ‌ల్‌కు దూరంగా.. గెలిపించి ఢిల్లీకి పంపిన మ‌ల్కాజ్‌గిరికి ద‌గ్గ‌రగా రేవంత్‌రెడ్డి ఉంటున్నార‌ని ఆయ‌న అనుచ‌రులు చ‌ర్చించుకుంటున్నారు. అంటే.. ఓడించిన కోడంగ‌ల్ ప్ర‌జ‌ల‌పై రేవంత్‌రెడ్డి కోపం పెంచుకున్నారా..? అనే అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్ల గెలిచిన త‌ర్వాత ఆయ‌న ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలోనే కోస్గిలో స‌న్మాన స‌భ‌ను ఏర్పాటు అనుచ‌రులు. అయితే.. ఈస‌భ‌లో రేవంత్‌రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ‘ కోడంగ‌ల్ ప్ర‌జ‌లు న‌న్ను ఓడించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా.. మీరు ఓడించడం వ‌ల్లే ఈరోజు నేను పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో గెలిచి ఢిల్లీకి వెళ్లిన‌ ‘ అంటూ రేవంత్ రెడ్డి అన్నారు.

ఇప్పుడు ఆయ‌న వ్యాఖ్య‌లపై భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి. త‌న‌న ఓడించిన కోడంగ‌ల్ ప్ర‌జ‌ల‌పై కోపంతోనే రేవంత్‌రెడ్డి ఇలా అన్నార‌ని కొంద‌రంటుంటే.. లేదులేదు కోడంగ‌ల్ ప్ర‌జ‌ల‌ను ఆయ‌న ఎన్న‌డూ మ‌రిచిపోర‌ని, ఆయ‌న ప్రేమ‌తోనే ఆ మాట‌లు అన్నార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఇక ఇంకొంద‌రు అయితే.. ఇక కోడంగ‌ల్‌కు రేవంత్‌రెడ్డి రానేరార‌ని, ఆయ‌న హైద‌రాబాద్‌కే ప‌రిమితం అవుతార‌ని చెబుతున్నారు. కాగా, 2009, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి కోడంగ‌ల్ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌రెడ్డి అనూహ్యంగా 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. కోడంగ‌ల్‌కు దూరం అయ్యార‌నే ప్ర‌చారంపై రేవంత్‌రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌ర‌గా… కోడంగ‌ల్‌కు దూరంగా..!
0 votes, 0.00 avg. rating (0% score)