వైసీపీ ఎంపీ వృక్షాబంధ‌న్ ఛాలెంజ్‌… బెస్ట్ రాఖీతో గిఫ్ట్ కొట్టేయండి

August 14, 2019 at 5:19 pm

తోటి మ‌నిషినేకాదు.. ఈ గాలిని.. ఈ నేల‌ను.. ఈ చెట్టును.. చేమ‌ను ప్రాణ‌స‌మానంగా ప్రేమించే వాళ్లు మ‌న‌కు చాలా అరుదుగా క‌నిస్తారు ఈ స‌మాజంలో. అందులోనూ మ‌న‌కు ప్రాణ‌వాయువును ప్ర‌సాదించే చెట్ట‌మ్మ‌ను ప్రాణ‌ప‌థంగా భావించే వాళ్లు ఇంకా అరుదుగా ఉంటారు. ఈ కోవ‌లోకే వ‌స్తారు మ‌న ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీ‌ధ‌ర్‌. ఆయ‌న‌కు చెట్టంటే ప్రాణం. నిజ‌మే.. ఆ చెట్టే ప్రాణ‌వాయువును ఇవ్వ‌కుంటే.. మాన‌వ మ‌నుగ‌డే లేద‌ని అంటారు ఆయ‌న‌. అయినా.. ఇందులో కొత్తేమి ఉంద‌ని మ‌న‌కు అనిపించ‌వ‌చ్చు. కానీ.. మనిషి త‌న‌ చెత్త ప్ర‌వ‌ర్త‌న‌తో కూర్చున్న కొమ్మ‌నే న‌రుక్కుంటున్నాడు.

అందుకే ఆయ‌న ఎక్క‌డ ఉన్నా.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌నే నినాదంగా ముందుకు క‌దులుతున్నారు. ఇక్క‌డ మ‌రొక విష‌యం చెప్పాలి. త‌న ఇంటికి వ‌చ్చిన వారికి కేవ‌లం పేప‌ర్‌క‌ప్‌లో మాత్ర‌మే టీ ఇస్తారు ఏపీలోని ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్‌. ఇదేమిటి.. రాజ‌కీయ నాయ‌కులు ఓ మొక్క‌ను నాటి.. ఉప‌న్యాసాలు దంచిపోతారుగానీ.. ఇలా చెట్టు ర‌క్ష‌ణ కోసం ప‌ట్టుబట్టి ప‌నిచేసే వారు కూడా ఉన్నారా..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? నిజ‌మే.. ఇది నిజంగా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన విష‌య‌మే. కానీ.. రాజ‌కీయ నేత‌ల్లో కోట‌గిరి శ్రీ‌ధ‌ర్‌ది ప్ర‌త్యేక పంథా.. అన్నిటికంటే ముందుగా.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణే మాన‌వ స‌మాజ ల‌క్ష్యం కావాల‌ని కోట‌గిరి అంటున్నారు.

ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణ కాలుష్యం ప్ర‌మాద‌క‌ర‌స్థాయిలో ఉందని.. అది ఈరోజు కాక‌పోచ్చుగానీ.. అది ఏదో ఒక రోజు త‌ప్ప‌కుండా మాన‌వాళి వినాశ‌నానికి దారితీస్తుంద‌ని.. అందుకే మనం క‌లిసిక‌ట్టుగా చెట్టును కాపాడుకుందామ‌ని ఆయ‌న పిలుపునిస్తున్నారు విద్యార్థిలోకానికి. ఈనెల 15న రక్షాబంధ‌న్ పండుగ ఉంది. ఇదే రోజున ర‌క్షాబంధ‌న్‌తోపాటు.. వృక్షాబంధ‌న్‌ను జ‌రుపుకుందాం.. ప్ర‌కృతితో మ‌న బంధాన్ని స‌రికొత్త‌గా నిర్వ‌చిద్దాం.. అని ఎంపీ కోట‌గిరి పిలుపునిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఒక ఛాలెంజ్ కూడా విసురుతున్నారు.

“ ఏలూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని పాఠ‌శాల‌ల విద్యార్థినీ, విద్యార్థులూ.. మీ సృజ‌నాత్మ‌క‌త‌ను ఉప‌యోగించి, రాఖీ త‌యారు చేసి, మీ పాఠ‌శాల‌లోగానీ.. గ్రామంలోగానీ.. ఇంటి ఆవ‌ర‌ణ‌లోని వృక్షానికి ఆ రాఖీని క‌ట్టి ఫొటో తీసి ఈ పోస్ట్‌కు కామెంట్ రాసి రిప్లై ఇవ్వండి.. ఉత్త‌మ రాఖీకి.. ఈ చిత్రానికి ప్ర‌త్యేక బ‌హుమ‌తి ఇస్తా “ అంటూ ఎంపీ కోట‌గిరి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇక కోట‌గిరి ప్ర‌య‌త్నంపై అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

వైసీపీ ఎంపీ వృక్షాబంధ‌న్ ఛాలెంజ్‌… బెస్ట్ రాఖీతో గిఫ్ట్ కొట్టేయండి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts