కేసీఆర్ కట్టబెట్టే…కవితకు కొత్త ఉద్యోగం…?

August 24, 2019 at 10:07 am

రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఓటమిని మాత్రం ఆ పార్టీ వర్గాలు పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నాయి. ఊహించని విధంగా ఆమె ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అది కూడా బీజేపీ చేతిలో, అందులోనూ టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న డి. శ్రీనివాస్ తనయుడు అరవింద్ పై ఓటమి పాలయ్యారు.

అందుకే తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలని సైతం అణగదొక్కేసి పూర్తిగా బలంగా ఉన్న టీఆర్ఎస్ వర్గాలు కవిత ఓటమిని అంగీకరించలేకపోతున్నాయి. అటు మొన్నటివరకు జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉన్న కవిత ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో కూడా పెద్ద యాక్టివ్ గా కనపడట్లేదు. ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతున్నారు. ఇలా పార్టీకి దూరం కావడంపై ఆమె అభిమానులు, పార్టీ వర్గాలు నిరాశలో ఉన్నాయి.

అయితే త్వరలో కవిత అభిమానులకు, పార్టీ వర్గాలని ఉత్సాహపరిచే నిర్ణయం రాబోతుందని తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతోంది. ఆమెకు రాజకీయంగా కొత్త ఉద్యోగం ఇచ్చేందుకు టీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో పాటే ఓటమి పాలైన టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఓ కీలక పదవి కట్టబెట్టారు. రాష్ట్ర అభివృద్దికి సంబంధించిన అంశాల్లో ప్రణాళికా సంఘం అత్యంత కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడైన వినోద్ కుమార్‌కు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు.

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బి.వినోద్ కుమార్‌కు క్యాబినెట్ హోదా ఉంటుంది. క్యాబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు. వినోద్ కుమార్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ క్రమంలోనే కవిత కూడా ఓ కీలక పదవి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అవసరమైతే పార్టీకీ, ప్రభుత్వానికి కో-ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ సాగుతోంది. లేదా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి రాష్ట్ర్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశమూ లేకపోలేదని అంటున్నారు.

అటు కేబినెట్ హోదా గల రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఛైర్మన్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల రైతు సమన్వయ సమితికి రాజీనామా చేసి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పదవిని కవితకు కట్టబెట్టే అవకాశం ఉంది. మరి చూడాలి కూతురికి కేసీఆర్ ఎలాంటి ఉద్యోగం ఇస్తారో?

కేసీఆర్ కట్టబెట్టే…కవితకు కొత్త ఉద్యోగం…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts