కోర్టులో కోడెల మాట నిలబడేనా?

August 27, 2019 at 10:00 am

‘‘ప్రతి ఒక్క చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది.’’ న్యూటను మూడో సూత్రం ఇది. డాక్టరీ చదివిన మాజీ స్పీకరు కోడెల శివప్రసాదరావుకు ఇది ఖచ్చితంగా తెలుసు. కాబట్టే.. ఒక నష్టాన్ని మరో లాభంతో భర్తీ చేయాలనుకున్నారు. పరువు నష్టం జరుగుతుండగా.. ప్రజల సానుభూతితో దాన్ని భర్తీ చేయాలనుకున్నారు. ఎంతవరకు సక్సెస్ అయ్యారో తెలియదు. కానీ.. ఇంకాస్త డేమేజీ జరగకుండా ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఏమవుతుంది?

అవును- ఇదంతా కూడా.. అసెంబ్లీ ఫర్నిచర్ మాయం చేశారని, సొంతానికి తరలించుకున్నారనే ఆరోపణలకు సంబంధించిన వ్యవహారమే. అది ఇప్పుడు న్యాయపీఠం ఎదటకు చేరింది. తన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ను అసెంబ్లీ అధికారులు తీసుకువెళ్లిపోయేలా ఆదేశించాలని కోరుతూ కోడెల శివప్రసాదరావు.. హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను మాత్రమే కొత్తగా గమనించిన ఎవరైనా.. ఆయన ఫర్నిచర్ ఇచ్చేస్తోంటే.. అసెంబ్లీ ఎందుకు తీసుకువెళ్లట్లేదు చెప్మా అని ఆశ్చర్యపోతారు.

అయితే కోర్టులో ఆయన వాదన నిలబడుతుందా? లేదా? అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఆయన అక్రమంగా తరలించుకు వెళ్లారనే ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత మాత్రమే.. ఆయన ఈ టాపిక్‌పై పెదవి కదిపారు. ప్రభుత్వం మారాక, జూన్ 7వ తేదీనే తాను అసెంబ్లీకి లేఖ రాశానని మాత్రం ఆయన చెప్పారు. తాజాగా కూడా ఒక లేఖ రాశాను వారికి చేరలేదేమో అన్నారు. ఆయన అసెంబ్లీకి పంపినట్లుగా రిజిస్టరు పోస్టు రసీదులను చూపిఉన్నా సరిపోయేది. అలాంటిదేం ఉన్నట్లు లేదు. కానీ.. ఇంత సిల్లీ పరువు నష్టం ఆరోపణలు వెల్లువలో.. ఆయన ఆస్పత్రి పాలయ్యారు కూడా. అసెంబ్లీ అధికారులు దయ లేకుండా.. ఆయన మీద పోలీసుకేసు పెట్టారు. ఈలోగా కోడెల హైకోర్టుకు వెళ్లారు.

నేను లేఖ రాశాను, వారికి అందలేదేమో.. అని ప్రెస్ మీట్ లో చెప్పినట్టుగా కోర్టులో చెబితే కుదరదు. అందుకే కోడెల వాదన నిలబడకపోవచ్చు. ‘‘వాళ్లు అడుగుతున్నారు- మీరు తీసుకెళ్లమంటున్నారు… మధ్యలో మా టైం వేస్ట్ చేస్తారెందుకు?’’ అని కోర్టు భావించినా తప్పు లేదు. కానీ… కోడెల ఆశించిన తరహాలో ఉపశమనం మాత్రం దొరక్కపోవచ్చు.

కోర్టులో కోడెల మాట నిలబడేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts