అప్పుడు ఏపీకి రాలేదేం గులాం నబీ గారూ!

August 8, 2019 at 3:31 pm

రోమ్ నగరం తగలబడుతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడని చరిత్ర చెబుతుంది. నాయకుల్లో ఉండే అహంకారం, నిర్లిప్తతకు ఇది నిదర్శనం, ఆ సంగతి ఎలా ఉన్నా, ఇల్లు కాలి ఒకడు ఏడుస్తోంటే చుట్ట అంటించుకోవడానికి ప్రయత్నించే ప్రబుద్ధులు మన చుట్టూ ఉండే సమాజంలో అనేక మంది ఉంటారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వ్యవహారం నుంచి రాజకీయ లబ్ధి కోసం ఉబలాటపడుతున్న కాంగ్రెస్ పార్టీ, వారి నాయకులు గులాంనబీ ఆజాద్ వ్యవహరిస్తున్న తీరు కూడా అంత కంటే భిన్నంగా ఏమీ లేదు.

కాశ్మీరు ప్రజలు దుఃఖంలో ఉన్నారని వారిని పరామర్శించడానికి తాను శ్రీనగర్ వెళుతున్నానని గులాం నబీ ఆజాద్ అంటున్నారు. అసలే సునిశితమైన పరిస్థితులు నెలకొని ఉన్న కాశ్మీర్లో ఇలా నాయకుల పర్యటనల వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఆయనకు తెలియని సంగతి కాదు. అయినా నా ఆయన శ్రీనగర్ వెళ్లారంటే రాజకీయ ప్రయోజనాల
కోసమే అనుకోవాలి.

రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడం వలన అక్కడి ప్రజలు ఆవేదనతో ఉన్నారనేది ఆజాద్ వాదన. కొందరిలో ఆ బాధ ఉండవచ్చు. లడక్ ప్రాంత ప్రజల అభిలాషలతో నిమిత్తం లేకుండా ఆ ప్రాంతం మొత్తం తమలో భాగంగానే ఉండాలని కోరుకునే వారు ఖచ్చితంగా బాధపడతారు. కానీ ఇంత వెంటనే ఆజాద్ ‘పరామర్శ’ప్రయత్నం విచిత్రంగా కనిపిస్తుంది.

కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఇంతకంటే దారుణమైన రీతిలో విభజించారు. ఆనాటి సభా వ్యవహారాలు జరిగిన తీరుతో పోలిస్తే ఇవాళ చాలా గొప్పగా చేసినట్లు లెక్క. ఏపీని విభజించిన రోజున ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇంతకంటే ఎక్కువగానే దుఃఖించారు. కానీ పరామర్శకు ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరు నామమాత్రంగా కూడా రాలేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంత అరాచకంగా విభజించిన పాపంలో గులాం నబీ ఆజాద్ కూడా ప్రత్యక్ష భాగస్వామి. ఆరోజున తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనే ముసుగు తొడిగి తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చని కాంగ్రెస్ భావించింది. ఈ రోజున లడక్ ప్రజల అభిలాష లకు భారతీయ జనతా పార్టీ గుర్తింపు ఇస్తోంటే దానిని జీర్ణం చేసుకోలేక పోతున్నది. ఇలాంటి పోకడలను మానుకుంటేనే తమకు దేశవ్యాప్తంగా మనుగడ ఉంటుందని ఆ పార్టీ గుర్తించాలి. వక్రఆలోచనలతో నడిపే రాజకీయాలు దేశానికి మేలు చేయవు.

అప్పుడు ఏపీకి రాలేదేం గులాం నబీ గారూ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts