కాంగ్రెస్ నాయకులారా జాగ్రత్త పడండి!

August 8, 2019 at 4:24 pm

దేశంలోని కాంగ్రెస్ నాయకులందరూ ఒకసారి ప్రస్తుత- భవిష్యత్ పరిస్థితులను బేరీజు వేసుకుని తమ ప్రస్థానాన్ని ప్లాన్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అయినట్లుగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించడం అనేది.. తమ మౌలిక సిద్దాంతంగా భావిస్తూ వారి ప్రతి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడడం వారి పాలసీ కావొచ్చు. కానీ, జమ్మూ కశ్మీర్ విషయంలో ఇంకా దాన్ని సాగదీస్తూ.. జమ్మూకశ్మీర్ కు ద్రోహం జరిగిపోయిందని ఎడాపెడా వాగుతూ ఉంటే.. ఆ పార్టీకే నష్టం జరుగుతుంది.

ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి ప్రాభవం ఇప్పట్లో అసాధ్యం అని 2019 ఎన్నికలు నిరూపించాయి. ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు, కాబోయే ప్రధాని అనే ట్యాగ్ లైన్ తో ఎన్నికల బరిలోకి దిగిన రాహుల్.. సాంప్రదాయంగా కొన్ని దశాబ్దాలుగా తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న నియోజకవర్గంనుంచి ఓడిపోయినప్పుడే.. ఆ పార్టీ వెలుగులు ఎంత మసకబారిపోయాయో ప్రజలకు అర్థమైంది. రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

దేశవ్యాప్తంగా ప్రజలను దృష్టిలో పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రజాకంటక నిర్ణయాలను హైలైట్ చేస్తూ కాంగ్రెస్ ప్రజాపోరాటాలు నడిపితే దానివల్ల పార్టీ తిరిగి పుంజుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రస్తుతం వాతావరణం అలా కనిపించడం లేదు. మోడీ పాలనలో అలాంటి లోపాలు కాంగ్రెస్ కు కనిపిస్తున్నాయో లేదో తెలియదు గానీ.. వారు ఇప్పటిదాకా ఒక్క జమ్మూకాశ్మీర్ వ్యవహారాన్ని మాత్రమే అత్యంత సీరియస్‌గా పట్టించుకుని రాద్దాంతం చేస్తున్నారు.

రకరకాల కారణాల దృష్ట్యా జమ్మూకాశ్మీర్ గొడవలో ఎంత ఎక్కువగా భాజపాను వ్యతిరేకిస్తే.. దేశంలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అంతగా తిరస్కార భావం ప్రబలుతుందని వారు తెలుసుకోవాలి. ఇప్పటికే వారి తీరును ప్రజలు సహించలేకపోతున్నారు. ఈ నిర్ణయంతో భాజపా గ్రాఫ్ కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో… ఏదో గులాం నబీ ఆజాద్ ముఖప్రీతికి అన్నట్లుగా… కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాల్లో కూడా, కశ్మీర్ కారణం మీద మోడీ వ్యతిరేక ఉద్యమాలు చేశారంటే గనుక.. వారి పరువు కూడా పోతుంది.

కాంగ్రెస్ రాజ్యసభ చీఫ్ విప్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో పలువురు నాయకులకు మార్గదర్వకంగా కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో ఉండడం కంటె బయటకు వెళ్లడం వల్ల తమ నియోజకవర్గాల్లో ప్రజల వ్యతిరేకత బారిన పడకుండా ఉంటాం అని వారు బావిస్తుండవచ్చు. కాంగ్రెస్ నేతలు.. ఆ పార్టీలో ఉండడం వల్ల తమ భవిష్యత్తు గురించి పునరాలోచనలో పడే పరిస్థితిని 370 రద్దు నేపథ్యం సృష్టించినట్లుంది.

కాంగ్రెస్ నాయకులారా జాగ్రత్త పడండి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts