చిదంబరం అరెస్ట్ : కానూన్ దీవార్ కూద్ సక్‌తే!

August 22, 2019 at 9:58 am

కానూన్ కా హాథ్ బహుత్ లంబా హై అనే డైలాగు మనకు చాలా పాపులర్. ఎంతదూరం పారిపోయిన వాడినైనా చట్టం పట్టుకోగలదని ఈ డైలాగు మనకు చెబుతుంది. ఆ సత్యం.. కేంద్రప్రభుత్వంలో హోంమంత్రిగా కూడా పనిచేసిన చిదంరబరం కు తెలియదని అనుకోవడానికి వీల్లేదు. అయితే ఆయన విషయంలో మరో కొత్త డైలాగు కూడా తయారైంది. కానూన్ దీవార్ కో కూద్ సక్ తే! చట్టం- గోడదూకగలదు. గోడ దూకి అయినా సరే.. నిందితుణ్ని పట్టుకోగలదు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉంటూ.. లంచాలు మేసి.. ఐఎన్ఎక్స్ మీడియా తో సహా మరికొన్ని సంస్థలకు విదేశీపెట్టుబడులు సమకూరేలా.. సహకరించారనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. అయితే తాను, తన కుటుంబం కూడా ఎలాంటి తప్పూ చేయలేదని ఆయన అంటున్నారు. నిజమే కావొచ్చు. కానీ.. ఆరోపణ వచ్చిన తర్వాత.. కోర్టును ఆశ్రయించి.. ఆ నిజాన్ని నిరూపించుకోవడం ఆయన బాధ్యత. అలా చేయలేదు. పరారైపోయారు. కానీ పరారు కావడం వలన ఫలితం లేదని అర్థమైంది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లేకుండా లుకవుట్ నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి తాను మంచివాడిని అని చెప్పుకున్నారు. ఇంటికి వెళ్లి తలుపులు బిడాయించుకున్నారు. సీబీఐ పోలీసులు వస్తే.. ప్రహరీ తలుపులు తీయలేదు. వారికి తప్పలేదు. అదికారులు గోడదూకి లోపలకు వెళ్లి.. ఆయనను అరెస్టు చేసి బయటకు తీసుకువచ్చారు. ఆ రకంగా చిదంబరంను అరెస్టు చేయడానికి పాపం చట్టం గోడదూకవలసి వచ్చింది. కానూన్ కో దీవార్ కూద్‌నా పడా!!

చిదంబరం ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సాంప్రదాయంగా తమ కుటుంబానికి చెందిన సంపన్న వ్యాపారాలను కాదనుకుని ఆయన న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. సుప్రీంకోర్టు సహా దేశంలోని అనేకానేక హైకోర్టుల్లో వాదించిన ఘనమైన న్యాయవాది ఆయన. ఆయనకు చట్టం తెలియదని గానీ, చట్టం ఎంత గట్టిదో తెలియదని గానీ అనుకోవడానికి వీల్లేదు. అందుకే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఎదురుదెబ్బ తగిలేసరికి ఇక గత్యంతరం లేకుండాపోయింది. ఈ అరెస్టుతో కాంగ్రెస్ పార్టీకి పరువు పోయింది. వారు.. కేంద్రం, విచారణ సంస్తలను వాడుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నదని.. మూస, ఊకదంపుడు విమర్శలు చేస్తున్నారు. ఇవి ప్రజల ఎదుట నిలబడవు. న్యాయస్థానంలో ఎటూ వాటికి విలువ లేదు. అవినీతి చేయలేదని, నిజాయితీ పరుడేనని నిరూపించుకోవాలంటే వారు వేరే మార్గం వెతుక్కోవాలి.

చిదంబరం అరెస్ట్ : కానూన్ దీవార్ కూద్ సక్‌తే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts