మొట్ట‌మొద‌టిసారి డిఫెన్స్‌లో … కేసీఆర్‌కు స‌రికొత్త స‌వాల్‌..

August 18, 2019 at 10:49 am

టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొట్ట‌మొద‌టిసారిగా డిఫెన్స్‌లో ప‌డిపోయారా..? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో ఎలాగైనా పాగా వేయాల‌ని దూసుకొస్తున్న బీజేపీని ఎలా ఎదుర్కొనాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారా..? జాతీయ‌వాదంతో ముందుకొస్తున్న క‌మ‌ల‌ద‌ళాన్ని తెలంగాణ‌వాదంతో తిప్పికొట్ట‌డం క‌ష్ట‌మ‌నే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్నారా..? అంటే తాజా ప‌రిస్థితులు మాత్రం ఔన‌నే అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఒకేఒక్క సీటుకు ప‌రిమితం అయింది. కానీ.. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు వ‌చ్చే నాటికి అనూహ్యంగా నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించి, కేసీఆర్‌కు దిమ్మ‌దిరిగే షాక్‌ను ఇచ్చింది.

నిజానికి.. ఇది ఎలా సాధ్య‌మైంద‌న్న‌ది మాత్రం ఇప్ప‌టికీ కేసీఆర్‌కు ఒక‌ప‌ట్టానా అంతుచిక్క‌డంలేద‌నే టాక్ గులాబీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. నిజామాబాద్ పార్ల‌మెంట్ స్థానంలో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ, కేసీఆర్ కూతురు క‌విత‌ను బీజేపీ అభ్య‌ర్థి అర్వింద్ ఓడించి, సంచ‌ల‌నం సృష్టించారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో రెండోసారి తిరుగులేని విజ‌యం సాధించిన త‌ర్వాత మోడీ-అమిత్‌షా ద్వ‌యం మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలంగాణ‌లోనూ రాష్ట్ర నేత‌లు అదే ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ఇక పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా మాత్రం తెలంగాణ‌పై, అందులోనూ హైద‌రాబాద్‌పై ప్ర‌త్యేక దృష్టిసారించారు.

అప్ప‌టి నుంచి కాంగ్రెస్‌, టీడీపీ నుంచే గాక అధికార టీఆర్ఎస్‌పార్టీ నుంచి కూడా ప‌లువురు కీల‌క నేత‌ల‌ను లాగే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు క‌మ‌లం గూటికి చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంద‌నే టాక్ ఇప్ప‌టికే సాధార‌ణ ప్ర‌జ‌ల్లోనూ వ్య‌క్త‌మ‌వుతోంది.. ఇలా బీజేపీపై ప్ర‌జ‌ల్లో పాజిటివ్ వేవ్ మొద‌లైంది. ఇక ఇదే క్ర‌మంలో క‌శ్మీర్‌కు స్వ‌యంప్ర‌త్తిక‌ల్పించే ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసి.. ఏకంగా అన్నివ‌ర్గాల మ‌ద్ద‌తును సంపాదించింది. ఇప్పుడు పార్టీల‌కు అతీతంగా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల ఆమోదాన్ని మోడీ పొందారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్‌లోనూ అంత‌ర్మ‌థ‌నం మొదలైంద‌నే టాక్ వినిపిస్తోంది. బీజేపీని ఎలా విమ‌ర్శించాలో, రాజ‌కీయంగా ఎలా ఎదుర్కొనాలో తెలియ‌క ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, పార్టీవ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఎంత‌టి హ‌డావుడి చేశారో అంద‌రికీ తెలిసిందే. క‌రీంన‌గ‌ర్‌లో నిర్వ‌హించిన రైతు స‌మ‌న్వ‌య స‌మితి ప్రాంతీయ స‌ద‌సుల్లో కేసీఆర్ ఏకంగా మోడీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఒకానొక‌ద‌శ‌లో అనుచిత వ్యాఖ్య‌లు కూడా చేశారు.

ఈ దేశంలో జాతీయ పార్టీల‌కు అవ‌కాశం లేద‌ని, ప్రాంతీయ పార్టీల‌దే కీల‌క‌పాత్ర అని.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ తీసుకొస్తామ‌ని అనేక‌మార్లు చెబుతూ.. ప‌లు రాష్ట్రాల‌కు వెళ్లి.. అక్క‌డి నేత‌ల‌ను క‌లిశారు. కానీ.. తీరా ఎన్నిక‌ల ఫ‌లితాల ప‌రిస్థితి ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. బీజేపీ గ‌తంలో క‌న్నా అధిక సీట్ల‌తో అన్నిపార్టీల‌ను బెంబేలెత్తించింది. ఇక అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ బీజేపీపై మాట ఎత్త‌లేదు. దాదాపుగా సైలెంట్‌గానే ఉంటున్నారు. కానీ.. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లో క్ర‌మంగా బీజేపీ పుంజుకుంటోంది. ఊహ‌కంద‌ని రీతిలో దూసుకొస్తోంది. కేసీఆర్‌ను ఇరుకుపెట్టేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. హైద‌రాబాద్‌ను దేశ రెండో రాజ‌ధాని చేసే యోచ‌న‌లో కూడా మోడీ-అమిత్‌షా ద్వ‌యం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ మొట్ట‌మొద‌టిసారి డిఫెన్స్‌లో ప‌డ్డార‌ని, స‌రికొత్త స‌వాల్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ఇక ఇటీవ‌ల పార్టీవ‌ర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ పేరును ప్ర‌స్తావించ‌కుండానే..ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారుగానీ.. అవిపెద్ద‌గా అతికిన‌ట్టు లేవు. ప్ర‌స్తుతం ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయ‌ని, త‌మ‌తో ఉంటే మంచి, లేకుంటే దేశ‌ద్రోహ‌లు అన్న భావ‌న పెరిగిపోతుందంటూ ప్ర‌జాసంఘాల నేత‌ల త‌ర‌హాలో కేటీఆర్ స్పందించారు. మ‌రి క‌మ‌ల‌ద‌ళాన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి మ‌రి.

మొట్ట‌మొద‌టిసారి డిఫెన్స్‌లో … కేసీఆర్‌కు స‌రికొత్త స‌వాల్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts