దొనకొండ వరకూ వెళ్లకపోవచ్చు!

August 22, 2019 at 10:29 am

అమరావతి ప్రాంతంనుంచి రాజధాని తరలిపోతుందనే అభిప్రాయం ఇప్పుడు ముమ్మరంగా వ్యాపిస్తోంది. అమరావతిలో నిర్మాణం ప్రభుత్వం మీద చాలా భారం పెంచుతుందని బొత్స వ్యాఖ్యానించినప్పటినుంచి సర్వత్రా ఇదే చర్చనీయాంశంగా ఉంది. తెలుగుదేశం వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వైకాపా వారు సమర్థించుకునే పనిలో ఉన్నారు. రాజధాని దొనకొండకు తరలిపోతుందనే పుకార్లు ముమ్మరంగా వ్యాపిస్తున్నాయి. ఇంతకూ ఈ విషయంలో నిర్ణయం తీసుకోగలిగిన ముఖ్యమంత్రి జగన్.. అమెరికాలో ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో వైకాపా సీనియర్ నాయకుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాటలను గమనించినప్పుడు మాత్రం రాజధాని దొనకొండకు తరలిపోవడం అంత సులువుగా జరగకపోవచ్చునని అనిపిస్తోంది. పల్లపు ప్రాంతం పైగా నల్లరేగడి భూముల్లో రాజధాని నిర్మాణం వద్దని శ్రీకృష్ణ కమిటీ ముందే చెప్పినట్లుగా ఆళ్ల గుర్తు చేస్తున్నారు. మంగళగిరి వద్ద ఉన్న 15 వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని మాత్రం వాడుకుని, రైతుల భూముల్ని వదిలేయాలని కమిటీ సూచించినట్లుగా ఆయన చెబుతున్నారు. బొత్స మాటల్లో తప్పు లేదని అంటూనే.. మంగళగిరి ప్రాంతం మాత్రమే రాజధానికి అన్ని రకాలుగా అనుకూలం అంటున్నారు.

ఈ మాటలను బట్టి.. జగన్ సంకల్పిస్తున్న రాజధాని.. ప్రస్తుతం అమరావతి అంటున్న ప్రాంతం నుంచి కాస్త పక్కకు జరిగి మంగళగిరిలోనే కేంద్రీకృతం అవుతుందని అనుకోవాల్సి వస్తోంది. మరీ.. ఇక్కడ ఎత్తేసి దొనకొండలో పెట్టేస్తారనుకోవడం భ్రమలాగా కనిపిస్తోంది. నిజానికి రాజధాని అంటే.. కోర్ కేపిటల్ మాత్రమే. సెక్రటేరియేట్, అసెంబ్లీ, హైకోర్టు, తత్సంబంధిత ప్రభుత్వ పెద్దల నివాసగృహాలు మాత్రమే రాజధాని అనిపించుకుంటాయి. ఈ మాత్రం కోర్ కేపిటల్ నిర్మానానికి 15 వేల ఎకరాలు కూడా చాలా ఎక్కువ.

కానీ.. అచ్చంగా ఆళ్ల చెప్పినట్టు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అన్నట్లుగా చంద్రబాబు.. రైతుల్ని మభ్యపెట్టి.. దాదాపు 33 వేల ఎకరాలు సేకరించారు. కోర్ కేపిటల్ నిర్మాణాల్ని నల్లరేగడి భూముల్లో పెట్టారు. వాటిని కాస్త దిద్దుకుంటే.. మంగళగిరిలోనే రాజధాని వచ్చే అవకాశం కూడా ఉంది. రైతులకు ఎలాంటి అసంతృప్తి లేకుండా.. ఎవరి పొలాలు వాళ్లకే ఉంటాయి. కోర్ కేపిటల్ కు అనుబంధంగా వచ్చే నిర్మణాలు, అద్భుతాలకు కూడా ఇబ్బంది ఉండదు. ఆ రకంగా జగన్మోహన రెడ్డి సర్కారు ఉభయతారకంగా రాజధాని ప్లాన్ ముందుకు తీసుకెళ్తుందనే అభిప్రాయం కలుగుతోంది.

దొనకొండ వరకూ వెళ్లకపోవచ్చు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts