బాబు అహంకారం : జగన్‌ను దున్నపోతు అంటారా?

August 8, 2019 at 11:19 am

చంద్రబాబునాయుడు నలభయ్యేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన చాలా సార్లు చెప్పుకునే రీతిగా దేశంలో ఆయనంత అనుభవం ఉన్నవారు ఇంకెవ్వరూ లేకపోవచ్చు. ఆయన అనుభవం మొత్తం, రాజకీయ పరిణతి మొత్తం హఠాత్తుగా మంటగలిసిపోయిందో ఏమిటో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రిని పట్టుకుని ‘దున్నపోతు’ అని వ్యవహరిస్తూ మాట్లాడడం అంతగా నేలబారు పదాలతో రాజకీయం చేయడం అనేది పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడినుంచి ఈ రాష్ట్ర ప్రజలు ఊహించని సంగతి.

చంద్రబాబునాయుడు బుధవారం నాడు విజయవాడలో మాట్లాడుతూ తాను గంగిగోవు లాంటి వాడినని అభివర్ణించుకున్నారు. తాను రాష్ట్ర ప్రజలకు పుష్కలంగా పాలిచ్చిన ఆవు వంటి వాడిని అని.. ఈ ప్రజలు తనను కాదనుకుని దున్నపోతు ప్రభుత్వ పాలనను ఎందుకు కోరుకున్నారో అర్థం కావడం లేదని చంద్రబాబునాయుడు పాపం ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగానే.. ప్రజలు తనను, తన పార్టీని, తాను భావి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టదలచుకున్న పుత్రరత్నం లోకేష్ ను ఎందుకు తిరస్కరించి బుద్ధి చెప్పరో చంద్రబాబుకు తెలియదు అని అనుకుంటే పొరబాటు. కానీ దానిని గుర్తించనట్లుగా ఆయన నటిస్తున్నారని అనిపిస్తోంది.

అలా గుర్తించకపోవడం వల్ల ఆయనకు ఒక ఎడ్వాంటేజీ ఉంది. ప్రజలు అమాయకులు, జగన్ ను నమ్మి మోసపోతున్నారు అని మొసలి కన్నీళ్లు కార్చవచ్చు. తన ప్రభుత్వ వైఫల్యాలతో విసిగిపోయి, తన చేతకానితనం పట్ల ఆగ్రహంతో ఓడించారని ఒప్పుకుంటే గనుక.. ఆయన ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది. అందుకే ఆయన ఇలా మాటలు మార్చి మాట్లాడుతున్నారని అనిపిస్తోంది.

చంద్రబాబునాయుడు గతంలో చాలా సందర్భాల్లో… నన్ను.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని మోసగాడు అంటారా? అలా తిడతారా? ఇలా తిడతారా? ఇది రాష్ట్ ప్రజలందరికీ అవమానం కాదా? అని కేసీఆర్ తనను తూలనాడిన సందర్భాల్లో బహిరంగ వేదికల మీద ఆక్రోశం వెళ్లగక్కారు. అక్కడికేదో తాను ముఖ్యమంత్రి అయితే.. దైవాంశసంభూతుడు అయినట్లుగా భావించుకున్నారు. పొరుగు రాష్ట్ర సీఎం తిడితేనే.. అంత కోపం వచ్చినప్పుడు.. ఈయన రాష్ట్రంలో ఉంటూ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను ‘దున్నపోతు’ అని అభివర్ణిస్తూ తిట్టడం ఇంకెంత చౌకబారుతనం అనిపించుకుంటుంది…..? ఆ సంగతి ఆయనే ఆలోచించుకోవాలి.

బాబు అహంకారం : జగన్‌ను దున్నపోతు అంటారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts