కుటుంబ పాలన.. పాచి విమర్శ కాదా?

August 19, 2019 at 3:33 pm

కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని, ఆయన కుటుంబంలోని వ్యక్తులకు తప్ప… మరెవ్వరికీ తెలంగాణ రాష్ట్రం వల్ల లాభం జరగడం లేదని.. అనేక విమర్శలు చాలా సంవత్సరాలనుంచీ ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందంటే నమ్మడం కష్టం. కల్వకుంట్ల చంద్రశేఖర రావు తప్ప.. ఆయన కుటుంబం నుంచి మరెవ్వరూ కూడా కీలక ప్రభుత్వ పదవుల్లో లేరు. కానీ.. ఇప్పుడు కూడా అదే కుటుంబపాలన విమర్శలతో వారిని ఇరుకున పెట్టాలని చూస్తే.. అవి పాచిపోయిన విమర్శలే అనిపించుకుంటాయి. భాజపా నేత జేపీ నడ్డా తన హైదరాబాదు పర్యటనలో అదే పనిచేశారు.

తెలుగుదేశం మరికొందరు ఇతర పార్టీల నాయకులు కమలతీర్థం పుచ్చుకుంటున్న సందర్భంగా, భాజపా హైదరాబాదులో పెద్ద సభనే నిర్వహించింది. కేంద్రంనుంచి జెపి నడ్డా వచ్చారు. అయితే ఆయన కేసీఆర్ మీద విమర్శలు చేయడానికే ఎక్కువగా శ్రద్ధ పెట్టారు. అయినా పర్లేదు. విధానాల మీద విమర్శలు, విధానాల్లో ఉన్న లోపాలు, ప్రజా సంక్షేమానికి అవి ఎంత దూరంగా ఉన్నాయి.. లాంటి విమర్శలైతే బాగానే ఉండేది. ప్రస్తుతం సత్యదూరంగా కనిపించే విమర్శల మీద ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టడమే కామెడీగా అనిపిస్తోంది.

జెడ్డా ప్రధానంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ అవినీతిన మీద ఫోకస్ చేశారు. కాళేశ్వరం ఇప్పుడు ఓపెనింగ్ కూడా అయిపోయింది. భగీరథ ఫలాలు చాలాచోట్ల అందుతున్నాయి. ఇప్పుడు వాటిని ఆడిపోసుకుని లాభమేముంది. కొత్త మునిసిపాలిటీ బిల్లు, కొత్త రెవెన్యూ చట్టం ఇలాంటి విషయాల్లో జెడ్డా విమర్శలు గుప్పించి ఉంటే అప్ డేటెడ్ గా ఉండేది.

పైగా కేసీఆర్ కుటుంబపాలన గురించి ఆయన విమర్శలు చేశారు. గత అయిదేళ్ల ప్రభుత్వం గడువు ముగియగానే.. ఆ విమర్శలకు కాలదోషం పట్టిపోయింది. కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ ఎమ్మెల్యేలుగా గెలిచినా వారిని కేబినెట్ కు దూరం పెట్టారు. అనధికారికంగా- కేటీఆర్ అధికారకేంద్రం అయితే అది వేరే సంగతి. చివరికి కూతురు ఎంపీగా కూడా ఓడిపోయారు. ఇప్పుడు కూడా… కేసీఆర్ కుటుంబపాలన సాగిస్తున్నారంటూ విమర్శలు చేస్తే సమకాలీన తెలంగాణ రాజకీయాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు అనుకోవాల్సిందే.

కుటుంబ పాలన.. పాచి విమర్శ కాదా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts